Home జిల్లాలు సూర్యాపేట నియోజకవర్గంలో సాగునీరు లక్షం లక్ష ఎకరాలు

సూర్యాపేట నియోజకవర్గంలో సాగునీరు లక్షం లక్ష ఎకరాలు

మూసీనదిపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం

నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు
వ్యవసాయంతోపాటు పశుపోషణకూ ప్రాధాన్యం
గ్రామజ్యోతి కెసిఆర్ దార్శనీయతకు నిదర్శనం
ప్రతి ఒక్కరూ గ్రామ ప్రగతికి చేయూతనివ్వాలి
విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

31srpt03సూర్యాపేట : నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్షమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఆయన గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూసీనదిపై చెక్ డ్యాములు నిర్మించి వృథాగా పోయే నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించడానికి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12 కోట్ల రూపాయలతో మూడు సార్లు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లాలో 24 లక్షల 40 వేల గొర్రెలు, మేకలు ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి పశువైద్య బృందాలు వచ్చి నట్టల నివారణ కార్యక్రమం చేపడుతారని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటూ పశుపోషణ కూడా ప్రాధాన్యం కలిగిన రంగమన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమం సిఎం కెసిఆర్ దార్శనీయతకు నిదర్శనమని కొనియాడారు. మనం కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటామో గ్రామజ్యోతి ద్వారా గ్రామాన్ని కూడా అలాగే కాపాడుకోవాలన్నదే కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. ప్రతి పౌరుడు సొంత గ్రామ ప్రగతికి చేయూతనిస్తే బంగారు తెలంగాణ సాకారమవుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహాకార బ్యాంక్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపిపి వట్టే జానయ్యయాదవ్, జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షులు పోలెబోయిన నర్సయ్యయాదవ్, తహసీల్దార్ మహమూద్ అలీ, ఎంపిడివో నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ సైదమ్మ, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, కోడి సైదులు తదితరులు పాల్గొన్నారు.