Home కరీంనగర్ ఉద్యమమే ఊపిరి ‘అన్న’ అమరవీరుల గుర్తుగా ..

ఉద్యమమే ఊపిరి ‘అన్న’ అమరవీరుల గుర్తుగా ..

నేటితో ముగియనున్న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
జిల్లా పోలీసులు అప్రమత్తం, కూంబింగ్‌లతో వారం రోజులుగా పోలీస్ నిఘా

2KNR01P7కరీంనగర్: గత నెల 28న ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మంథని నియోజకవర్గంలో మహాదేవ్‌పూర్ మండలం అటవీ ప్రాంతాలైన పంకెన, పరిమళ గ్రామాల నుండి మొదలుకొని మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ సరిహద్దు, ఇటు ఖమ్మం జిల్లా భధ్రాచలం అటవీ ప్రాంతం వరకు ఉన్న నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో మావోయిస్టులు అమలవీరుల సంస్మరణ వారోత్సవాలను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసినట్లు సమాచారం. వరంగల్ రేంజ్ డిఐజి బి. మల్లారెడ్డి పర్యవేక్షణలో కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీగా కూంబింగ్‌లు వాహనాల తనిఖీల కార్యక్రమం నడువడంతో నక్సల్స్ అమరుల వారోత్సవాలు అంతా సులువుగా జరుపుకోలేకపోయారు.

img_2093వారోత్సవాలకు ఒక రోజు ముందు గడ్చిరోలి జిల్లాలో బ్యానర్లు వెలియడంతో మహదేవపూర్ ప్రాంతంలో ముకునూర్, లీలంపల్లి, దమ్మూరు, లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోల కదలికలతో అడవుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఎస్‌పి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతాలన్నీ జిల్లాను జల్లెడ పడుతుండడంతో ప్రభావిత గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే నక్సల్స్‌కు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా పోరాటాలకు ఓ రకమైన మార్కు ఉంటూ వచ్చేది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండవసారి మావోయిస్టుల వారోత్సవాలకు చెప్పుకున్నంత అనుకూలంగా లేకపోవడంతో రహస్యంగానే అమరవీరులను స్మరించుకొని పట్టున్న ప్రాంతాల్లో సభలు జరిగినట్లు సమాచారం. జిల్లా ఎస్‌పి జోయల్ డేవిస్ చేపట్టిన తనిఖీ కార్యక్రమాల ప్రభావం ఈ సందర్భంగా స్పష్టంగా కనబడింది. అయితే నక్సల్‌బరి ఉద్యమ నిర్మాత చార్‌మజుందార్ స్మారకార్థం మావోయిస్టులు కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిల అమరత్వాన్ని స్మరిస్తూ జూలై 28 నుంచి ఆగస్టు ౩ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా నిర్వహించడం ఆనవాయితీ.

అప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్ల పోరాటాలు, సింగరేణి కార్మిక సమాఖ్య ఉధృతమైన పోరాటాల నుండి ప్రస్తుతం దండకారణ్యం వరకు మావోయిస్టులు పోరాటాలను కొనసాగిస్తున్నారు. ఎంతో ఉధృతంగా మొదలైన కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ఉద్యమం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత ఉనికిని జిల్లాలో చాటుకోవడం లేదనేది పోలీసులు చెబుతున్న మాటలు కాగా.. ఇప్పుడు వారోత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించడం, వారోత్సవాల్లో నక్సల్స్ కదలికలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ఉద్యమాల జిల్లా కరీంనగర్‌లో ప్రశాంతతను నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి అటు మావోయిస్టులు ప్రకటించిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు.. ఇటు పోలీసుల నిఘా నేత్రాలు ఈ వారం రోజుల పాటు అటవీ ప్రాంతాలన్నీ, నక్సల్స్ ప్రభావిత గ్రామాలన్నీ హైఅలర్ట్‌తో ఉన్నాయని చెప్పవచ్చు.