లండన్ : అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్‌ల్లో 300 విజయాలు పూర్తి చేసింది. వింబుల్డన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడోరౌండ్లో టాప్‌సీడ్ సెరెనా 43వ ర్యాంకర్ అనిక బెక్(జర్మనీ) ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించింది. దీంతో మహిళల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన మార్టినా నవ్రతిలోవా(306)కు మరింత చేరువైంది. 52 నిమిషాల్లోనే ముగిసిన మూడోరౌండ్లో సెరెనా 6-3, 6-0తో విజయం సాధించింది. తొలిసెట్ మూడోగేమ్ సర్వీస్ కోల్పోయిన సెరెనా తరువాత ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా కోల్పోని సెరెనా 20 నిమిషాల్లోనే గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. మ్యాచ్‌లో ఐదు విన్నర్స్ సంధించిన సెరెనా ఏడు ఏస్‌లు కొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో సెరెనా 13వ సీడ్ స్వెత్లెనా కుజ్నెత్సోవా(రష్యా)తో పోటీపడనుంది. కుజ్నెత్సోవా 6-7(1/7), 6-2, 8-6తో స్టెఫెన్స్(అమెరికా)పై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో రద్వాన్‌స్కా(పొలాండ్) 6-3, 6-1తో సినియాకోవా(చెక్)పై వెస్నినా(రష్యా) 7-5, 7-5తో బోసెర్ప్(అమెరికా)పై, ఎకరీనా మకరోవా(రష్యా) 6-4, 6-2తో స్ట్రికోవా(చెక్)పై నెగ్గగా, రాబెర్టా విన్సీ(ఇటలీ) 3-6, 4-6తో వండెవెగ్(అమెరికా) చేతిలో, బస్కిన్జీ(స్విట్జర్లాండ్) 3-6, 2-6తో పవ్లిచెంకోవా(రష్యా) చేతిలో ఓడారు.
సొంగా ముందంజ : పురుషుల సింగిల్స్‌లో వెటరన్ జోవిల్ ఫ్రెడ్ సొంగా(ఫ్రాన్స్)తో పాటు గాస్కెల్(ఫ్రాన్స్), కిర్గిస్(ఆస్ట్రేలియా), బెర్డిచ్(చెక్) ప్రిక్వార్టర్స్‌కు చేరారు. 4 గంటలా 29 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 12వ సీడ్ సొంగా 6-7(3/7), 3-6, 7-6(7/5), 6-2, 19-17తో జాన్ ఇస్నర్‌పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో థామస్ బెర్డిచ్ 6-3, 6-4, 4-6, 6-1తో జ్వెరెవ్(జర్మనీ)పై చెమటోడ్చాడు. ఇతర మ్యాచ్‌ల్లో నికోకిర్గిస్ 6-3, 6-7(2/7), 6-3, 6-4తో లోపెజ్(స్పెయిన్)పై, గాస్కెట్ 2-6, 7-6(8/6), 6-2, 6-3తో రోమస్(స్పెయిన్)పై, సౌలిలె(ఫ్రాన్స్) 6-7(4/7), 7-6(8/6), 7-5, 6-1తో డెల్‌పొట్రో(అర్జెంటీనా)పై నెగ్గారు.
ప్రిక్వార్టర్స్‌లో సాన్‌టినా : మహిళల డబుల్స్‌లో టాప్‌సీడ్ సానియామీర్జా-మార్టినా హింగిస్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. జపాన్ జోడీ ఎరిహుజుమి-మియుకాటోతో జరిగిన రెండోరౌండ్లో ఇండో-స్విస్ జోడీ 6-3, 6-1తో 52 నిమిషాల్లోనే విజయం సాధించింది. ఇక పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. మార్సిన్ మట్కోవాస్కి జతగా బరిలోకి దిగిన పేస్ రెండోరౌండ్లో 6-3, 6-2తో జాన్పీర్స్-కొంటినెన్ జంట చేతిలో ఓడింది.