Search
Wednesday 26 September 2018
  • :
  • :

కళ తప్పిన కేజ్ కల్చర్

రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటిమట్టం 

చేపల పెంపకానికి శాపం
మరికొద్ది రోజుల్లో వర్షాలు కురియకపోతే వేలాది మంది ఉపాధికి గండి
potd-net-throw_3004686kఆదిలాబాద్: వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయంతో పాటు చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా జిల్లాలో అమల వుతున్న కేజ్ కల్చర్ ప్రాజెక్టు కళ తప్పుతోంది. జిల్లాలోని అన్నీ ప్రాజెక్టు రిజర్వాయర్‌లలో నీటి మట్టాలు పడిపోతున్నందున చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత సంవత్సరం కూడా ప్రకృతి సహాయ నిరాకరణ కారణంగా చేపల వృత్తి తీవ్రంగా నష్టపోయింది. అయితే ఈ సంవత్సరం కూడా స్థానికంగానే కాకుండా ప్రాజెక్టుల ఎగవ భాగాల్లో వర్షాలు కురియనందున రిజార్వాయర్‌లన్నీ నీరు లేక కళావిహీనంగా మారాయి.

ఇలాంటి దశలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కేజ్ కల్చర్ పథకం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోంటోంది. జిల్లాలో కడెం, సాత్నాల ప్రాజెక్టు రిజార్వాయర్‌లలో కేజ్ కల్చర్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చేప పిల్లల పెంపకంతో పాటు వరద నీటితో ఇతర చోట్లకు తరలి పోకుండా కేజ్ కల్చర్ పథకం తోడ్పడుతుంది. మత్స కారులకు పెట్టుబడులతో పాటు మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తారు. అయితే జిల్లాలో అమలవుతున్న కేజ్ కల్చర్‌ను పరిశీలించేందుకు ఇటీవల రాష్ట్ర స్థాయి బృందం పర్యటించి పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. రిజర్వాయర్‌లలో తగ్గిపోతున్న నీటి మట్టంతో కేజ్ కల్చర్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బృందం గుర్తించింది. కేజ్ కల్చర్‌ను మరింత విస్తృత పరిచేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్యాయ చర్యలపై ఈ బృందం సిఫారసు చేయబోతోంది. జిల్లా వ్యాప్తంగా చేపల వృత్తిపై దాదాపు 60 వేల కుటుంబాలు ఆధార పడి జీవిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న చేపల వృత్తికి ఈ సారి కూడా కష్టాలు తప్పే పరిస్థితి లేదంటున్నారు.

Comments

comments