Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బ్యాంకులకు టోకరా!

బోగస్ పత్రాలతో రుణాలు 

కలవర పడుతున్న అధికారులు
మొన్న మంచిర్యాల… నిన్న కుభీర్‌లో
కేటుగాళ్ళపై కేసుల నమోదు
నిందితులపై కఠిన శిక్షకు డిమాండ్

10429435_312755118927302_4980440028335773345_nఆదిలాబాద్: బోగస్ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేస్తున్న కేటుగాళ్ళు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. సులువుగా అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ కొంత మంది ఈ రకమైన మోసాలకు పాల్పడుతూ బ్యాంకులకు బురిడీ వేస్తుండగా అసలైన లబ్ధిదారులకు సంకటంగా మారింది. జిల్లాలో ఇటువంటి సంఘటనలు ప్రతీ యేటా వెలుగులోకి వస్తున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోని కారణంగా ఇవి షరా మామూలుగా తయారయ్యాయి. గడిచిన ఐదేళ్ళ క్రితం జైనూర్‌లోని ఎస్‌బీహెచ్ బ్యాంకులో ఈ బోగస్ పత్రాల బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే బోగస్ పత్రాలు సృష్టించి సుమారు రూ. 45 లక్షలకు పైగా టోకరా వేసిన సంగతి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సంఘటనను మరువక ముందే ఈ ఏడాది మార్చ్‌లో మంచిర్యాలలోని యూబీఐ బ్యాంకులో ఫోర్జరీ సంతకాలతో రూ. కోటిన్నరకు పైగా స్వాహా చేశారు. కొంత మంది బ్యాంకు అధికారులతో పాటు సిబ్బంది, కేటుగాళ్ళు ముఠాగా ఏర్పడి బ్యాంకు సొమ్మును స్వాహా చేశారు. ఏకంగా ఉపాధ్యాయుల పేరుతో రుణాలు పొందినట్లు నోటీసులు అందజేయడంతో సంబంధిత ఉపాధ్యాయులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే మంచిర్యాల యూబీఐ బ్యాంకు స్వాహాలో గతంలో పని చేసిన మేనేజరే అసలు సూత్రధారి కావడంతో ఉపాధ్యాయులు కిన్నులయ్యారు. ఈ బ్యాంకు ద్వారా 15 మంది రుణం పొందినట్లు ఉపాధ్యాయులకు నోటీసులు అందడంతో వారంతా బ్యాంకుకు పరిగెత్తడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. తీగ లాగిత డొంక కదిలినట్లు అసలు సూత్రధారి ఎవరో బయటికి పొక్కడంతో ఉపాధ్యాయులు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ బ్యాంకు వ్యవహారంపై హైదరాబాద్‌కు చెందిన ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు శాంతించారు. మంచిర్యాల్ యూబీఐ బ్యాంకు సంఘటన వెలుగులోకి వచ్చి ఐదు నెలలు గడువక ముందే కుభీర్ మండలంలోని యూబీఐ బ్యాంకులో బోగస్ టైటిల్ డీడ్‌ను సృష్టించి రుణాలు తీసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫోర్జరీ సంతకాలతో టైటిల్ బుక్కులు తయారు చేసి అసలు రైతులకు బదుల ఇతర వ్యక్తు ఫోటోలు పెట్టి సుమారు రూ. 5 లక్షలకు పైగా పంట రుణాలు పొందిన సంఘటన కుభీర్‌లో కలకలం సృష్టించింది. 2008లో పని చేసిన తహసీల్దార్, అప్పటి ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేసి రుణాలు పొందినట్లుగా అధికారులు గుర్తించారు. మండల కేంద్రానికి చెందిన కొంత మంది కేటుగాళ్లు ఈ వ్యవహారానికి సూత్రధారులుగా చెపుతున్నారు. మండలంలోని పలు గ్రామాల రైతులతో పాటు ఒక ఉపాధ్యాయుని పేరిట కూడా పంట రుణాలను నకిలీ టైటిల్ డీడ్ ద్వారా పొందినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.

అయితే బ్యాంకు అధికారులు వీటిపై విచారణ జరుగుతుందని చెపుతుండగా వాస్తవంగా ఎంత మంది నకిలీ రైతుల టైటిల్ డీడ్‌లను సృష్టించి రుణం పొందారన్న విషయం మాత్రం చెప్పడం లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం నకిలీ టైటిల్ డీడ్‌ల విషయం వాస్తవం అని దృవీకరించారు. అయితే బ్యాంకు అధికారులు దీనిపై ఇప్పటికే పోలసులకు ఫిర్యాదు చేసినట్లు చెపుతున్నారు. ఈ నకిలీ టైటిల్ డీడ్‌ల సూత్రధారులను, పాత్రధారులను గుర్తిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో బోగస్ టైటిల్ డీడ్‌లు, పాస్ పుస్తకాలతో భూ దందాలకు పాల్పడుతుండగా తాజాగా బ్యాంకులకు టోకరా వేసిన వైనం జిల్లాలోని రైతాంగాన్ని కలవర పెడుతోంది. ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం నకిలీ టైటిల్ డీడ్‌ల ముఠాను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూర్చిన వారువుతారంటున్నారు.

Comments

comments