Home ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో… వేడెక్కిన రాజకీయం

ఉమ్మడి జిల్లాల్లో… వేడెక్కిన రాజకీయం

Anticipate for election notification

హోరెత్తుతున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూపు
ప్రచారంలో ముందున్న టీఆర్‌ఎస్
ఖరారు కాకపోయినా మహాకూటమి అభ్యర్థుల ప్రచారం

మన తెలంగాణ/ ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయకపోయినప్పటికీ అధికార పార్టీ టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందస్తుగా తమ అభ్యర్థులను ప్రకటించారు. ఆ పార్టీ అభ్యర్థులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గల అన్ని నియోజకవర్గాల్లో ము మ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. మహాకూటమిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, టిజెఎస్‌లు తమ అభ్యర్థులచే ప్రచారాన్ని ఆయా నియోజకవర్గాల్లో కొనసాగి స్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. దీంతో ఖమ్మం అవిభాజ్య జిల్లాలో అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతుంది. మరో వారం రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందు వరుసలో ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ ప్రచారంలో ముందుండటంతో పాటు ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్‌లలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. మరో పక్క ఆయన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తుంది. మంత్రి తుమ్మల తన నియోజకవర్గమే కాకుండా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఆ పరిధిలోని ముఖ్య నాయకుల సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 7న ఖమ్మంలో రా్రష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను పురస్కరించుకుని బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతుండగా ఆయన పర్యటనను కూడా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్ పలు నియోజకవర్గాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మధిర, పినపాకలో మల్లు భట్టివిక్రమార్క, రేగా కాంతారావులు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ (చిన్ని)లు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని అభ్యర్థులు సైతం తమ అభ్యర్థికే సీటు ఖరారవుతుందని ముందస్తుగా ప్రచారాన్ని తమదైన శైలిలో కొనసాగిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో సీపీఐ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులు ఖరారవుతారని ముందస్తుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ అభ్యర్థులంతా ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు ఖరారైతే ప్రచారం మరింత వేడెక్కనుంది.