Home లైఫ్ స్టైల్ అమ్మాయిలకు అమ్మే ఆది గురువు..!

అమ్మాయిలకు అమ్మే ఆది గురువు..!

Age girls questions

 

పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో ఎన్నో సందేహాలు. తమ చుట్టూ చూసేవి, అనుభవించేవి. ఊహకందేవి అందనివీ కూడా. ఇవన్నీ ఎవర్ని అడగాలి? కచ్చితంగా అమ్మనే. ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చే ప్రతి అనుమానం వాళ్ళ దేహం గురించే. ఒక వయస్సు వచ్చేసరికి వాళ్ళ శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. వాళ్ళు మానసికంగా సిద్ధం అయి వుండరు. ఆ అంశాన్ని గురించి ఎలాంటి ప్రశ్న వేసినా ముందు అమ్మలకే గొంతు పెగలదు. అమ నేనెక్కడ నుంచి వచ్చాను అనే చాలా మంది వేసే ప్రశ్న. ఇలాంటి మాట చెవిన పడగానే తల్లి కంగారుపడి పోయి ఛీ.. అవేం మాటలు? ఎక్కడ నేర్చుకుంటున్నావ్? నోర్ముయ్ అని బెదిరించి వాళ్ళ నోరు మూస్తారు గానీ అది వాళ్ళు తెలుసుకునే వయసుగా గుర్తించరు. తల్లి ముఖం చూసి తామెదో తప్పు చేశామన్న అపరాధ భావనలో పిల్లలు వెళ్ళిపోతారు. సమాచార విప్లవం మొదలై సైన్స్‌లో లైంగిక అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చిన తరువాత పిల్లల్లో సహజంగానే స్త్రీ పురుషుల శారీరక నిర్మాణంలోని తేడాలపైన ఆసక్తి కలుగుతుంది. ఆ వయసులో తెలుసుకోవాలనే కోరికతో తమ స్నేహితులను, ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తారు.

ఫలితంగా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి దూరంగా జరిగిపోతారు. ఆసక్తి చంపుకోలేరు. సమాచారం అందదు. సరైనదీ, సక్రమైనదీ పిల్లలకి అందితే పర్లేదు. వాళ్ళు అనవసరమైన విషయాలపై దృష్టి మళ్ళించుకొంటే ప్రమాదం. అందుకే పిల్లలకు సరైన మార్గంలో చెప్పగలిగేది తల్లే. ముఖ్యంగా కూతుళ్ళను వయసుకు తగ్గట్టుగా సిద్ధం చేయటం తల్లి బాధ్యత. రజస్వల వయసు వచ్చే సరికి, ముందే ఆ నెలవారీ ఇబ్బంది గురించి తల్లి చెప్పాలి. ఎందుకు ఇబ్బంది, దాని లక్షం ఏమిటీ? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే వైజ్ఞానిక వివరణ ఇవ్వాలి. కొత్త ప్రశ్నలు వేస్తే అవకాశం ఇవ్వాలి. ప్రోత్సహించాలి. బహిష్టుతో పాటు లైంగిక కలయిక, గర్భం వచ్చే తీరు వివరించాలి. ఇలా వాళ్ళకు తెలియజేస్తేనే వాళ్ళలో లైంగిక పరమైన అమాయకత్వం పోతుంది. లేని పోని సమస్యలు కొని తెచ్చుకోరు. అలాగే సెక్స్ కోర్కెలు ఎందుకు ఎలా కలుగుతాయో ఆ వయసులో ఆకర్షణలు ఎలా ఏర్పడతాయో వాటి వల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఆడపిల్లలకు తల్లి చెప్పుకోవాలి.

పదహారేళ్లు దాటుతూనే అవసరమైతే ఓ హోస్టల్‌లోనే చదువుకోవలసిన అమ్మాయి లైంగిక విజ్ఞానం గురించి తెలుసుకుంటేనే జాగ్రత్తగా ఉండగలదు. టీనేజీలో ఎదురయ్యే ఎన్నో ఆకర్షణలు గురించి వాళ్ళు ఒక ఎరుకతో జీవితంలో మొదటి అడుగులు వేస్తారు. టీనేజ్ ఒక రకంగా తిరుగుబాటు దశ. దేన్నీ అంగీకరించకుండా అన్నీ స్వయంగా అనుభవించి తెలుసుకోవాలనుకొంటారు. కొత్తగా దొరికిన స్వత్రంతం వాళ్ళని కొత్తదనాన్ని రుచి చూడమంటుంది. కానీ దానికి పరిమితులు ఉండాలని తల్లి తెలియజేయాలి. గర్భం వచ్చే ప్రమాదం, ఆడపిల్లలకు తెలియాలి. అలాంటి సమయం వస్తే ఆడపిల్లల ఎంత ఒంటరిదయిపోతుందో చెప్పాలి. అలాగే తమ విచ్చలవిడితనాన్ని సహించమని కూడా స్పష్టం చేయాలి.

