Home ఖమ్మం టార్గెట్ తెలంగాణ..!

టార్గెట్ తెలంగాణ..!

Maoists-dead-image,Maoists killed in Telangana encounter

ఎన్నికల వేళ రాజకీయ నేతలే లక్షంగా మావోల యాక్షన్ ప్లాన్
ఉత్తర తెలంగాణలో ఊపందుకుంటున్న నక్సల్స్ కార్యకలాపాలు
దండకారుణ్యం నుంచి వ్యూహా రచనలు
ఏవోబిలో మావోయిస్టుల అగ్రనేతల భేటీలు
ఉమ్మడి జిల్లాలో మావోల హిట్ లిస్టులో నేతలు? 

మన తెలంగాణ/ ఖమ్మం క్రైం :  ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో తమ ప్రచార పర్యటనలు, సభలు నిర్వహించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీల  నేతలు సిద్దమవుతున్నారు. అయితే గత కొంత కాలంగా ఉత్తర తెలంగాణలో స్తబ్దంగాఉన్న మావోయిస్టులు మళ్లి తమ పూర్వవైభవాన్ని చాటుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రాలోని వైజాగ్‌లోని అరకులో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎంఎల్‌ఎ, మాజీ ఎంఎల్‌ఎను నడి రోడ్డుపైనే కాల్చి చంపి పోలీసులకే కాక ఆ రాష్ట్ర ప్రభుత్వానికే సవాల్ విసిరారు మావోలు. ఇప్పుడు తెలంగాణలో సైతం తమ పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలనే మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా అనే అనుమానాలు సైతం ఇప్పుడు పోలీసులకు, నేతలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి.  తాజాగా ఆదివారం బీజాపూర్ ప్రాంతంలో మావోలకు పోలీస్ కేంద్ర బలగాలకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

తెలంగాణలో మళ్లి మావోలు దాడులకు వ్యూహరచనలకు ఈ ఘటన ప్రారంభ సూచికంగా అర్థమవుతుంది. మావోల అగ్రనేతలందరూ ఉత్తర తెలంగాణకే చెందిన వారు కావడం ఉమ్మడి ఖమ్మంజిల్లా సరిహద్దు ఏవోబి (ఆంధ్రా, ఒరిస్సా, ఛత్తీస్‌ఘఢ్ బోర్డర్) తమ కార్యకలాపాలు విస్తృత పర్చి ఇక్కడ నుంచే తెలంగాణలో తమ ఉనికిని చాటాలనే ప్రణాళికలతో యాక్షన్ టీంలను సైతం సిద్దం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఉత్తర తెలంగాణలోని గోదావరి నది పరివాహాక ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూపాలపల్లి, వరంగల్లు, పెద్దపల్లి ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కీలక ఆగ్రనేతల ఆదేశాలతో దళాలు గత కొంత కాలంగా భారీగా రిక్రూట్‌మెంట్లు సైతం నిర్వహించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అడపా దడపా ఉమ్మడి ఖమ్మంజిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చత్తీస్‌గఢ్ , దంతేవాడ, బస్తర్, బీజాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి ప్రతికార చర్యగా వెంకటాపురం, చర్ల మండలాల్లో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల నేపంతో కొందర్నీ కాల్చి చంపడంతో పాటు సెల్ ఫోన్ టవర్లను, వాహనాలను తగలబెట్టిన సంఘటనలు గత కొంత కాలం క్రితం చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గతంలో కెకెడబ్లూ ( ఖమ్మం, కరీంనగర్, వరంగల్లు) కమిటీలు విస్తృత స్థాయిలో జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించగా 2013లో అప్పటి ఖమ్మం జిల్లా ఎస్పిగా పనిచేసిన ఎవి రంగనాథ్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు వరుస ఎన్‌కౌంటర్లతో ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. సుధాకర్, పుష్పక్కలతో పాటు మరో తొమ్మిది మంది కెకెడబ్లూ ఆగ్రనేతలు మృతిచెందారు. అనంతరం కొద్దిరోజులకే మరో మావోయిస్టు ఆగ్రనేత శ్రీరాములు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో పనిచేస్తున్న ఆగ్రనేతలంతా తెలంగాణ వారే కావడం విశేషం. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్‌కె, నిమ్మరాజిరెడ్డి, చలపతులు కేంద్ర కమిటీలో పనిచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ కమిటీలో దళ కమాండర్‌లు, దళ సభ్యులు ఉత్తర తెలంగాణ ప్రాంతం వారే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాను తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా సైతం ప్రకటించి భారీగా నిధులు సైతం విడుదల చేసింది.

