Home లైఫ్ స్టైల్ ఈ ఆత్మహత్యలు ఆపదెవరు?

ఈ ఆత్మహత్యలు ఆపదెవరు?


suicideగంటకో విద్యార్థి ఆత్మహత్య                                                                                                                                                                  

తెలుగు రాష్ట్రాల్లో
ఈ విద్యాసంవత్సరంలో
ఇప్పటికే వంద మంది

కాలేజీల్లో కనబడని కౌన్సిలర్లు
దేశంలో కరువొచ్చిన సైకియాట్రిస్టులు

ఎన్నిగంటలు చదివినా మార్కులలోకి వారి శ్రమ కన్వర్ట్ అవకపోవడంతో తల్లిదండ్రులు కూడా డీలాపడుతున్నారు. ఎన్ని డబ్బులు పెట్టి చదివించినా మా పిల్లలు ఇంతే అని ఒక డ్రాస్టిక్ కంక్లూజన్‌కు వచ్చేస్తున్నారు. అదే మాట వారి మొహంమీదే అనేస్తున్నారు. దాంతో పిల్లలు మరింత దెబ్బతింటున్నారు. వారి మీద వారికి పూర్తిగా నమ్మకం పోతోంది. ఫలితంగా జీవించడం దండగ అనే భావన వారిలో బలపడుతోంది. కాలేజీ లెక్చరర్లు కూడా పిల్లలకు కుదురుకునే అవకాశం ఇవ్వకుండానే గ్రేడింగ్ ఇచ్చేసి వారిని కిందికి దించేయడంతో అది మరింత సప్రెసింగ్‌గా తయారవుతోంది. చదువులు పేరు చెప్పి మోయరాని బరువును తలకెత్తి, అనుక్షణం టెన్షన్‌పెట్టి వారిని మనమే మానసికంగా చిత్రవధ చేస్తున్నాం. ఈ బాధలు భరించలేక వారు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే కడుపులో చిచ్చుపెట్టిపోయారని మనమే బాధపడుతున్నాం. పెద్దల ఓవర్ యాంబిషన్ వల్ల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. చదువుల బాధపడలేక పారిపోతున్నారు. నగరంలోని బోడుప్పల్‌లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న పెద్దపల్లిజిల్లా గోదావరిఖనికి చెందిన సాయిప్రజ్వల ఇలాగే పారిపోయింది. ఆమె వెళ్ళిపోయి అయిదు రోజులు గడిచినా ఏమైపోయిందో ఎక్కడికిపోయిందో తెలియలేదు. కాలేజీలో విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు ఎంత గొప్పగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతుంది. కాలేజీల్లో పాఠాలు చెప్పేవారికికానీ, హాస్టల్లో పిల్లలను గమనించే స్టాఫ్‌లో కాని కారుణ్యం, కనికరం రవ్వంత కూడా కనబడదని పిల్లలు తరుచు కంప్లయింట్ చేస్తుంటారు. చదువుకోడానికి వచ్చినట్టుగాకాక జైలు శిక్ష అనుభవించడానికి వచ్చినట్టుగా ఉందని పిల్లలు రిపీటెడ్‌గా కంప్లయింట్ చేస్తున్నారు. ఇది ఏదో ఒక విద్యాసంస్థపై వస్తున్న ఫిర్యాదు కాదు. అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి.  తెలుగు రాష్ట్రాలలో ఈ విద్యాసంవత్సరంలో ఇంతవరకు 100 మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. జాతీయ స్థాయిలో ఈ పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ప్రతి గంటకొక విద్యార్థి ఎక్కడో ఒకచోట ఎందుకో ఒకందుకు తనువుచాలిస్తున్నాడు. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) 2015 తాజా రికార్డుల ప్రకారం ఆ యేడాది 8,934 విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. విద్యార్థుల బలవన్మరణాలలో మహారాష్ట్ర ముందుంది. 2015లో 8, 934 మంది ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 1, 230 మంది అంటే 14% మంది ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు (955), ఛత్తిస్‌ఘడ్ (625) ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు వంటి పురోగామి రాష్ట్రాలలోనే ఈ స్థాయిలో ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్ష ఎంత తీవ్రంగా వీరి మీద పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారుగా ఉంటున్నారు. 2015 గణాంకాల ప్రకారం 70% పిల్లలు లక్ష వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు చెందిన వారిగా తేలింది. గత అయిదేళ్ళ సగటును గమనిస్తే విద్యార్థుల బలవన్మరణాల సంఖ్య 39,775. అధికారిక చిట్టాలకెక్కని మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. 1529 వయసులో ఉన్న యువత చేసుకునే ఆత్మహత్యల సంఖ్య కూడా మన దేశంలోనే ఎక్కువ అని లాన్స్‌ట్ రిపోర్టు చెబుతోంది. 1995-2000 లో 1400 మంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సైన్స్ ఒంటబట్టని పిల్లలను డాక్టర్లు కావాలని పీడిస్తున్నాం. ఇంజనీరింగ్ అంటేనే లెక్కలు. ఆ కోర్సులోకి లెక్కల్లో డొక్కశుద్ధిలేని పిల్లలను తరుముతున్నాం. గతంలో ఎంసెట్ రాసి మంచి కాలేజీలో చేరితే కాంపస్ సెలక్షన్ వచ్చి పిల్లాడు సెటిలైపోతాడు అని అనుకునేవారు. ఇప్పుడు ఆశ అడ్రస్‌మారింది. తల్లిదండ్రులు చూపు ఐఐటిల మీద పడింది. అందుకని పిల్లలను ప్రాథమిక విద్యాలయాలలోనే ఐఐటి టార్గెట్‌గా చదివిస్తున్నారు. పేరెంట్స్ వెర్రితనం తేలికగా అందివస్తుంటే వదులుకోవడమెందుకని ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌ల వాళ్ళు కూడా ఆ రకమైన కోచింగ్ ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇలా చేయడం అనవసరం..అది సరైన వయసు కాదు అని స్కూల్ నిర్వాహకులకు కూడా తెలుసు. అయినా వచ్చిన అవకాశాన్ని క్యాష్‌చేసుకోడమే కార్యక్రమంగా కోచింగ్ ఇస్తున్నారు. ఆ వయసులో ఏం చెప్పినా వారికి గుర్తుండదు. పైగా వారికి పది, ఇంటర్‌మీడియెట్ అనే రెండు మార్క్ చేజింగ్ చదువులు ఉన్నాయి. వాటి మీద కన్నుపెడుతూ వీటిని చదవాలి అంటారు పెద్దలు. నిజానికి పదోతరగతిలో మరీ మంచి మార్కులు వస్తే తప్ప ఏ కార్పొరేట్ కాలేజీ తగినంత ఫీ రాయితీ ఇవ్వదు. ధర పెంచి దించి సరుకులు అమ్ముకునే వ్యాపారనీతినే వారు పాటించి ఫీజులు పెంచి తల్లిదండ్రులకు మెహరానీ చేసినట్టుగా కొద్దిగా తగ్గించి సీటు అమ్ముకుంటారు. పరీక్షల ఫలితాలు రాకుండానే పిల్లలను వేటాడే సంస్కృతి కార్పొరేట్ సంస్థలది. ఇంటికి వచ్చి మరీ బేరాలు పెడుతుంటారు. కనుక