టీనేజీలో అమ్మాయిలు చక్కని రూపాన్ని సంతరించుకుంటారు. తమ ఇష్టం వచ్చిన రీతిలో అలంకరించుకోవాలని భావిస్తారు. ఈ విషయంలో వాళ్ళు రాజీ పడనక్కరలేదు. తల్లి అనుభవశాలి. జీవితంలో ఆ దశను దాటివచ్చిన మనిషి. తన సొంత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలు చక్కగా ఎలా తయారుకావచ్చో ఒక వేళ అమ్మాయిల్లో ఆకర్షణీయ అంశాలు లేకపోతే వాళ్ళు ఆతన్యూనతలో పడకుండా, సాటి వాళ్లతో పోల్చుకొని తమ శరీరపు అందచందాల గురించి విచారాలు పడకుండా తల్లే పిల్లలకు అసలైన సౌందర్యం గురించి, హుందాతనాన్ని గురించి నేర్పించాలి. పోషకాహారం, బరువును కంట్రోల్ లో ఉంచుకొనే అవసరం, చర్మ సౌందర్య చిట్కాలు, డ్రస్ వేసుకొనే పద్ధతి. ఆ వయసుకు కావలసిన మేకప్, ఆభరణాలు సర్వం తల్లే మొదటి గురువై ఆడపిల్లకు నేర్పాలి.

ఆలోచనలకు ఆరోగ్యానికి ఉండే సంబంధం గురించి పిల్లలు తెలుసుకోవాలి. కెరీర్‌లో మొట్టమొదటి అడుగు వేసే దశ. అమ్మాయి జీవితపు గ్రాఫ్‌ను తల్లి కళ్ళకు కట్టేలా చూపించాలి. చదువు ప్రాముఖ్యత, జీవితంలో ఆమె స్థిరపడబోయే విధానం. అనవసర అంశాల వైపు దృష్టి పోనివ్వకుండా లక్షం వైపే చూడగలిగే ఏకాగ్రత అమ్మాయి తెలుసుకోవలసిన అంశాలు. తల్లి వాళ్లను గమనించే స్వతంత్రం మాత్రం తీసుకోవాలి. అంతేకానీ నిరంతరం వాళ్ళను వెంటాడే సిఐడిల్లాగా తల్లులు వ్యవహరించకూడదు. తమను అనుమానిస్తూ ఉందని గ్రహించిన మరుక్షణం పిల్లలు మనసు దాచుకుంటారు.

చాలా మంది తల్లులకు వయసు వచ్చిన కూతురుపైన ప్రేమతో పాటు అనుమానం కూడా జాస్తిగానే ఉంటుంది. ఆంక్షలతో వాళ్ళని కంట్రోల్‌లో ఉంచగలరని తల్లులు భావిస్తారు. కానీ పిల్లలు అమాయకులు కారని గ్రహించాలి. వాళ్ళది నేర్చుకొనే వయసు. ఏ విషయమయినా చిటికెలో నేర్పిస్తారు. తల్లి తనను అనుమానించే విషయాన్ని కూడా ఆమె పట్ల నమ్మకం తగ్గుతూ ఉంటే ఆ ప్రేమను, నమ్మకాన్ని, ఆదరణను ఇంటి బయట వెతుక్కుంటారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లోనే తమను ఫేవర్ చేసే అబ్బాయిల ఆకర్షణకో మాటలకో దొరికి పోతారు.

అమ్మాయిలు వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దడంలో ఇంటి పనులు, మర్యాదలూ, సమాజంలో మెలిగే పద్ధతులతో పాటుగా, శరీరం గురించి అందం గురించి స్త్రీ పురుష సంబంధంతో లైంగిక ఆనందం వాటిని పొందటంతో ఉన్న సామాజిక ఇబ్బందులు వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబ సంక్షేమం గురించి తల్లి క్షుణ్ణంగా నేర్పితేనే ఆమె పెంపకంలో ఆడపిల్లలు సంస్కారానికి రూపాలుగా పెరుగుతారు. బిడ్డకు మొదటి గురువుగా తల్లిది ఒక అసాధరణ పాత్ర. ఆమె వేసిన ప్రాథమిక పునాదితో ప్రపంచం గురించి ఆమె ఇచ్చిన నమ్మకంతో సమాజానికి పనికొచ్చే వాళ్ళవుతారు. చదువుతో పాటు వ్యక్తిత్వం లైంగిక పరమైన పరిజ్ఞానం అవసరమేనని తల్లులు గుర్తిస్తే ఒక ఉత్తమమైన మహిళాతరాన్ని సమాజానికి అందించగలవారు అవుతారు.

పుట్టిన మరుక్షణం నుంచి బిడ్డను గుండెకత్తుకొని ప్రేమను మాత్రమే పంచే తల్లి పాత్ర ఈ తరంలో ఇంకాస్త బాధ్యతాయుతంగా ఉండాలి. వారి భావోద్వేగాలను కూడా ఒడిసి పట్టుకొని వాళ్ళను భవిష్యత్తు మార్గదర్శకాలుగా వ్యవహరించాలి. వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్ట సుఖానికీ నేనున్నాననీ ధైర్యాన్ని వారికి రక్తంలో ఇంకేలా ఇవ్వగలగాలి.

బిడ్డలు ఆమె నుంచి వారసత్వంగా మానవత్వం, దయ కరుణ, అర్థం చేసుకొనే తత్వం, దేన్నయినా ఇవ్వగలిగే మంచి మనసు, కష్టాన్ని ధీరత్వంతో ఎదుర్కొనే తెగువ, ప్రేమించే మనసు అన్నీ రావాలి. తల్లి ప్రేమను నిర్వచించే పదాలు బహుశా ఇంకా ఎవరూ సృష్టించలేదు.

mother is first teacher her daughters

Telangana Latest News