Search
Thursday 15 November 2018
  • :
  • :

సర్కార్ దవాఖానాల్లో మొరాయిస్తున్న పరికరాలు

 Patients suffering from difficulties

ఇబ్బందులు పడుతున్న రోగులు
మరమ్మతులకు నిపుణులు కరువు
పట్టించుకోని ఉన్నతాధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ ఇందుకు ఉన్నతాధికారుల సహకరణ కరువైంది. నగరంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం ఆసుపత్రుల బాగోగులు చూసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు ఏదో వచ్చామా.. వెళ్లామా అనే విధంగానే విధులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఎంతో అవసరమైన సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌లతో పాటు తదితర ఎంతో ముఖ్యమైన పరికరాల పని తీరుపై ఆరా తీయలేకపోతున్నారు. ఒక్కోసారి నెలల తరబడి కూడా ఈ పరికరాలు అందుబాటులో ఉండకపోయినా చర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రభుతాసుపత్రుల్లో యంత్రాలు పదే పదే మొరాయిస్తున్నా వాటి గురించి అధికారులు పట్టించుకోలేకపోతున్నారు. యంత్రాల మరమ్మతులకు కూడా నిపుణులు లేరు. యంత్రాలు మొరాయించిన ప్రతిసారి బయటి నుంచి ఇంజనీర్లు రావాల్సిందే. అప్పటి వరకు ఆ యంత్రాల సేవలకు రోగులు దూరమవుతున్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో అన్ని రకాల సిబ్బందితో పాటు ఇంజనీర్లు కూడా ఉండాలి. యంత్రాలు ఇతర పరికరాలు పనిచేయకపోతే వాటిని సరిచేయగల నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో ఇంజనీర్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

ప్రైవేటు ఆసుపత్రులకే పరుగులు
ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణకు ఎంతో ముఖ్యమైన యంత్రాలు సక్రమంగా పనిచేయడంలేదు. తరచూ మొరాయిస్తున్నాయి. ఈ పరికరాలు రీపేర్‌కు వస్తే బయటి ఇంజనీర్లతోనే రిపేర్లు చేయిస్తున్నారు. ఇందుకుగాను భారీగా ఖర్చులు అవుతున్నాయి. పరికరాలు తరచూ మొరాయిస్తుండటంతో రోగులకు కూడా వీటిపై నమ్మకం పోతోంది. వైద్యులు సిటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలు రాసినట్టయితే రోగులు బయట ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయక తప్పడంలేదు.

నెలల తరబడి ఎదురుచూపులు
సర్కార్ ఆసుపత్రుల్లో కొన్ని యంత్రాలు చెడిపోతే విదేశాల నుంచి రప్పించి రిపేర్ చేయించాల్సిందే. వారు వచ్చేంత వరకు ఆ యంత్రాలు పనిచేయవు. ఒక్కోసారి నెలల సమయం కూడా పడుతోంది. ఎలాంటి రిపేర్ అయినా ఇక్కడ బయో మెడికల్ ఇంజనీర్లు లేకపోవడమే కారణం. ప్రభుత్వాసుపత్రుల్లో పరికరాల పనితీరును పరిశీలించడానికి బయో మెడికల్ ఇంజనీర్లు చాలా అవసరం. కానీ ఇక్కడ లేకపోవడంతో ఆ ప్రభావం రోగులపై తీవ్ర స్థాయిలో పడుతోంది.

ఎంఆర్‌ఐ, సిటీస్కాన్‌ల గోస
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులను సంప్రదించిన అనంతరం రోగనిర్ధారణకు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లు ఎంతో అవసరం. కానీ ఆ యంత్రాల విషయానికొచ్చే సరికి 10 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. ఎందుకంటే అక్కడ అప్పటికే వందలాదిగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. యంత్రాలు సక్రమంగా నడిస్తేనే పరిస్థితి ఇలా ఉంటుంది. ఇక యంత్రాలు మొరాయిస్తే అక్కడ రోగుల గోస అంతా ఇంతా కాదు. వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకుందామంటే నగదులేక ఆ యంత్రాలు వినియోగంలోకి వచ్చేంత వరకు వేయి కండ్లతో ఎదురుచూడక తప్పడంలేదు.

పట్టించుకోవడంలేదు
ప్రభుత్వాసుపత్రుల్లో యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. దాదాపు నగరంలోని 24 ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ సంస్థనే చేపడుతోంది. అయితే నగరంలోని ఆసుపత్రుల్లో అన్ని పరికరాలు కలిపి దా దాపు 2400 వరకు యంత్రాలు పనిచేయడం లేవని సమాచారం. వీటి మరమ్మతులకు సంబంధించి ఆ సంస్థ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో యంత్రా లు పనిచేయక పోవడంతో ఆ ప్రభావం రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Comments

comments