కార్పొరేట్ కాలేజీలో సీటురాదన్న భయం లేదు. అయినా సరే టెన్త్‌క్లాస్‌లో పిల్లలను రుబ్బిపారేస్తారు. టీనేజ్‌లోకి కూడా అడుగుపెట్టని ఈ చిన్నారులను చదువుల పేరుతో వేధించేస్తారు. ఇంటర్‌మీడియెట్‌లో పిల్లలను మంచిమార్కులు రావాలని, ఎంసెట్‌లో మంచి మార్కులు రావాలని, శాట్, నీట్, జిప్‌మర్, మణిపాల్, బిట్స్‌పిలాని అంటూ నానారకాల పరీక్షల పేర్లు చెప్పి పిల్లలను నానా పెడతారు. ఒకొక్క పరీక్షతీరు ఒకొక్క రకం కావడంతో అన్నిటికీ ఒకే పద్ధతిలో ప్రిపేర్ అవడానికి ఉండదు. అందుకని వాళ్ళను వందరకాలుగా ప్రిపేర్ చేయిస్తుంటారు. ఆ రంపపు కోత ఇంతా అంతా కాదు. చదివీ చదివి బుర్రవేడెక్కిపోతుంది. అంత కష్టపడడానికి అవసరమైన శక్తినిచ్చే పౌష్టికాహారం వారికి అందదు. ఇది కూడా వాళ్ళ అండర్ పెర్ఫార్మెన్స్‌కు ఒక కారణం. పిల్లల మీద ఇంతింత భారం పడుతున్నా వారికి మానసికంగా ఓదార్పు లభించేలా మోటివేషన్ ఇచ్చేందుకు కౌన్సిలర్ అనేవాడు ఎక్కడా కనబడడు. ఇంత కష్టపడి చదివినా, పెద్దలు కోరుకున్న పెద్ద చదువులలో చేరినా ఉద్యోగం దొరకక యువత నానాబాధలు పడుతున్నారు. ఒక సాధారణ నిరుద్యోగి కన్నా ఇలా రక్తంపిండుకుని చదువుకున్న నిరుద్యోగిలో డిప్రెషన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగ యువతలో ఆత్మహత్యలు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా మారుతోంది. ఎదగబోయి ఎదురుదెబలు తింటున్న వారిని ఆదరించేందుకు, కొన్నయినా మంచిమాటలు చెప్పి ఓదార్చడానికి మన సమాజంలో ఎలాంటి ఏర్పాట్లు లేవు. అందుకే పిల్లలు మానసికంగా శక్తి పుంజుకోలేకపోతున్నారు. మానసిక ఆరోగ్య నిపుణుల కొరత చాలా ఉంది. మనసు చెదిరిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నా వీరి సంఖ్య పెరగడంలేదు. వాస్తవ అవసరానికి వీరి అందుబాటుకు మధ్య 95% గ్యాప్ ఉంది. 130 కోట్ల జనాభా గల మన దేశంలో 3,800 మంది సైకియాట్రిస్టులు, 898 క్లినికల్ సైకాలజిస్టులు, 850 మంది సామాజిక కారకర్తలు, 1500 మంది సైకియాట్రిక్ నర్సులు ఉన్నారని కేంద్రప్రభుతం ఈ మధ్య లెక్కలు చెప్పింది. కామన్‌వెల్త్ లెక్కల ప్రకారం ప్రతి లక్ష మందికి కనీసం 5.6 సైక్రియాటిస్టులు ఉండాలి. అంటే ఈ లెక్కన మన దేశంలో కనీసం 66, 200 మంది సెకియాట్రిస్టులు ఉండాలి. ఇది చాలాదా మన మనసులు మండిపోవడానికి. మన యువకిశోరాలను అక్కున చేర్చుకుని ఓదార్చడానికి మన ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. మన దేశం ఆరోగ్య బడ్జెట్‌లో 0.06% నిధులు మానసిక ఆరోగ్యం కోసం ఖర్చుపెడుతోంది. ఈ విషయంలో బంగ్లాదేశ్ మనకన్నా మెరుగ్గా ఉంది. ఆ దేశం మానసిక ఆరోగ్యం కోసం 0.44% నిధులను వ్యయం చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు దీని కోసం 4% నిధులు వెచ్చిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియజేస్తోంది.