Home దునియా యూట్యూబ్ స్టార్

యూట్యూబ్ స్టార్

Youtube-Star-bhamma

ఎంత నాగరికత పెరిగినా ఎన్ని విదేశీ వంటలు కళ్ల ముందు కన్పించినా ఊరి వంటల ప్రాధాన్యతే వేరు. సంప్రదాయ వంటలకు దేశంలో ఎప్పటికీ పెద్దపీటే. ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో నోరుతిరగని మెన్యూతో చక్కగా గార్నిష్ చేసి వడ్డించినా ఉప్పుచేప పప్పుచారు ముందు దిగదుడుపే.

తెనాలికి పదికిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న పల్లెటూరు గుడివాడ. ప్రపంచం అంటే ఏంటో తెలియని ప్రజలు. శతాధిక వృద్ధురాలి వల్ల యావత్ ప్రపంచానికి తెలిసిందీ వూరు. బిబిసీ చానల్‌ను సైతం ఊరికి రప్పించింది ఓ బామ్మ. ఆమే కంట్రీఫుడ్ యూట్యూబ్ ఛానల్‌లో పొలంగట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ.

నూటారేళ్ల మస్తానమ్మ ఉంటున్న పూరిగుడిసెకు కనీసం తలుపు కూడా లేదు. వంటరిగానే ఉంటుంది. అలాగని అనాథ కాదు. ఐదుగురు పిల్లలు. నలుగురు చనిపోగా ఒక్కడే మిగిలాడు. భర్త ఇరవై రెండేళ్లకే దూరమయ్యాడు. అప్పటి నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకుని పెంచింది. ఇతరులపై ఆధారపడటం ఇష్టంలేదామెకు. ఎవరైనా కూలికి పిలిస్తే వెళ్తుంది. లేదంటే ఇంట్లోనే ఉంటుంది. ఒక్కసారిగా యూట్యూబ్ ద్వారా స్టార్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బామ్మకు ఫ్యాన్స్ ఉన్నారు. దేశవిదేశాల్లో మస్తానమ్మ అంటే తెలియని వారుండరు. ఆమె చేతివంటను తినాలని ఆరాటపడనివారుండరు. కంట్రీఫుడ్స్ అని యూట్యూబ్‌లో కొడితేచాలు. అద్భుతమైన వంట వీడియోల పేజీ కనిపిస్తుంది. అందులో ఒక్క వీడియోని కూడా వదలకుండా చూస్తారు. అక్కడేమీ మోడ్రన్ కిచెన్ సెటప్ ఉండదు. ఖరీదైన వంట గిన్నెలు కనిపించవు. వంటనూనెల బ్రాండ్ బిల్డర్లు పక్కనుండవు. ఆహా ఓహా అనుకుంటూ వాయిస్ ఓవర్ హడావిడి అస్సలుండదు. చాలా సింపుల్. చెరువు గట్టు వెంబడి కర్రల పొయ్యి ముందు చిన్న స్టూలు మీద కూర్చుని ఎడమచేతివాటంతో వంట చేస్తుంటుంది మస్తానమ్మ.

ఏమాత్రం శ్రమ లేకుండా ఉత్సాహంగా చాలా తేలిగ్గా వండుతుంది. పదినిముషాల్లో వీడియో పూర్తవుతుంది. మస్తానమ్మ చేత్తో ఏది చేసినా అమోఘం. తందూరి చికెన్ రేంజ్‌లో కాలిన చేపల్ని అరిటాకులో పెట్టుకుని పక్కకు నిమ్మకాయ ఉల్లిగడ్డ నంజుకుంటూ తింటుంటే ఆహా అనకుండా ఉండలేరు. టైగర్ రొయ్యల కూర, నాటుకోడి వేపుడు, కోడిగుడ్డు అట్టు టేస్ట్ చేయాల్సిందే. నాన్‌వెజ్‌లోనే కాకుండా వెజ్‌లోనూ మస్తానమ్మ చేతికి తిరుగులేదు. బెండకాయ డీప్‌ఫ్రై, వంకాయ నూనెలో వేయించడం ఇలాంటివి బోలెడు వీడియోలు .. ముసలమ్మ వండే వంటలకు రెండు లక్షల యాభై మంది సబ్‌స్రైబర్లు ఉన్నారంటే నమ్మక తప్పదు.

ఈ ఐడియా ఎలా వచ్చిందంటే…
మస్తానమ్మ మనవడు లక్ష్మణ్‌కు ఒకరోజు వంటల వీడియోలతో యూట్యూబ్ చానల్ రన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడే బామ్మ మస్తానమ్మ చటుక్కున గుర్తొచ్చింది. మస్తానమ్మ వంట టేస్ట్ తెలుసు కాబట్టి. ఇంకేముందు ఐడియా కార్యరూపం దాల్చింది. కిచెన్ సెటప్ హంగామా లేకుండా నేచురల్‌గా ఆమె వండుతుంటే షూట్ చేయడం, అప్‌లోడ్ చేయడం అలా మొదలైంది కంట్రీఫుడ్స్ చానల్. మొదటి వీడియోనే క్లిక్ అయింది. అభిమానుల్ని తెచ్చిపెట్టింది. అన్నింటికంటే హైలెట్ పుచ్చకాయలో చికెన్‌కర్రీ. ఈ వీడియోకి దాదాపు 70లక్షల వ్యూస్ వచ్చాయి. ఇదంతా యూట్యూబ్ కోసమని, డబ్బులు వస్తాయని, అందరూ చూస్తారని మస్తానమ్మకు తెలియదు. మనవడు అడిగాడు కాబట్టి చేస్తుంది . మనవడి మీద ప్రేమతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది.

ఈ వంటలను భారతీయుల తర్వాత అమెరికా, జర్మనీ, ఇంగ్లండ్, పాక్‌లో ఉన్న ప్రవాస భారతీయులతోపాటు విదేశీయులు బామ్మ వంటలకు ఫిదా అవుతున్నారు. చీరలు గ్రీటింగ్ కార్డులు పంపుతుంటారు. సన్మానం చేస్తామంటూ వెంటబడుతున్నారు. అన్నింటికీ చిరునవ్వులు చిందిస్తోందీ బామ్మ. నీ ఆరోగ్య రహస్యం ఏంటని అడిగితే..నెయ్యి, చేపలు, మాంసం, తాబేలు కూర, ఎండ్రకాయలు అన్నీ తినేదాన్ని. ఇంతమటుకు ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు. ఎప్పుడూ ఖాళీగా కూర్చోను. పనిచేస్తూనే ఉంటాను అంటూ తన ఆరోగ్య రహస్యం చెబుతోంది మస్తానమ్మ.

                                                                                                                                                                      కర్రె మస్తానమ్మ