Home ఎడిటోరియల్ సంపాదకీయం : రజనీకాంత్ డోలాయమానం

సంపాదకీయం : రజనీకాంత్ డోలాయమానం

Sampadakeeyam-Logoతమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇక రాజకీయ రంగంలో అడుగు పెడతారా? ఇది ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్న సంచలనాత్మక ప్రశ్న. సరైన సమాధానం ఇంతవరకు లభించలేదు. బహుశా లభించకపోయినా ఆశ్చర్యం లేదు. తమిళ రాజకీయాలు సినీరంగంతో పెనవేసుకుని ఉన్నప్పటికీ ఆసక్తిపరులందరూ సఫలం కాలేదు. అన్నాదురై, కరుణానిధి, ఎం.జి.రామచంద్రన్, జయలలిత వంటి బహుకొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానం చేరుకోగలిగారు. అందుకు కావలసిన ధీరత్వం, చాతుర్యం, ఆకర్షకశక్తి రజనీకాంత్‌కు వెండితెరపై మెండుగా ఉన్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయస్సు 70. అంత లేటు వయస్సులో ఆయన కొత్తరంగాన్ని ఎంచుకుని రాణించగలడా? ఒకవేళ రాజకీయా ల్లోకి ప్రత్యక్షం కావాలనుకుంటే సొంతపార్టీ పెడతారా లేక బిజెపి బండి ఎక్కుతారా? ఆయన స్థానికత సమస్య (అతడు కన్నడిగుడు) ముందరి కాళ్లకు బంధం అవుతుందా? తమిళులింకా సినీరంగంవైపే చూస్తున్నారా? ఇవి తర్కించాల్సిన అంశాలు. జయలలిత మరణం, 93 ఏళ్ల కరుణానిధికి దీర్ఘకాలంగా అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో నాయకత్వ శూన్యత ఏర్పడింది. దాన్ని పూరించగలవారు ఎవరన్నది ప్రశ్నార్థకంగా ఉంది. సినీప్రేక్షక రంజకుడైన రజనీకాంత్ ఎనిమిదేళ్ల తదుపరి తొలిసారి గతవారం తన అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేయటంతో, అతడు రాజకీయరంగ ప్రవేశ ప్రకటన చేయబోతు న్నాడన్న ఊహాగానాలు బయలు దేరాయి. గత రెండు దశాబ్దాల్లో అటువంటి పుకార్లు చాలాసార్లు షికారు చేశాయి. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన ఆశీస్సుల కొరకు ప్రయత్నించని (ఎఐఎడిఎంకె తప్ప) పార్టీ లేదు. అయితే అభిమాన సంఘాలతో సమావేశంలో ఆయన ఆరంభ, ముగింపు ప్రసంగాలు- ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా, రాడా?’ అనే సస్పెన్స్ కొనసాగించాయి.
“జీవితంలో మనం ఏమి చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. నేను యాక్టర్ కావాలని ఆయన కోరుకున్నాడు-నేను నా బాధ్యత నెరవేరుస్తున్నాను. భగవంతుడు ఆదేశిస్తే రేపే రాజకీయాల్లోకి వస్తాను” అన్నాడు ఆధ్యాత్మిక పరుడైన రజనీకాంత్. “నేను రాజకీయాల్లోకి వస్తే నిజాయితీతో ఉంటాను, ధనాశాపరులను దరిచేరనివ్వను. అటువంటి వారితోపనిచేయను” అని కూడ ప్రకటించాడు. “యుద్ధం వచ్చినపుడు మిమ్ము పిలుస్తాను. అప్పుడు రండి. పూర్వం యుద్ధంవస్తే పురుషులందరూ వెళ్లేవారు” అని చెప్పటం ద్వారా 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దిగవచ్చునన్న సంకేతం ఇచ్చారు.
1996లో రజనీకాంత్ ప్రధాని పి.వి.నరసింహారావును కలిసినప్పుడు అతడు రాజకీయాల్లోకి వస్తాడన్న చర్చ తొలిసారి మొదలైంది. రాజకీయాల్లోకి దుమకక పోయినా, “జయలలిత గనుక తిరిగి అధికారంలోకివస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని” ప్రకటనచేసి డిఎంకె-కాంగ్రెస్ ఫ్రంట్‌కు తోడ్పడ్డాడు. ‘నేను 21ఏళ్లక్రితం ఒక రాజకీయ కూటమికి తోడ్పడి తప్పుచేశాను. అప్పటినుంచి ప్రతి ఎన్నికల్లోకి నా పేరు లాగుతున్నారు. నేను ఏ రాజకీయ పార్టీని బలపరచటం లేదు’ అని ఆ మధ్య వివరించారు. ప్రధాని నరేంద్రమోడీతో రజనీకి సత్సంబంధాలున్నాయి. రజనీ రాజకీయరంగ ప్రవేశాన్ని అమిత్‌షా ఆహ్వానించాడు. దక్షిణాదిలో ప్రజాకర్షక నాయకులను రాబట్టే ప్రయత్నంలో ఉన్న బిజెపి అతనికి ఎరవేయటంలో ఆశ్చర్యం లేదు. అయితే అతడు అంతిమంగా నిర్ణయం తీసుకుంటే బిజెపిలో చేరతాడా లేక బిజెపి తోడ్పాటుతో సొంత పార్టీ పెడతారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
రాష్ట్రంలోని రాజకీయ శూన్యతను భర్తీ చేయగలిగింది రజనీకాంత్ ఒక్కడేనన్న విశ్వాసం ఆయన అభిమానుల్లో ఉంది. రజనీకాంత్ కన్నడిగుడైనందున అతన్ని పాలకుడిగా అంగీకరించబోమంటూ తమిళ దురభిమాన సంఘాలు అప్పుడే ఆందోళన మొదలుపెట్టాయి. 43 ఏళ్లుగా మద్రాసులో జీవిస్తున్న నేను కచ్చితంగా తమిళుడనే అన్నాడు రజనీకాంత్. ముత్తు సినిమాలో రజనీ డైలాగ్, ‘నేను ఎప్పుడు, ఎలా ప్రవేశిస్తానో ఎవరికీ తెలియదు. కాని ప్రవేశిస్తాను. సరైన సమయంలో ప్రవేశిస్తాను”. ఆ సమయం వస్తుందో, రాదో? బెట్ కట్టటానికి ఎవరూ సిద్ధంగా లేరు.