Home రాష్ట్ర వార్తలు మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌పై కాల్పులు

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌పై కాల్పులు

కాల్చారా, కాల్చుకున్నాడా?
తెల్లవారు జామున ఇంట్లోనే జరిగిన ఘటనపై పోలీసుల ఆరా శరీరం నుంచి 2 బుల్లెట్లు తీసిన వైద్యులు
తప్పిన ప్రాణాపాయం 

Vikram-Goud

సిటీబ్యూరో: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ఇంట్లో శుక్రవారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విక్రమ్‌గౌడ్ గాయపడ్డాడు. అతను ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. అతని ఎడమ చేతికొక బుల్లెట్, మరో బుల్లెట్ కుడి చేతి నుంచి బాడీలోకి దూసుకెళ్లింది. ఈ రెండు బుల్లెట్లను తీసినట్లు వైద్యులు తెలిపారు.విషయం తెలియగానే క్లూస్‌టీం అధికారులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని ప్రాధమిక ఆధారాలు సేకరించారు. అప్పటికే హాల్‌లో రక్తం మరకలను పనిమనిషి తుడిచి వేసిన దాఖలాలు కనిపించాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్య, పిల్లలు, వాచ్‌మెన్, పనిమనిషి మాత్రమే ఉన్నారు. పేద పిల్లలకు అన్నదానం చేసేందుకు ఎంతోకొంత నగదు ఇచ్చేందుకై తమ ఇంటికి దగ్గరలో ఉన్న హాజీ బాబా దర్గాకు వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలో విక్రమ్‌పై కాల్పులు జరిగాయని భార్య శిఫాలీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్రమ్‌ను ఎవరైనా బయటి వ్యక్తి ఇంట్లోకి వచ్చి కాల్చాడా..లేక అతనే కాల్చుకున్నాడా.. అనే విషయాలపై ఇంకా స్పస్టత రాలేదని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. కేసు మిస్టరీ విప్పేందుకు 10 బృందాలను రంగంలోకి దింపామని సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. శాస్త్రీయ పద్దతుల్లో సాక్షాలను సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే కేసు మిస్టరీ వీడుతుందన్నారు. సిసిటివిలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాల్పుల ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు క్రైమ్ నెంబర్ 707పై ఐపిసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల అతను ఆబిడ్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోపక్క తనకు గన్ లైసెన్స్ కావాలంటూ దరఖాస్తు కూడా చేసుకున్నాడు.
దుండగుడు కాల్చి వెళ్లాడు..భార్య శిఫాలీ
గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చడం వల్లనే నా భర్త విక్రమ్‌గౌడ్ గాయపడ్డాడు. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న హాజీ బాబా దర్గాకు వెళ్లడానికి శుక్రవారం తెల్లవారు జాము 2.30 గంటలకు తయారవుతుండగా కింది అంతస్థులో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో నేను పై నుంచి కిందికి వచ్చేలోపే కాల్పులకు పాల్పడిన దుండగుడు వెళ్లిపోగా..విక్రమ్‌గౌడ్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. వెంటనే నేను 108కు ఫోన్ చేశాను. తరువాత మా కారు టిఎస్ 09 ఇఎస్ 6575లోనే అపోలో ఆసుపత్రికి తరలించాము.
అన్నీ అనుమానాలే…
కాల్పుల ఘటన తీరును పరిశీలిస్తే అన్ని అనుమానాలే తలెత్తుతున్నాయి. విక్రమ్‌గౌడ్‌పై ఎవరైనా కాల్పులు జరిపారా లేక అతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా, తన ఆప్పులు తీర్చుకునేందుకు తండ్రిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆడే నటకంలో భాగంగానే కాల్పులు జరిగాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. విక్రమ్‌కు మాదాపూర్‌లోని ఓ పబ్‌లో భాగస్వామ్యం ఉంది. ఈ పబ్‌లో డ్రగ్స్ సరఫరా అయ్యాయనే అనుమనాలు కూడా ఉన్నాయి. మరోపక్క విక్రమ్‌కు రూ.కోట్లలో అప్పులు కూడా ఉన్నాయి. ఫైనాన్షియర్ల వేధింపులు కూడా మొదలయ్యాయి. కాగా విక్రమ్‌గౌడ్ ఫోన్‌లో గత పదిరోజులుగా డ్రగ్స్ దందాపై సిట్ చేస్తున్న విచారణ వివరాలను నిక్షిప్తం చేసుకున్నాడు. అలాగే గత 15 రోజుల్లో విక్రమ్‌గౌడ్‌కు 39 వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. ఈ మెసేజులన్నింటిలో రూ.15 లక్షలు ఇవ్వాలి, ఫలానా అప్పుడు రూ.20 లక్షలిచ్చాను తిరిగి ఇవ్వు అని, నీకు రూ.30 లక్షలిచ్చాను కదా అవిప్పుడే కావాలి అని, నీ కిచ్చిన రూ.35 లక్షలు ఇప్పుడిచ్చేయ్ చాలా అవసరం అంటూ భారీ ఎత్తున డబ్బులకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పాటు మాదాపూర్‌లో పబ్ కలిగి ఉన్న విక్రమ్‌గౌడ్‌కు డ్రగ్స్ తలనొప్పులు కూడా ఉన్నాయి. డ్రగ్స్ విచారణ తీరుపై, అప్పుల ఒత్తిడులపై తన భార్యతో పాటు ఓ పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్‌లు పంపించినట్లు దర్యాప్తులో తేలింది.ఈ నేపథ్యంలో సిట్ విచారణ, ఆప్పుల బాధ తొలగించుకోవాలంటే తన ముందు ఉన్న ఏకైక మార్గం ఆత్మహత్యాయత్నం అని ఆయన భావించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్‌గౌడ్‌ను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్క్రి వెళ్లిన పూరి..విక్రమ్‌ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విక్రమ్‌గౌడ్‌కు సినీ నిర్మాతగా పరిశ్రమలోని చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డితో కలిసి ఆయన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలను నిర్మాంచారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కూడా విక్రమ్‌ను పరామర్శించారు.