Home వార్తలు బెస్ట్ అంటే 100 కోట్లు దాటాల్సిందేనా!

బెస్ట్ అంటే 100 కోట్లు దాటాల్సిందేనా!

Prabhas63 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం దక్కింది. రాజమౌళి అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి’ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికై తెలుగువాళ్లందరినీ తలెత్తుకునేలా చేసింది. మరోవైపు క్రిష్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ‘కంచె’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి మన ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఈ అవార్డుల విషయంలో ఒకటీ అరా అసంతృప్తులు వినిపించినా… ఓవరాల్‌గా మాత్రం అవార్డులపై సంతోషం ప్రకటించినవారే ఎక్కువ. కానీ ఈసారి ఉత్తమ అవార్డులకు ఎంపికైన సినిమాల జాబితాను పరిశీలిస్తే ఓ ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. సాధారణంగా బెస్ట్ అనిపించుకునే సినిమాలన్నీ ఆర్ట్ మూవీల టైపులోనే ఉంటాయి. వాటి కలెక్షన్లు కూడా డల్‌గానే ఉంటాయి. కనీసం గత రెండు,మూడేళ్ల హిస్టరీ తీసుకున్నా ఇదే అర్థమవుతుంది. 2015లో ‘కోర్ట్’ అనే మరాఠీ మూవీ ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది. కోర్టు డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమాను చైతన్య తమ్హానే దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం 10 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డులకు ఇండియా తరపున నామినేట్ అయింది. ఇక 2014లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘షిప్ ఆఫ్ థీసిస్’ అనే హిందీ మూవీ. ఈ చిత్రానికి కథను అందించి దర్శకత్వం వహించాడు ఆనంద్ గాంధీ. దీనికొచ్చిన కలెక్షన్లు 48 లక్షలే. అదే ఏడాది బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు వచ్చిన ‘షహీద్’ చిత్రానికి 3.2 కోట్లు వసూలయ్యాయి. ఇక 2013లో నేషనల్ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన హిందీ చిత్రం ‘పాన్‌సింగ్ తోమర్’. అథ్లెట్ పాన్ సింగ్ తోమర్ జీవితంపై తెరకెక్కిన బయోగ్రఫికల్ సినిమా ఇది. టిగ్‌మన్షు ధులియా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ రోల్‌ను ఇర్ఫాన్ ఖాన్ పోషించి తన అద్భుతమైన నటనతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెల్చుకున్నాడు. ఈ మూవీ 12 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇదిలాఉండగా ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘బాహుబలి’ ఇండియాలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలలో ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 600 కలెక్షన్ల మార్క్‌ను అందుకొని దేశ, విదేశాలలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ’. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 365 కోట్లు కొల్లగొట్టింది. ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌కు అవార్డు అందించిన ‘తను వెడ్స్ మను రిటర్న్’ 243 కోట్లను రాబట్టింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ రొమాంటిక్ డ్రామా. ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అమితాబ్ నటించిన ‘పీకూ’ చిత్రం 141 కోట్లు వసూళ్లను సాధించింది. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికాపదుకునే, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. అంటే ఈ ఏడాది 63 ఏళ్ల జాతీయ అవార్డులలో బెస్ట్ అనిపించుకున్న చిత్రాలన్నీ 100 కోట్ల మార్క్‌ను దాటినవే కావడం విశేషం. అంటే బెస్ట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాల్సిందేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో ఆర్ట్ సినిమాలను కమర్షియల్ మూవీలు డామినేట్ చేసే శకం ఇప్పుడు ఆరంభం అయిపోయినట్లే.