Home తాజా వార్తలు ‘శ్రీమంతుడు’… యూనివర్సల్ సబ్జెక్ట్

‘శ్రీమంతుడు’… యూనివర్సల్ సబ్జెక్ట్

Mahesh Babuపోకిరి, బిజినెస్‌మెన్, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘శ్రీమంతుడు’ ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మహేష్‌తో జరిపిన ఇంటర్వూ విశేషాలు…
సినిమాకు ‘శ్రీమంతుడు’ టైటిల్ ఎందుకు పెట్టారు?
సినిమాకు పూర్తిగా సరిపోయే టైటిల్ ‘శ్రీమంతుడు’. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత దర్శకుడు సినిమా కథకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని సూచించాడు. నాకు కూడా టైటిల్ నచ్చి ఓకే అన్నాను. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. డైరెక్టర్ కొరటాల శివ నాకు ఈ కథ నచ్చగానే వెంటనే సినిమాలో చేసేందుకు ఓకే అన్నాను. సినిమా చాలా బాగా వచ్చింది.
తొలిసారి కో-ప్రొడ్యూసర్‌గా చేస్తుండడం ఎలా ఉంది?
సినిమా నచ్చే కో-ప్రొడ్యూస్ చేస్తున్నాను. గతంలో మా అక్క, అన్నయ్య నా సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించారు. కానీ ఈసారి నేనే సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా చేస్తున్నా.
‘శ్రీమంతుడు’ సాంగ్స్ బాగున్నాయి. మరి డ్యాన్సులపైనా కూడా ప్రత్యేక దృష్టి పెట్టారా?
సినిమాలో డ్యాన్సులు సూపర్‌గా ఉంటాయి. డ్యాన్స్ మాస్టర్లు రాజుసుందరం, శివ కొరియోగ్రఫీలోని పాటల్లో నా స్టెప్పులు అదిరిపోతాయి. వారి స్టైల్స్ ఎంతో బాగుంటాయి. పాటలన్నీ అభిమానులు,ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇక సినిమాలో
మ్యూజికల్ హిట్‌గా నిలిచిన చారుశీల… సాంగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేశాను.
సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్‌పై?
‘శ్రీమంతుడు’లో గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడే నేను కూడా ఓ గ్రామాన్ని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఈ విషయమై మా బావతో మాట్లాడాను. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా.
దర్శకుడు కొరటాల శివ గురించి?
దర్శకుడు కొరటాల శివ నా నుంచి బెస్ట్ పర్‌ఫార్మెన్స్ రాబట్టాడు. అతను బెస్ట్ రైటర్. ఎన్నో మంచి స్క్రిప్ట్‌లు రాశాడు. ఈ సినిమాకు బెస్ట్ స్టోరీ, స్క్రిప్ట్‌ను అందించాడు. ఇక సినిమా నిర్మాతలు యుఎస్‌లో పెద్ద డిస్ట్రిబ్యూటర్లు. వాళ్లు నిర్మాతలుగా చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి వారు మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.
హీరోగా, కో-ప్రొడ్యూసర్‌గా చేశారు కదా… డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఉందా?
హీరోగానే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా చేయడం వరకు ఓకే. కానీ డైరెక్షన్ చేయాలన్న ఆలోచన నాకు ఏమాత్రం లేదు.
భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాలు చేస్తారా?
కెరీర్‌లో ఇప్పటివరకు టక్కరి దొంగ, నాని, 1 వంటి ప్రయోగాత్మక సినిమాలు చేశాను. కానీ నేడు ఒక పెద్ద సినిమాను ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో ప్రయోగాత్మక సినిమాల్లో కూడా కమర్షియల్ విలువలుండడం తప్పనిసరిగా మారింది. కాబట్టి భవిష్యత్తుల్లో ప్రయోగాత్మక సినిమాలు చేసినా వాటిలో కమర్షియల్ అంశాలు ఉండేటట్లు చూసుకుంటా. కథ ఫ్రెష్‌గా ఉంటేనే ఖచ్చితంగా ప్రయోగాత్మక సినిమా చేస్తా.
హీరోయిన్ శృతిహాసన్ గురించి?
గొప్ప నటుడు కమల్‌హాసన్ తనయురాలు శృతిహాసన్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మర్. తను సినిమా బాగా చేసింది. మా ఇద్దరి మధ్య సీన్లు అందరినీ అలరిస్తాయి.
సినిమాలో జగపతిబాబు నటించడంపై?
సినిమాలో జగపతిబాబు నటించినందుకు ఆయనకు థాంక్స్. ఓ పాత్రకు పాపులర్ ఆర్టిస్ట్ అవసరముండడంతో దర్శకుడు కొరటాల శివ ఆయన్ని సంప్రదించాడు. ఈ పాత్ర నచ్చడంతో ఆయన కూడా సినిమాలో నటించేందుకు ఓకే అన్నాడు.
తెలుగు, తమిళ్‌లో ఒకేసారి విడుదల చేస్తున్నారెందుకు?
ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. అందరికీ సినిమా రీచ్ కావాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం.
తెలుగు, తమిళ్‌లో సినిమా కంటెంట్ ఓకేవిధంగా ఉంటుంది. తమిళ్‌లో కూడా ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను అక్కడ కూడా ఆగస్టు 7న విడుదల చేస్తున్నాం. నేను తమిళ్ చాలా బాగా మాట్లాడగలను. కానీ తమిళ్ వర్షన్‌లో స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి సమయం సరిపోలేదు.
బాలీవుడ్‌లో భజరంగీ భాయ్ జాన్, పీకె వంటి మంచి సినిమాలు తెలుగులో కూడా వస్తాయా?
టాలీవుడ్ డైరెక్టర్లు, రైటర్లు కృషిచేస్తేనే ఇటువంటి సినిమాలు తెలుగులోనూ వస్తాయి. ఆ సినిమాల కథలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాంటి స్టోరీ, స్క్రిప్ట్ నాకు ఎవరైనా చెబితే వెంటనే ఓకే చేస్తా.
మహేష్ జేమ్స్‌బాండ్ చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని మీ నాన్న అన్నారు కదా…దీని గురించి ఏమంటారు?
మా నాన్నకి నేను కొత్త తరహాల పాత్రలు చేయాలనేది ఉంది. ఆయన ఆశించినట్లుగానే జేమ్స్‌బాండ్‌లాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా.
అల్లూరి సీతారామరాజు వంటి క్లాసిక్ హిట్ సినిమాలను చేయాలనుందా?
నాన్నగారు నటించిన అల్లూరి సీతారామరాజు ఓ క్లాసిక్ హిట్ మూవీ. అది నాకు బైబిల్‌లాంటిది. ఆ సినిమాను దాదాపు వందసార్లు చూసుంటాను. అటువంటి చిత్రాలు చేయడానికి సమయం రావాలి.
బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన ఉందా?
టాలీవుడ్‌లో సినిమాలతోనే ఇక్కడ బిజీ అయిపోయాను. దీంతో బాలీవుడ్‌లో నటించడానికి సమయం ఏమాత్రం సరిపోదు. ‘శ్రీమంతుడు’ చేయడానికి నాను ఎనిమిది నెలల సమయం పట్టింది. దీని తర్వాత వెంటనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఉంది. దానికి మరో ఎనిమిది నెలలు పడుతుంది. ఈ సమయంలో నేను బాలీవుడ్ సినిమా చేస్తే తెలుగులో నా సినిమా రిలీజ్ అవ్వడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అక్కడ సినిమాలు చేయాలనుకోవడం లేదు.