Home ఎడిటోరియల్ తలాక్ క్రిమినల్, విడాకులు సివిల్

తలాక్ క్రిమినల్, విడాకులు సివిల్

Some say that they are adultery and illicit relationship
ఇటు సుప్రీంకోర్టులో అటు పార్లమెంటులో ఈ వారం దాంపత్య జీవితం, విడాకుల మీద ఆసక్తికర చర్చలు సాగాయి. ఇవి రెండూ విరుద్ధ మార్గాల్లో సాగుతుండడం విశేషం. వివాహేతర లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను పౌరసమాజం చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. పైకి ఈ సెక్షన్ స్త్రీలకు అనుకూలంగా వున్నట్టు కనిపిస్తున్నప్పటికీ సారాంశంలో స్త్రీలను ఒక సరుకుగా మార్చి వాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నదనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. వివాహేతర లైంగిక సంబంధాలను మీడియాలో కొందరు వ్యభిచారం, అక్రమ సంబంధం అని మొరటుగా రాస్తున్నారుగానీ అవి సరైన అనువాదాలు కావు. ఇంగ్లీషులో Adultery, Infidelity, Promiscuity అనే పర్యాయ పదాలను వాడుతారు.

అడల్ట్రీ చట్టం ప్రకారం ఒక వివాహిత మహిళ వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడం ఒక పౌర తప్పిదం (Civil Wrong) మాత్రమే తప్ప; శిక్షించదగ్గ నేరం ఏమీ కాదు. భార్య మరొకరితో వివాహేతర లైంగిక సంబంధం కొనసాగించడానికి భర్త అనుమతి ఇస్తే అది కూడా ఒక సామాజిక తప్పిదమే అవుతుంది తప్ప; శిక్షించదగ్గ నేరం అవ్వదు. అలాగే యుక్త వయస్సు నిండిన ఒక వివాహితుడు యుక్త వయస్సు నిండిన మరో అవివాహితతో వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకోవడం సహితం సామాజిక తప్పిదమే అవుతుందిగానీ; శిక్షించదగ్గ నేరం అవ్వదు. అతని మీద చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరే హక్కు అతని భార్యకు లేదు. అయితే, ఓ పురుషుడు ఓ వివాహిత స్త్రీతో వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ ప్రియుని మీద ప్రియురాలి భర్త కేసు పెట్టవచ్చు. చట్ట నిర్వచనం ప్రకారం భార్య శీలం భర్త ఆస్తి కనుక ‘మరొకరి సొత్తును’ ‘దొంగిలించినందుకు’ ఆ ప్రియునికి న్యాయస్థానం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చు.

అడల్ట్రీ చట్టం మీద ప్రధానంగా మూడు రకాల విమర్శలున్నాయి. వివాహేతర లైంగిక సంబంధంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఇష్టపూర్వకంగా పాల్గొన్నప్పుడు పురుషులను మాత్రమే శిక్షించడం లింగ వివక్ష అవుతుందనేది మొదటి విమర్శ. వివాహవ్యవస్థ పవిత్రతను పరిరక్షించే నైతిక బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిపై వుండగా దాన్ని భార్యలపై మాత్రమే మోపారన్నది రెండవ విమర్శ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా చట్టం ముందు సమానమని అంటున్నపుడు లింగ వివక్షను పాటించే సెక్షన్ 497 చెల్లదనేది ఒక బలమైన వాదన. ఈ చట్టం స్త్రీలను స్వేచ్ఛా స్వాతంత్య్రాలు గల వ్యక్తిగా కాకుండా భర్తకు ఆస్తిగా, సరుకుగా మాత్రమే చూస్తున్నదనేది మూడవ విమర్శ. తద్వారా ఇది స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నదన్నది ఇంకో గట్టి వాదన.

వివాహేతర లైంగిక సంబంధాలను యూరోప్ దేశాలన్నీ పరిణితి చెందిన వ్యక్తుల లైంగిక స్వేచ్ఛగా భావిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాల్లో వాటిని నేరంగా పరిగణించడం మానేశాయి. ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ అవగాహన విస్తరించింది. వివాహేతర లైంగిక సంబంధాలను ఇప్పటికీ నేరంగా పరిగణిస్తున్న బహుకొద్ది దేశాల్లో భారత దేశం ఒకటి. వివాహేతర లైంగిక సంబంధాల వ్యాజ్యాలలో 1959 నాటి నానావతి కేసు పెద్ద సంచలనం రేపింది. భారత నావికా దళ కమాండర్ కేయం నానావతి తన భార్య సిల్వియాతో వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాణిజ్యవేత్త ప్రేమ్ అహుజాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు. ఈ కేసు విచారణ తొలిదశలో నానావతి చర్యను శిక్షించదగ్గ నేరం కాదని జ్యూరీ తీర్పు చెప్పింది. ఆ తరువాత మహారాష్ట్ర హైకోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.

భార్య వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే భర్త ఆమె ప్రియుడి మీద నేరారోపణ చేయవచ్చు. కానీ, భర్త వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకుంటే భార్య అతని ప్రియురాలి మీద నేరారోపణ చేయడం కుదరదు అనేది అడల్ట్రీ చట్టంలో ఒక విచిత్రమైన నిబంధన. నానావతి కేసులో ప్రియుడు ప్రేమ్ అహుజా ‘నేరస్థుడు’ అయ్యాడుగానీ అతనితో ఇష్టపూర్వకంగా వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న సిల్వియా చట్ట ప్రకారం నేరస్థురాలు కాదు. దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రవేశించాక ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న పురుషులను మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి పిటిషన్ ఇటీవల దాఖలు చేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, ఎయం ఖాన్ విల్కర్, డివై చంద్రచూడ్, ఇందూ మల్ హోత్రా ఈ ధర్మాసనంలో వున్నారు. ఆగస్టు 2, 9 తేదీల్లో ఈ ధర్మాసనం విచారణ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి.

అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ వివాహ వ్యవస్థకు ఉన్న పవిత్రతను పరిరక్షించాలనే దృష్టితోనే వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్నామని వివరించారు. ‘వ్యభిచారం’ నేరం కాదని చెప్పే విదేశీ చట్టాలను పరిగణనలోకి తీసుకోవద్దని, భారతదేశంలోని స్థితిగతుల ఆధారంగానే సమాజ శ్రేయస్సు కోసం ఈ చట్టం చెల్లుబాటును కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ వాదనను రాజ్యాంగ ధర్మాసనం అంగీకరించలేదు. వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరపూరిత చర్య అనలేము. మహా అయితే, అదొక పౌర తప్పిదం మాత్రమే వుతుంది. పౌర తప్పిదాలకు పౌర పరిష్కారంగా విడాకులు వున్నప్పుడు ఇక శిక్షలు దేనికీ? వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకున్నంత మాత్రానా ఒక వ్యక్తిని ఐదేళ్ళు జైలుకు పంపిస్తారా? కనీస విచక్షణ వుందా? అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.

నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాటల్లోనే చెప్పాలంటే, Sending a person to prison for five years for adultery does not appeal to common sense Adultery does not even qualify as a criminal offence and is, at the most, a civil wrong Adultery has a civil remedy; divorce. Protecting marriage is the respon sibility of the couple involved. If one of them fails, there is a civil remedy available to the other. Where is the question of public good in a broken marriage there might be cases in which adultery was a consequence of a broken marriage.

వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకున్నందువల్ల వివాహ వ్యవస్థ దెబ్బతినదు తద్విరుద్ధంగా వివాహవ్యవస్థ దెబ్బతినడంవల్లనే వివాహేతర లైంగిక సంబంధాలు ఏర్పడతాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి ఆర్ధిక విధానాలవల్ల సాంప్రదాయ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయే వాతావరణాన్ని నేరుగా ప్రభుత్వమే సృష్టిస్తోంది. దాని పరిణామాల మీద దంపతుల ప్రతిస్పందనను ప్రతిచర్యను మాత్రం శిక్షించాలనుకుంటోంది. మరోమాటల్లో, నేరస్థుడే బాధితులను శిక్షిస్తున్నాడు.

విడాకులనేది పౌర పరిష్కారం అని సుప్రీంకోర్టు వందసార్లు నొక్కి చెపుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ముస్లింల విడాకుల్ని నేరపూరిత చర్యగా పరిగణించే బిల్లును చట్టంగా మార్చడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నది. తాము న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ప్రపంచానికి చూపెట్టడానికి ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017కు ఆగస్టు 9న కేంద్ర మంత్రివర్గం మూడు సవరణలు చేసింది. రాజ్యసభలో దీనికి ఎదురవుతున్న ప్రతిఘటన రీత్యా బిల్లును సరళీకరించినట్టు చెపుతున్నప్పటికీ అందులో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షించదగ్గ నేరపూరిత చర్యగానే కొనసాగిస్తున్నారు. ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఒకవేళ అప్పుడూ సభ్యుల నుండి ప్రతిఘటన ఎదురయితే, ఆర్డినెన్స్ ద్వారానో, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానో ఈ బిల్లును చెల్లుబాటులోనికి తేవాలని సంఘపరివారం ఉవ్విళ్ళూరుతోంది. 2019 ఎన్నికల్లో గెలవడానికి బిజెపి ఈ బిల్లును ప్రాణరక్షణ మందుగా భావిస్తోంది.

ముస్లిం వివాహ రద్దు కోసం ఒక చట్టం (The Dissolution of Muslim Marriage Act 1939) గత 80 ఏళ్ళుగా అమలులో వుంది. అందులోని క్లాజ్ 2లో ముస్లిం మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం న్యాయస్థానం నుండి అనుమతి పొందడానికి అవసరమైన భూమికల జాబితా వుంది. ఆ క్లాజ్‌లో మహిళ అని వున్న చోట దంపతుల్లో ఏ ఒక్కరయినా (spouse) అని స్వల్ప మార్పు చేస్తే సరిపోతుంది. ఈ మాత్రం దానికి దేశం దద్దరిల్లేలా గోల చేయడం అనవసరం. నరేంద్ర మోదీ, – అమిత్ షాల ప్రభుత్వానికి సామాజిక సంస్కరణకన్నా రాజకీయ ప్రయోజనం మిన్న.

పౌర తప్పిదం ముస్లిం మత సమూహంలో జరిగినా తప్పే, హిందూ మత సమూహంలో జరిగినా తప్పే. ముస్లిం సమాజంలో విడాకులు ఇచ్చిన రెండు లక్షల మంది భర్తల్ని, హిందూ సమాజంలో విడాకులు ఇచ్చిన ఏడు లక్షల మంది భర్తల్నీ మూకుమ్మడిగా కారాగార శిక్షలు విధించడానికి ప్రభుత్వం సిద్ధమేనా? లేకుంటే కేవలం ముస్లిం భర్తల్ని మాత్రమే ప్రభుత్వం శిక్షించదలిచిందా? అప్పుడది ప్రభుత్వ ప్రాయోజిత మత వివక్ష కాదా? రాజ్యాంగ ఆదర్శాలను ఉల్లంఘిస్తున్నది ఎవరూ?