Home కరీంనగర్ అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

31mtp-10-photo-02 31mtp-10-photo-01కరీంనగర్: మండలంలోని వేంపల్లిలో గుగ్లావత్ తిరుపతి అనే రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజమౌళిగౌడ్ తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఎకరం స్వంత భూమితో పాటు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుండడంతో తిరుపతి ఆందోళనకు గురయ్యాడు. గతేడాది వ్యవసాయం కోసం చేసిన రూ. 2 లక్షలకు తోడు ఈ ఎడాది మరో రూ. లక్ష అప్పు చేసిన తిరుపతి వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో కుమిలిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళిన తిరుపతి మంచి నీళ్ళు తాగేందుకు ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉరి వేసుకొని తనువు చాలించాడు. మృతునికి భార్య రమాదేవీ, ఇద్దరు పిల్లలు సంజన(4), జస్వంత్(2)లు ఉన్నారు. రమాదేవీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజమౌళిగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.