Search
Friday 21 September 2018
  • :
  • :

అరణ్య రోధనగా వన్యప్రాణుల సంరక్షణ

Deer-image

మంచిర్యాల: వన్యప్రాణుల సంరక్షణ అరణ్య రోధనగా మిగులుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో వన్యప్రాణుల వేట జోరుగా సాగుతుంది. దీనికి తోడు వాహనాల వేగం వల్ల రోడ్డు దాటుతున్న వన్య ప్రాణులు వాహనాలకు తాకి దుర్మరణం చెందుతున్నాయి. జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై అధికారుల నిఘా తప్పింది. అభయారణ్యంలో ఉంటున్న జంతువులకు రక్షణ లేకుండా పోయింది. ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు గాయపడిన పులి కోసం ప్రత్యేక ట్రాకర్లను పిలిపించి గాలిస్తుండగా ఇప్పటి వరకు జాడ తెలియలేదు. దీనికి తోడు తాజాగా ఆదివారం తెల్లవారు జామున నస్పూర్ మండలంలోని ఆర్కే5 గని వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. అటవీ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బోర్డులు పెట్టినప్పటికి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల వాహనాలు వేగంగా వెళ్లి జంతువుల ప్రాణాలు తీస్తున్నాయి. వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అటవీశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదు. పట్టణాల్లో ఉంటూ విధులు నిర్వహించడం వల్ల వేటగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోటపల్లి ఏరియాలో గల కృష్ణ జింక వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మూడు జంతు అభయారణ్యాలు ఉన్నాయి. ఏకంగా 1,05,806 చదరపు కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మంచిర్యాల జిల్లాలో కృష్ణ జింకల అభయారణ్యం, మొసళ్ల అభయారణ్యంతో పాటు జన్నారం ఏరియాలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నప్పటికి రెండు అభయారణ్యాల్లో వేటగాళ్లు సంచరించినట్టుగా సిసి కెమెరాల పుటేజీల్లో కనిపించాయి. ప్రాణహిత సరిహద్దులను వెంచపల్లి అటవీప్రాంతంలో గతంలో 30 నుంచి 50 వరకు కృష్ణజింకలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గినట్లు సమాచారం. అటవీ అధికారులు వారికి కేటాయించిన హెడ్‌క్వార్టర్లలో ఉండకుండా పట్టణ ప్రాంతాల నుంచి విధులకు హజరు కావడం వల్ల వన్యప్రాణుల సంరక్షణ పై నిఘా పెట్టడం లేదు. దీంతో వేటగాళ్లు అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమర్చి అటవీ జంతువులను హతమార్చి యదేచ్చగా మాంసాన్ని అమ్మకాలు జరుపుతున్నారు. నీరు, ఆహారం లభించక జంతువులు బయటకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి.

శివ్వారంలో తగ్గుతున్న మొసళ్లు …..
జైపూర్ మండలంలోని శివ్వారం మొసళ్ల అభయారణ్యంలో దినదినానికి మొసళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. 30 నుంచి 35 వరకు మొసళ్లు ఉంటాయని అధికారులు భావిస్తుండగా ఇటివలి కాలంలో మొసళ్ల గణన చేయలేదు. వీటి రక్షణపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులు పర్యటించిన సమయంలోనే ఎల్- మడుగులో అప్పుడు అప్పుడు బోటింగ్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారే తప్ప సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటాం….
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం తెలిపారు. వన్య ప్రాణుల అభయారణ్యాల చుట్టూ రక్షణ కోసం ట్రెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, జంతువులకు అవసరమైన ఆహారం, అవి తినే మొక్కలను పెంచుతున్నామన్నారు. అంతే కాకుండా ఇటివల వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న పులి జాడ కోసం ప్రత్యేక ట్రాకర్లను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు తీసుకున్నామన్నారు. అటవీ ప్రాంతంలో వేటగాళ్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

Comments

comments