Home కరీంనగర్ సంకల్పం ఉంటే లక్షం సాధ్యం

సంకల్పం ఉంటే లక్షం సాధ్యం

5KNR03-P-1కరీంనగర్: చదువుకున్న యువతలో గట్టి పట్టుదల, సంకల్పం బలంగా ఉంటే ఎన్నుకున్న లక్ష్యాలను సునాసాయంగా సాధించవచ్చునని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌చే నిర్వహించబోవు గ్రూప్-2 పరీక్షలు సన్నద్దం అవుతున్న అభ్యర్థులకు వారధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు మంత్రి ముఖ్య అతిథిగా మాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దూరపు కొండలు నునుపు, మనకంటే వేరేవారు గొప్ప అని భావించకుండా నీలో ఉన్న ప్రతిభను కనబర్చినపుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని, తల్లిదండ్రులు కన్న కలలను వమ్ము చేయకుండా గట్టి సంకల్పంతో ఉద్యోగాలు సాధించి అమ్మనాన్నల కోరికలు నెరవేర్చాలని అభ్యర్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంత యువత ఉద్యోగాలు సాధిస్తే ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి మంచి అధికారిగా సమాజంలో గుర్తింపు పొందుతారని అన్నారు. యువత తమ మేధాశక్తితో తెలంగాణను పుష్పింప చేయాలని అన్నారు.

విజ్ఞానం ఉంటే యువత ప్రపంచంలో ఎక్కడైనా రాణించవచ్చన్నారు. 15 వేల ఉద్యోగాలు ఆరంభం మాత్రమేనని లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని కూడా భర్తీ చేస్తామన్నారు. రానున్న రోజుల్లో స్వరాష్ట్రం సాధించిన ఫలితాలు ప్రజలు ఎన్నో అనుభవిస్తామని తెలిపారు. కష్టాలు తెలిసిన మీరు మరింత కష్టపడి కరీంనగర్ జిల్లా నుండే ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో కష్టపడి చదివితే సాధించలేనిది ఏది లేదన్నారు.

యువతకు హైదరాబాద్ స్థాయిలో వారధి ద్వారా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నామని, హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుండి అనుభవగ్నులైన ఫ్యాకల్టిచే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ యువత పట్టుదల, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లితే విజయం వరిస్తుందన్నారు. యువత నిరుత్సాహ పడవద్దని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్పూర్తిగా తీసుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వం 10 సంవత్సరాల వయసు సడలించిందని భయం వీడి పోరాట స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. జడ్పీ చైర్‌పర్స్‌న్ తుల ఉమ మాట్లాడుతూ నిరుద్యోగులకు దారి చూపేది వారిధి సంస్థ అని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రూప్-2 పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం గురించిన ప్రశ్నలు ఉంటాయి కనుక ఉద్యమం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జేసి డా.నాగేంద్ర, పిడి డిఆర్‌డిఎ అరుణశ్రీ, ఆర్‌డివో చంద్రశేఖర్, వారధి కన్వినర్ తదితరులు పాల్గొన్నారు.