Home ఎడిటోరియల్ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం

వర్షాకాల సమావేశాలు ఫలప్రదం

Government defeating no-confidence motion in Lok Sabha

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అనేక సంవత్సరాల్లో తొలిసారి ప్రయోజన దాయకంగా, ఫలప్రదంగా ముగియటం ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండింటికీ సంతృప్తి కలుగజేసే విషయం. లోక్‌సభ, రాజ్యసభ రెండూ తమ సిట్టింగ్‌ల సమయంలో వరుసగా 50 శాతం, 48 శాతం శాసన సంబంధ చర్చలకు వెచ్చించాయి. 16వ లోక్‌సభలో ఇదొక రికార్డు; 2004 నుంచి చూస్తే ఇలా జరగటం ఇది రెండవసారి. పార్లమెంటును సజావుగా నడపటంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వానిది. సమస్యలు లెవనెత్తటం, ప్రభుత్వం నుంచి జవాబుదారీ తనం కోరటం ప్రతిపక్షాల బాధ్యత. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని గత సమావేశాలకు భిన్నంగా సమావేశాల ఆరంభం లోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించటం, సమావేశాల తదుపరి కాలం దాదాపు సజావుగా జరిగేందుకు దోహదకారి అయింది.

ప్రస్తుత సమావేశకాలం లో ప్రభుత్వం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటం, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా సభలో తనకు ఆధిక్యత లేకున్నా కొన్ని ప్రతిపక్షాల సహకారంతో ఎన్‌డిఎ అభ్యర్థిని గెలిపించుకోవటం దానికి ఎంతో సంతృప్తి కలిగించే విషయాలు. ఈ సమావేశా ల్లో ప్రభుత్వం మొత్తం 21 బిల్లులు ప్రవేశపెట్టి వాటిలో 16కు ఉభయ సభల ఆమోదం పొందగ లిగింది. లంచం పుచ్చుకునే వారితోపాటు ఇచ్చే వారినీ నేరస్థులుగా పరిగణించే అవినీతి నిరోధక (సవరణ) బిల్లు, దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల ఆస్తుల జప్తుకు అధికారమిస్తున్న పుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు, క్రిమినల్ లా సవరణ బిల్లు వాటిలో ఉన్నాయి.

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కున్న అధికారాలు కల్పించే 123వ రాజ్యాంగ సవరణ బిల్లును, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నీరుగారిన ఎస్‌సి/ ఎస్టి (అత్యాచారాల నిరోధక) చట్టంలో యథాపూర్వస్థితిని పునరుద్ధరించే సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. లోక్‌సభ లోగడ ఆమోదించిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు క్లాజులను సడలించే సవరణలను మంత్రివర్గం ఆమోదించిన తదుపరి కూడా ఆ బిల్లుకు రాజ్యసభ ఆమో దం పొందలేకపోయింది. ఈ మూడు బిల్లులు రాజకీయ ప్రాముఖ్యతగలివి. 2014 ఎన్నికలతో పోల్చినపుడు వివిధ కారణాలవల్ల ఆయా తరగతుల్లో పెరిగిన అసంతృప్తిని గమనించిన బిజెపి నాయకత్వం ఈ బిల్లుల ద్వారా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నది.

ఒబిసిలోని వెనుకబడిన కులాలను కూడగట్టే ప్రయత్నంలో కొంతమేరకు సఫలమైంది కూడా. బిసి కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వటం ద్వారా బిసిలను ఆకట్టుకునే ఉద్దేశం ఆ బిల్లు వెనుక ఉంది. అలాగే, సుప్రీంకోర్టు తీర్పు తదుపరి దళిత వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనచేసినా ఆ తీర్పును పూర్వపక్షం చేసే ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేయలేదు. తొలిదఫా ఆందోళనలో 9 మంది దళితులు పోలీసు కాల్పుల్లో మరిణించినా చలించని ప్రభుత్వం, దళిత సంఘాలు ఆగస్టు 9న భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వటం, ఎన్‌డిఎలోని దళిత నేతలు కూడా అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడిగా సవరణ బిల్లు తెచ్చింది. పరిస్థితుల ఒత్తిడి, ఓట్లపై దృష్టితో బిల్లు తెచ్చినప్పటికీ అది దళితుల డిమాండ్‌ను నెరవేరుస్తున్నందున అన్ని పక్షాలు ఆమోదించాయి.

ఇక ట్రిపుల్ తలాఖ్ బిల్లు బాధిత ముస్లిం మహిళలకు రక్షణ నిస్తుందని ప్రభుత్వం వాదిస్తుం డగా, దీన్ని తమ మత వ్యవహారాల్లో జోక్యంగా ముస్లిం పురుష ప్రతినిధులు వాదిస్తున్నారు. బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలన్న కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించని బిజెపి, కాంగ్రెస్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమంటూ ఆరోపణలు చేస్తూ వారి ఓట్లకు గాలమేస్తున్నది.

ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాని మోడీ ఏకపక్షంగా కుదుర్చు కున్న ఒప్పందం పెద్ద అవినీతి కుంభకోణమంటూ, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ రాజ్యసభలో చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై రభస మధ్య సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సభను నిరవధికంగా వాయిదా వేశారు. రానున్న రోజుల్లో ఈ సమస్య ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారవచ్చు. బిజెపి మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు కూడా దీన్ని అతిపెద్ద అవినీతి కుంభకోణంగా దుయ్యబట్టారు. సిన్హా, శౌరి నిరుద్యోగులంటూ కొట్టి పారేసినంత మాత్రాన బిజెపి సమస్యను దాటవేయలేదు. వేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న రాఫెల్ వ్యవహారంపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు.