Home ఆదిలాబాద్ ‘మమత’ కరువైంది

‘మమత’ కరువైంది

ఆదాయం ఘనం-సౌకర్యాలు శూన్యం

డివిజనల్ కార్యాలయంలో కుర్చీలు ఫుల్ సిబ్బంది హాజరు నిల్
ఇదీ మంచిర్యాల మమత సూపర్‌బజార్ కేంద్రీయ సహకార సంఘం తీరు

01admcl01p1rమంచిర్యాల: ఒక మహా ఆశయంతో ప్రారంభమైంది. ఎందరో దానికోసం తపించారు. చివరికి సాధించారు. ప్రస్తుతం ఆదాయంలో ఘనంగా ఉంది. సౌకర్యాలు, నిర్వహ ణలో దయనీయమైన స్థితిలో ఉంది. ఇదీ మంచిర్యాల డివిజన్ కోఆపరేటివ్ కార్యాలయం కేం ద్రంగా నిర్వహణ కొనసాగిస్తున్న ‘మమత సూపర్ బజార్ కేంద్రీయ సహాకార

సంఘం’ తీరు…
1976లో ‘వినియోగదారుల సహాకార సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్’ పేరుతో రిజిస్ట్రేషన్‌తో పరస్పర సహాకారంతో సామాజిక సౌకర్యాల కల్పన, ప్రజా సంక్షేమం అనే లక్షంతో మమత సూపర్ బజార్ కేంద్రీయ సహాకార సంస్థ ప్రారంభమైంది. ఆరంభంలో ఆటు పోట్లు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎదుర్కొంటూ ఎట్టకేలకు తటస్థంగా నిలదొక్కుకుంది. దశా బ్దాలు గడిచాయి. కాలం గడుస్తున్నా కొద్దీ ఆర్థికంగా పరిపుష్టంగా వివిధ రకాల సేవలనందిస్తూ మంచిర్యాలకే వన్నె తెచ్చే విధంగా తయారైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గతంలో 23 రేషన్ దుకాణాలు, రేషన్‌దుకాణాలకు సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేసే హ్యాకర్స్ వ్యవస్థలు కొనసాగేవి. మంచిర్యాల బస్టాండు ఎదురుగా మూడంతస్తుల భవన నిర్మాణం జరిగింది. సంస్థ ఆర్థికంగా ఎదగడంతో దేధీప్యమానంగా పేరు తెచ్చుకుంది.
క్రమంగా తగ్గుతూ వచ్చిన కళ: ఒకదశలో ఎవరూ వేలు చూపలేనంత గొప్పస్థాయిలో నడిచిన మమత సూపర్ బజార్ కేంద్రీయ సహాకార సంస్థ నిర్వహణ తీరు నేడు అత్యంత దయనీయ స్థితిలోకి చేరింది. మూడంతస్తుల భవనం పేకమేడలా రోజుకో భాగం కుప్పకూలుతూ నేడో రేపో అన్నచందంగా మారింది. భవనం శిథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకోవడం కాదు కదా రోజు వారీ క్లీనింగ్, మంచినీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలం ఇలాంటివేవీ అందుబాటులో లేవు. ఈ విషయమై పలుమార్లు నిర్వాహకులను సంప్రదించినా వారి నుంచి స్పందన కరువైంది.
సంస్థ నిర్వహణ గాలిలో దీపం-సిబ్బంది రాక అగమ్య గోచరం
సహాకార సంస్థ నిర్వహణ కార్యకలాపాలు నిర్వహించే ముఖ్య కేంద్రీయ కార్యాలయం మంచిర్యాల పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న మమత సూపర్ బజార్ భవనంలో ఉంది. ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. సహాకార సంస్థ లోని వ్యవహారాలపై గతంలోనూ మంచిర్యాల పట్టణంలో కరపత్రాలు పంపిణీ జరిగింది. అయినప్పటికీ విషయం బయటకు రాకుండా అందులోని కొందరు వ్యక్తులు అంతా తామై వ్యవహారాన్ని చక్కబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థ 1976లో 25వందలకుపైబడి సభ్యులతో ప్రారంభమైంది.

01admcl01p2rఅనంతరం గడిచిన రెండు మూడు దశాబ్దాల నుండి నేటి వరకు సహాకార సంఘానికి ఎన్నికలే నిర్వహించబడలేదు. ఆ పాలక వర్గంలోని కొంత మంది సభ్యులు కాలం చేసినా నేటికీ ఆ జాబితానే కొనసాగిస్తున్నట్లు సమాచారం.సహాకార సంఘం నిబంధనల ప్రకారం ఒకటి, రెండు పర్యాయాలకు మించి ఎన్నికలు నిర్వహించబడనట్లయితేఆ స్థితిలో లిక్విడేషన్ ప్రకటించి సహాకార సంఘం ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇక్కడున్నటువంటి వారు తమ పరపతిని ఉపయోగించి ఏళ్లకేళ్లు పాత పాలక వర్గ జాబితాతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయంపై పట్టణంలో చాపకింద నీరులా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గతంలో సబ్ కలక్టర్ వివేక్‌యాదవ్ ఈ వ్యవహారంపై దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. గత రెండు రోజులుగా ‘మన తెలంగాణ’ సిబ్బంది రాకపై పరిశీలన జరుపగా, కేవలం ఒకే ఒక్క ఉద్యోగితో పాటు నలుగురు అటెండర్లు దర్శనమిచ్చారు.

ఆ సమయంలో ఒకే ఒక్కడుగా దర్శనమిచ్చిన పర్యవేక్షకుడు అనిల్‌ను సమాచారం కోరగా నేను కేవలం నిమిత్త మాత్రుడినంటూ నిస్సహాయత వెలిబుచ్చాడు. మిగతా సిబ్బంది రాకవిషయమై ప్రస్థావించగా ఒకటికి రెండు మార్లు అటు వెళ్లారంటూ, ఇటు వెళ్లారంటూ తలతోక లేని సమాదానాలు ఇచ్చాడు. ఈ విషయమై పలు మార్లు నిర్వాహకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ స్పందన కానరాకపోవడంతో మంచిర్యాల ఆర్డీవో ఆయిషమస్రత్‌ఖానం ను ‘మన తెలంగాణ’ సంప్రదించింది. అసౌకర్యాలపై పట్టించుకోని , అస్తవ్యస్థ నిర్వాహణలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఆర్డీవో విషయాన్ని ఫోన్ ద్వారా జిల్లా రిజిస్ట్రార్ సూర్యచందర్‌కు అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తానని, విచారణ అనంతరం తగు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
సంబంధిత అధికారులతో వివరిస్తా:
ఆయేషామస్రత్‌ఖానం, ఆర్‌డిఒ, మంచిర్యాల
కార్యాలయంలో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడమేంటీ..ఈ విషయంపై సంబదిత అధికారులకు సమాచారమందిస్తా. చర్యలు తీసుకునేలా చూస్తా, సహకారసంఘ నిర్వాహణ సక్రమంగా సాగేలా నా వంతుగా నేను కృషి చేస్తా.
చర్యలు తీసుకుంటాం: సూర్యచంద్ర,జిల్లా సహకారశాఖ రిజిస్ట్రార్
మమత సూపర్ నిర్వాహణ తీరు విషయమై నెలకొన్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.నిర్వాహణపై ఇక నుండి దృష్టిసారించి సక్రమంగా కొనసాగేలా అవసరమైన చర్యలు చేపడుతాం. నూతన పాలకవర్గం విషయంలో కలెక్టర్‌ను సంప్రదించి, ఆయన సూచనల మేరకు ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతాం.