Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

డిఇఓ రాజేశ్వర్‌రావుపై వేటు తప్పదా?

‘వరంగల్ వేటు’తో విద్యాశాఖలో వేడి

ఉన్నతాధికారుల విచారణతో అక్రమార్కుల్లో గుబులు
తప్పుడు సమాచారంపై కొరడా ఖాయమా?

2mdsrdp6సంగారెడ్డి: డిఇఓ రాజేశ్వర్‌రావుపై వేటు తప్పదా? అక్రమంగా బదిలీలు, పదోన్నతులు పొందిన బండారం బయటపడుతుందా? వారిపై చర్యలు ఖాయమేనా? అన్న చర్చ జిల్లా విద్యా శాఖలో మొదలైంది.ఇటీవల బదిలీలు-రేషనలైజేషన్, పదోన్నతుల వ్యవహారంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని డిఇఓపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు నేరుగా డిఇఓపైనే ఆరోపణలు చేశాయి. మరికొన్ని సంఘాలేమో డిఇఓపై వత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా ఉత్వర్వులు జారీ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. సిఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఇక్కడి పరిణామాలు సహజంగానే ఆసక్తికరంగా మారాయి. రెండు రోజుల క్రితం ఇవే ఆరోపణలపై వరంగల్ డిఇఓ చంద్రమోహన్‌పై ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు వరంగల్ విడిచి పోరాదని కూడా ఆదేశించడంతో ఇక్కడి డిఇఓ వ్యవహారంపై ఉపాధ్యాయులు, విద్యా వంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. గత నెల 7వ తేదీ నుంచి 19 తేదీ వరకు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జిల్లాలోని ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించారు. నిత్యం వందలాది మందికి కౌన్సిలింగ్ నిర్వహించాల్సి రావడంతో సంగారెడ్డిలోనే నాలుగు కేంద్రాలను దీనికి గాను ఎంపిక చేశారు.ప్రతి కేంద్రానికి ఒకరిని అధికారిగా నియమించి కౌన్సిలింగ్ జరిపారు. అయితే కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని ఆధారంగా అదనపు పాయింట్లు పొందారు. ఆ ప్రకారం సీనియార్టీ లిస్టులో పేరు ముందు వచ్చేలా జాగ్రత్త పడ్డారు.

2mdsrdp7తాము సబ్జెక్టు బోధించకున్నా బోధిస్తున్నట్టుగా కొందరు దరఖాస్తు చేశారు. ఆ విధంగా లబ్దిపొం దారు. కౌన్సిలింగ్ అనంతరం కూడా కొందరు ఉపాధ్యాయులకు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్వర్వులిచ్చారని ఆరోపణలు న్నాయి. ఇవే కాకుండా రేష్నలైజేషన్‌లో కూడా నిబంధనలను కాలరాశారని, ఉర్దూ మీడియం టీచర్లను నిబంధనలకు విరుద్దంగా తెలుగు మీడియం పాఠశాలకు బదిలీ చేశారని, పాయింట్ల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని, డిఇఓ కార్యాలయపు సిబ్బంది కొందరు చేతి వాటం ప్రదర్శించారని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ఇవే కాకుండా కొందరు గుర్తింపు సంఘాల పేరుతో లెటర్ హెడ్‌పై రాసుకుని రాగానే వారిపై ఎలాంటి విచారణ చేకుండానే పాయింటు కేటాయించారని అప్పుడే ఫిర్యాదులు వచ్చాయి. ఇక కౌన్సిలింగ్ సమయంలో ముందుగానే ఖాళీలను చూపాలి. అలా కాకుండా ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చేశారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఖాళీలు చూపారని, కొంత మంది లబ్దికే ఈవిధంగా చేశారని ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ మొత్తం వ్యవహారంపై కొన్ని సంఘాలు ఫిర్యాదు చేయడంతో విచారణకు రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశించారు. ఈ కారణంగా రెండు రోజుల క్రితం ఆర్జెడి సుధాకర్, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణారావులు జిల్లా కేంద్రానికి విచారణకు వచ్చారు. దాదాపుగా రోజంతా డిఇఓ కార్యాలయంలోని కౌన్సిలింగ్ ఫైళ్లను తనిఖీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేయడమే కాకుండా, తమకున్న అనుభవం ఆధారంగా కూడా నిబంధనలు పాటించారా? అతిక్రమించారా? ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై విచారణ జరిపారు. దీనిలో డిఇఓతో పాటు అక్కడి సిబ్బంది ప్రమేయం ఉందా? ఉపాధ్యాయ సంఘాలు ఏమైనా ప్రభావితం చేశాయా? ప్రజా ప్రతినిధులు ఎవరైనా లేఖలు రాశారా? అసలు ఉపాధ్యాయులు తప్పుడు సమచారం ఇచ్చారా? వారి ప్రమేయం ఎంత వరకు ఉంది? అనే కోణాల్లో కూడా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. సిఎం కేసీఆర్ జిల్లా కావడంతో ఈ విచారణ పకడ్బందీగా జరిపినట్టుగా భావిస్తున్నారు.
దీంతో అనేక విషయాలు బైటికి వచ్చే అవకాశముంది. ఆరోపణలు నిజమని తేలితే డిఇఓతో పాటు తప్పుడు సమాచారమిచ్చిన ఉపాధ్యాయులపై కూడా వేటు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఉపాధ్యాయ వర్గాల్లో సంచలనంగా మారింది. పాఠశాలలు మొదలై చదువులు సాగాల్సిన సమయంలో కౌన్సిలింగ్ జరగడం, ఈ కౌన్సిలింగ్ అక్రమాలు చోటు చేసుకోవడం, వీటిపై విచారణ జరగడం లాంటి పరిణామాలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకు విస్మయం కలిగిస్తున్నాయి.అసలే సర్కారీ చదువుపై నమ్మకం కోల్పోతున్న తరుణంలో ఈ ఘటనలు ఇబ్బందికరంగా మారాయి.

Comments

comments