Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చారుశీలగా సున్నిత భావోద్వేగాలు పలికిస్తా…

Sruthihasanఅందాలతార శృతిహాసన్ ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో దూసుకెళ్తూ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ‘రేసుగుర్రం’ సినిమాలో స్పందన పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన శృతి ‘శ్రీమంతుడు’లో మహేష్‌బాబు సరసన చారుశీలగా జతకట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వూ విశేషాలు…
గతంలో మహేష్‌తో ఓ పాట చేసిన మీరు ఇప్పుడు హీరోయిన్‌గా అతనితో జత కడుతుండడం ఎలా ఉంది?
పాటకి, సినిమాకి పోలిక ఎంతో ఉంది. ఒక నటిగా మహేష్‌బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఈ సినిమాతో కుదిరింది. స్టార్‌డమ్ పట్టని హీరో మహేష్. అందరితో కలివిడిగా ఉంటూ ఎనర్జీని పంచుతుంటారు.
మహేష్ సినిమా అని ‘శ్రీమంతుడు’ ఒప్పుకున్నారా?
అలా అని కాదు. ముందు నుండి పాత్రలో తేడాల్ని గమనిస్తూనే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలో రొమాన్స్ సాధారణమే అయినా పాత్రని తీర్చిదిద్దిన తీరు వేరుగా ఉందా లేదా అనేది చూసుకుంటా. ‘శ్రీమంతుడు’లో నా పాత్ర బాగుంటుందా, లేదా అనేది సినిమా చూశాక తెలుస్తుంది.
చారుశీల పాత్ర ప్రేక్షకులని ఎలా స్పందింపచేస్తుంది?
సెన్సిబుల్ క్యారెక్టర్ చారుశీల. గతంలో చేసిన స్పందన పాత్రకు చారుశీల పాత్రకు ఏమాత్రం పోలిక ఉండదు. నా రోల్‌లో కామెడీ ఉండదు. ఆలోచనాత్మకంగా, సున్నిత భావోద్వేగాలతో సాగే పాత్ర ఇది. ఈ రోల్ నాకు బాగా నచ్చింది.
ఈమధ్యన పాటలు పాడుతున్న మీరు ఈ సినిమాలో పాడలేదేం..?
దేవిశ్రీ ప్రసాద్‌ను ఈ విషయం అడగాలి. తమిళ్‌లో అవకాశమిస్తే పాడాను. అది పక్కన పెడితే ‘శ్రీమంతుడు’ పాటలు చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చిన పాట ‘జతకలిసే…’. తెరపై పాటలన్నీ బాగుంటాయి.
దర్శకుడు కొరటాల శివ గురించి?
దర్శకుడు వ్యక్తిగతంగా చాలా కామ్‌గా ఉంటారు. కానీ సినిమా పాత్రల్లో మాత్రం మంచి భావోద్వేగాలు పలికిస్తారు. తనకి కావాల్సిన ఔట్‌పుట్‌ను చాలా చక్కగా రాబట్టుకుంటారు.
జగపతిబాబు, సుకన్యలాంటి సీనియర్లతో నటించడం ఎలా ఉంది?
నిజంగా ఇదొక మంచి అనుభవం. జగపతిబాబు ఎంతో సన్నిహితంగా మిలిగేవారు. ఈ సీనియర్లను చూసి కొన్ని విషయాలను నేర్చుకున్నాను.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా… డబ్బింగ్ ఎప్పుడు?
నాకూ డబ్బింగ్ చెప్పాలనే ఉంటుంది. అయితే కొన్ని పదాలు అర్థం మారకుండా స్పష్టంగా పలకాలి. దానికి కాస్త సమయం పడుతుంది. భవిష్యత్తులో నా సొంత వాయిస్ వినే అవకాశముంది.

Comments

comments