Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

తగ్గు ముఖం పట్టని వదరు… తల్లడిల్లుతున్న గ్రామాలు

In many places heavy rains are flooded

వరదలు దాటుతూ విద్యార్థులు, గ్రామీణుల కష్టాలు
ఇప్పటికీ శాంతించని వాగులు, రవాణాకు ఆటంకాలు
పలు చోట్ల భారీ వర్షాలకు కూలిన ఇండ్లు
గోదావరి పరీవాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలు

మన తెలంగాణ/మంచిర్యాల: పలు వాగుల్లో వరద ప్రవాహం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో మారుమూల గ్రామాలు రవాణా సదూపాయాలు కొరవడి తల్లడిల్లుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వచ్చే గ్రామీణులతో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వాగులు దాటుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికి దాదాపు 46 గ్రామాలకు రవాణా సౌకర్యం పునరుద్దరణకు నోచుకోలేదు. పలు వాగుల వద్ద దాటించేందుకు పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో బుధవారం పలు చోట్ల వర్షాలు కురిసాయి. దీంతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు కురియడంతో పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.పెంచికల్‌పేట మండలంలోని కొండపల్లి గొల్లవాడలో బుధవారం వర్షానికి జెల్ల హంసక్కకు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దహెగాం మండలంలోని ఎర్రవాగు, బెజ్జూర్‌లోని కృష్ణపల్లి వాగు, నీల్వాయి లోని గొర్లపల్లి వాగు, సిర్పూర్(యు) మండలంలోని పెద్దవాగులో వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. ఫలితంగా మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడలేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వరద ప్రవాహాన్ని దాటి ఒడ్డుకు చేరుతున్నారు. దహెగాం మండలంలోని ఎర్రవాగుపై వంతెన నిర్మిస్తుండగా వాగులో వేసిన ఆప్రోచ్ రోడ్ వరదలకు కొట్టుకుపోవడంతో ప్రజలు నూతనంగా నిర్మిస్తున్న వంతెనకు నిచ్చెనలు వేసుకొని అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. బుధవారం కాగజ్‌నగర్ డిఎస్‌పి పి. సాంబయ్య స్వయంగా వంతెన వద్దకు చేరుకొని ఎర్రవాగు ఉదృతిని పరిశీలించారు. అంతే కాకుండా వంతెన వద్ద ప్రయాణికులకు ఎక్కించేందుకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదే విధంగా సిర్పూర్(యు) మండలంలోని పెద్దవాగులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టకపోవడంతో వల్ల ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల నుండి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో జన్నారం వద్ద ఆప్రోచ్‌రోడ్ కొట్టుకుపోవడంతో మూడు రోజులు రాకపోకలు నిలిచిపోగా పోలీసులు ఆప్రోచ్ రోడ్‌ను మరమ్మతు చేయించగా బుధవారం నుంచి రాకపోకలు పునఃప్రారంభం అయ్యాయి. వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి వాగులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యార్థులు , గ్రామీణులు వరదలను దాటి చెన్నూర్‌కు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా గొర్లపల్లి వాగులో కొట్టుకుపోయిన మోర్లే సోమయ్య ఆచూకిని ఇప్పటి వరకు తెలియకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది.

Comments

comments