Home తాజా వార్తలు దూసుకెళ్లిన కోటక్ బ్యాంక్ షేరు

దూసుకెళ్లిన కోటక్ బ్యాంక్ షేరు

Kotak Mahindra Bank

 

వారెన్ బఫెట్ కొనుగోలు వార్తలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం

న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు శుక్రవారం తారా జువ్వలా దూసుకెళ్లింది. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో భారీస్థాయిలో పెట్టుబడులకు యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచారు. దీంతో ఎన్‌ఎస్‌ఇలో కొటక్ మహీంద్రా షేరు 9 శాతం లాభపడి రూ. 1284 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 1346 వరకూ దూసుకెళ్లింది. కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో అమెరికన్ దిగ్గజం వారెన్ బఫెట్ సంస్థ బెర్కషైర్ హాత్‌వే 4-6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉందని వార్తలు వెలువడ్డాయి.

బ్యాంకులో 10 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, ప్రమోటర్ వాటా నుంచి లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ కింద వాటాను సొంతం చేసుకోనుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా బ్యాంకులో ప్రస్తుతం ఉదయ్ కొటక్‌కు 29.73 శాతం వాటా ఉంది. మొత్తం ప్రమోటర్ గ్రూప్‌నకు 30.02 శాతం వాటా కలిగి ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఈ డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ 5.34 లక్షల షేర్లు బిఎస్‌ఇలో ట్రేడయ్యాయి. ప్రస్తుతం కొటక్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 2.48 లక్షల కోట్లుగా ఉంది. దీంతో 10 శాతం వాటా కోసం బెర్క్‌షైర్ కనీసం రూ. 24,000 కోట్లను ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Investor Warren Buffett is Investments In Kotak Bank

Telangana Latest News