Search
Sunday 18 November 2018
  • :
  • :

ప్రైవేట్ మాఫియా…!

kumar-1జగిత్యాల ః జగిత్యాల నుంచి ముంబాయి వరకు ప్రైవేట్ బస్సుల మాఫీయా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై యధేచ్చగా తిరుగుతున్నా వాటి గురించి ఏ అధికారి పట్టించుకోరు. ఎవరైనా తప్పిదారి ఫిర్యాదు చేస్తే నిబంధనల మేరకే నడుస్తున్నాయంటూ అధికారులు సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబాయిలో ఆర్టీసీ టిక్కెట్ ఏజంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ప్రైవేట్ బస్సుల యజమానులతో మిలాఖత్ అయి ప్రయాణీకులను ప్రైవేట్ వైపు తిప్పుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ బస్సులు రోడ్డుపై తిరుగుతున్నా సంబంధిత అధికారులు మిన్నకుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జగిత్యాల డివిజన్ నుంచి నిత్యం వందల మంది ముంబాయి వెళ్తుంటారు… వస్తుంటారు. ముంబాయి నుంచి నిజామాబాద్ వరకే రైలు సౌకర్యం ఉండటంతో ఎక్కువగా బస్సులో వెళ్లేందుకే ఆసక్తి చూపుతారు. ప్రయాణీకుల రద్దీని గమనించిన ప్రైవేట్ బస్సు యజమానులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నిత్యం ఐదారు బస్సులను ముంబాయికి తిప్పుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా లక్షేటిపేట నుంచి ముంబాయి వరకు మధ్య మధ్యలో ఏజంట్లను పెట్టుకుని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ది చేసుకుంటున్నారు.
ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్….
ప్రైవేట్ బస్సుల యజమానులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు. అధికారులకు నెల నెలా అమ్యామ్యాలు ముట్టజెబుతూ తాము ఆడింది ఆట… పాడింది పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ ట్రావెల్స్ యజమాని అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధికారులు అడ్డు చెప్పే సాహసం చేయడం లేదని తెలుస్తోంది. జగిత్యాల నుంచి ముంబాయి వెళ్లే ప్రైవేట్ బస్సు యజమానులు తమకు ఆల్ ఇండియా ఫర్మిట్ ఉందని, తాము దేశంలో ఎక్కడికైనా వెళ్లోచ్చని చెబుతున్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రాంతం నుంచి ప్రయాణీకులతో బయలు దేరిన బస్సు నిర్ధేశించిన ప్రాంతానికి మాత్రమే వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. తమ ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచడం… సీట్ల కెపాసిటీ కంటే ప్రతి బస్సులో 10 నుంచి 15 మంది వరకు అదనంగా తీసుకెళ్తున్నారు. ఒక్కో ముంబాయి ట్రిప్పుకు రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వస్తుండగా అందులో కేవలం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి ఖర్చు కావని, ఒక్కో ట్రిప్పుకు రూ.50 వేల నుంచి 70 వేల వరకు ప్రైవేట్ బస్సు యజమానులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ముంబాయికి… ముంబాయి నుంచి ఇక్కడికి సరుకులను అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఆర్టీసీ అధికారుల తీరే వేరు….
ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆధునిక బస్సులను తిప్పుతున్నామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు ముంబాయికి బస్సు నడిపించే విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రయాణీకులు అంటున్నారు. జగిత్యాల డిపో నుంచి ముంబాయికి ప్రతి రోజు బస్సు సౌకర్యం ఉండేది. అయితే గత 20 రోజులుగా ముంబాయి బస్సును ఆదాయం రావడం లేదని రద్దు చేసినట్లు తెలిసింది. ప్రయాణీకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా బస్సును నడిపించి ఆదాయం రావడం లేదంటూ ఉన్న బస్సును రద్దు చేసి పరోక్షంగా ప్రైవేట్ బస్సులకు లాభం చేస్తున్న వారవుతున్నారు. జగిత్యాల నుంచి ప్రైవేట్ తప్పా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణీకుడి అవసరానికి తగ్గట్టు ప్రైవేట్ బస్సుల ఏజెంట్లు ఛార్జీలు పెంచి జేబులు నింపుకుంటున్నారు.
రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారో….!
స్థానికంగా తిరిగే వాహనాలను తనిఖీ చేస్తూ ఫలానా పత్రం లేదు… సామర్ధానికి మించి ప్రయాణీకులను తీసుకెళ్తున్నావు.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుస్తోంది కదా అంటూ యక్ష ప్రశ్నలు వేసి వేలకు వేల జరిమానాలు విధిస్తున్న రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో మరి వారికే తెలియాలి.
ఏది ఏమైనా ప్రైవేట్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టాల్సిన అవసరముందనే అభిప్రాయలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Comments

comments