Home కరీంనగర్ మానేరమ్మా నీళ్లెక్కడ?

మానేరమ్మా నీళ్లెక్కడ?

బీళ్లు వారడానికి సిద్ధంగా ఉన్న మూడు జిల్లాల దాహార్తి తీర్చే మానేరు రిజర్వాయర్ 

జిల్లాలో సాగు నీటికి ఇక్కట్లు – మంచినీటికి కటకట, ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నీరుగారిపోతున్న రైతుల ఆశలు – డెడ్ స్టోరేజ్‌కు చేరిన ఎల్‌ఎండి రిజర్వాయర్
ముందుచూపు లేక నిరుపయోగంగా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్

తలాపున పారుతోంది గోదావరి. నీ చేను నీ చెలక ఎడారి అన్నాడో మహాకవి. అదే స్థితికి అద్దం పడుతోంది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పరిస్థితి. జిల్లాలో దాదాపు 175 కిలోమీటర్లు ప్రవహించే గోదావరి నది, ఓవైపు జిల్లా చుట్టూ ఎగువ, దిగువ మానేర్లు, మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లు.. ఉన్నప్పటికీ నీటిచుక్క కోసం ఎదురుచూస్తున్న ద్యైన్యం మన జిల్లాలో నెలకొన్నది.

1KNR01-P-1కరీంనగర్: కాలం ప్రకారం కురువాల్సిన వర్షాలు మొహం చాటేయడంతో జిల్లా మొత్తం నీటి కటకటతో అల్లాడుతోంది. జిల్లాకు పెద్దదిక్కులైన ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. సాగునీరు పరిస్థితి ఏమో కాని కనీసం తాగునీరు దొరకని దుస్థితి.. కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు వరప్రదాయని అయిన లోయర్ మానేర్ డ్యాం డెడ్‌స్టోరేజ్ దశకు చేరుకోని ఆందోళన పెడుతోంది. 24 టిఎంసిల సామర్థం గల లోయర్ మానేరు డ్యాంలో గత ఏడాది జూలై మాసంలో దాదాపు 10 టిఎంసిల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం ఉన్న 4 టిఎంసి ల అత్యల్ప నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది.

ఈ డ్యాం మీద ఆధారపడి ప్రతిరోజు కరీంనగర్ పట్టణానికి 35 క్యూసెక్కుల నీరు, మెదక్ జిల్లా సిద్దిపేటకు 8 క్యూసెక్కులు, వరంగల్, వేములవాడకు 2 క్యూసెక్కులు, సిరిసిల్లకు 2 క్యూసెక్కుల తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుత పరిస్థితి దీనంగా మారడంతో తాగునీటి కటకట ఆయా ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు ఇప్పటికే అటు వర్షాభావంతో ఖరీప్ పంటలు 1KNT01-P-2-(3)చేయి దాటిపోగా రబీ పంటపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలోకి ఎస్సారెస్సీ కాలువ ద్వారా వచ్చే నీరు రాకపోవడం, వర్షాభావ పరిస్థితి మూలంగా నీటి నిల్వలు అడుగంటడంతో కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 3.4 లక్షల ఎకరాలు సాగు కావల్సింది. కానీ ఈ ఖరీఫ్ ఆరంభంలో నీటి కాలువలు వదలకపోవడంతో పంటలేసుకున్న రైతులకు ప్రస్తుత పరిస్థితి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది.

అంతేకాకుండా ఎస్సారెస్సీ కాలువ పైభాగంలో ఇదే కాలువ ద్వారా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు తాగునీరు సరఫరా తగ్గిపోవడంతో అక్కడ కూడా తాగునీటి ఎద్దడి పెరిగిపోయింది. మరోవైపు కొత్తగా నిర్మితమైన రామగుండం మండలం ఎల్లంపల్లి గ్రామంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో కొంతమేరకు నీటి నిల్వలు ఉన్నప్పటికీ అధికారుల ప్రణాళికా లేమితో రైతాంగం నీరు ఉపయోగించుకోని పరిస్థితి ఏర్పడింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిమట్టం 20.5 టిఎంసిలు కాగా ప్రస్తుతం దాదాపు 8 టిఎంసిల వరకు నీళ్లు చేరాయి. ఈ నీటిని కూడా అధికారులు ప్రణాళిక లేకపోవడంతో నీటి విడుదల కోసం ఏలాంటి ప్రకటన చేయడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ముంపు గ్రామాల భూనిర్వాసితుల సంబంధించిన ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి కాకపోవడం, సంబంధిత ప్రాంతాల్లో అవసరమున్న చోట కట్టాల్సిన వంతెనలు కట్టకపోవడంతో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉంచలేకపోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలో వరుసగా మూడేళ్లు వరిసాగులో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్న కరీంనగర్ జిల్లా అటు సాగునీరు, ఇటు తాగునీరు లేక అల్లాడే పరిస్థితి కనబడుతోంది.