గతంలో దళ సభ్యులుగా దళాల్లో చేరిన వారు అంచలంచెలుగా దళ కమాండర్ల స్థాయికి చేరుకుని కేంద్ర కమిటీ వరకు వెళ్లారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కంచాల, కరకగూడెం గుండాల జిల్లా సరిహద్దులో పువ్వర్తి ఎన్‌కౌంటర్‌లు తీవ్ర సంచలనం కలిగించాయి. పువ్వర్తి ఎన్‌కౌంటర్ లో తొమ్మిది మంది కీలక నేతలు మృతిచెందగా గ్రేహౌండ్స్‌కు చెందిన ఏఎస్‌ఐ ప్రసాద్‌ను మావోయిస్టులు మట్టుపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు బలహీన పడ్డారనే పోలీసులు అంచనా వేస్తున్నా సరిహద్దు ప్రాంతాలైన ఏవోబి నుంచి ఛత్తీస్‌గఢ్ నుంచి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒక వైపు పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్‌లు నిర్వహిస్తున్న దళాలు మాత్రం చాప కింద నీరులా తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ భారీగా రిక్రూట్‌మెంట్లు కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు సైతం పసిగట్టాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల భద్రత పై తెలంగాణ పోలీస్ శాఖ పూర్తి స్తాయిలో దృష్టిసారించింది. ఎలాంటి ఘటనలనైనా ఎదుర్కొనేలా అప్రమత్తంగాఉండాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్‌పిలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

అరకు ఘటనతో నేతల గుండెల్లో గుబులు : 
వైజాగ్ అరకులో గత వారం రోజుల క్రితం టిడిపి ఎంఎల్‌ఎ కిడారి సత్యనారాయణ, మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోములను లివిటిపుట్టు ప్రాంతంలో మావోయిస్టులు వాహనాల నుంచి కిందకు దించి కాల్చి చంపారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వారిని సుమారు 60 మంది మావోయిస్టులు దారికాచి మట్టు పెట్టడంతో దేశ వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రెకెత్కించింది. ఎక్కడో అరణ్యంలో కాకుండా మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో జన సంచారం ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు వీరిని హతమార్చడం తీవ్ర కలకలం రేపింది. అంతేకుండా తమ హిట్‌లిస్టులో మరి కొంత మంది మంత్రులు, ఎంఎల్‌ఎలు ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో అటు ఆంధ్రా, తెలంగాణ నేతల్లోనూ ఇప్పుడు మావోయిస్టులు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడతారనే గుబులు రెగుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేతలపై మావోయిస్టుల గురి ?
ఏపిలోని అరకు ఘటన అనంతరం తెలంగాణలోనూ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు ఆగ్రనాయకత్వం, కేంద్ర కమిటీ పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతుంది. గత కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో నివురు గప్పిన నిప్పులా ఉన్న మావోయిస్టులు తెలంగాణలో ఎన్నికల వేళ పంజా విసిరేందుకు యాక్షన్ టీంలను రంగంలోకి దింపి ఇప్పటికే రెక్కిలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐబి (స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో) , కౌంటర్ ఇంటిలిజెన్స్‌లు పసిగట్టాయి. దీంతో నేతల భద్రతపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు.

సమాచారమివ్వాలి..
పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాజకీయ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఏజెన్సీలో పర్యటించవద్దు హిట్ లిస్టులో నేతలే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆగ్రనేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భద్రత లేని ప్రాంతాల్లో పర్యటించవద్దని తెలిపారు. రాత్రి వేళల్లో ఎక్కడ అనువుగానీ చోట బస చేయవద్దు. ముందుగా పోలీసులకు సమాచారం అందించి పోలీసుల బందోబస్తు ఏర్పాట్ల నడుమ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు . భద్రాద్రి జిల్లా ఎస్‌పి సునీల్ దత్