Search
Sunday 18 November 2018
  • :
  • :

దిమిత్రోవ్ ఇంటికి…

 10th seed Coronado Busta lost in the third round

పారిస్: గ్రిగర్ దిమిత్రోవ్, ఎలినా స్విటొలినా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోటీల్లో వీరు ఓటమి చవిచూశారు. అయితే రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరెవ్, మాజీ చాంపియన్ నొవాక్ జొకొవిచ్, జపాన్ స్టార్ నిషికోరి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరొలైన్ వోజ్నియాకి (డెన్మార్క్), 13వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్‌లో విజయం సాధించారు. నవొవి ఒసాకా, పౌలైన్ పెర్మంటర్ (ఫ్రాన్స్)ల జోరుకు మూడో రౌండ్‌లో బ్రేక్ పడింది. రెండో సీడ్ జ్వరెవ్ మరో మారథాన్ పోటీలో చెమటోడ్చి విజయం సాధించాడు. జొకొవిచ్ కూడా మూడో రౌండ్‌లో పోరాడి గెలిచాడు. అయితే నిషికోరి మాత్రం అలవోక విజయంతో నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.

sports5

దిమిత్రోవ్ ఔట్…
పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. స్పెయిన్ ఆటగాడు ఫెర్నాండో వెర్దాస్కోతో జరిగిన పోరులో దిమిత్రోవ్ ఓటమి చవిచూశాడు. 30వ సీడ్ వెర్దాస్కో ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన వెర్దాస్కో ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. ప్రారంభ సెట్‌లో దిమిత్రోవ్ బాగానే ఆడాడు. అయితే కీలక సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన వెర్దాస్కో సెట్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లలో వెర్దాస్కోకు ఎదురే లేకుండా పోయింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. తీవ్ర ఒత్తిడిలో కనిపించిన దిమిత్రోవ్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీంతో 76, 62. 64తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు దిమిత్రోవ్ మూడో రౌండ్‌లోనే ఓటమి పాలుకాక తప్పలేదు.

sports2

చెమడోట్చిన జ్వరెవ్…
మరోవైపు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరెవ్ (జర్మనీ) మూడో రౌండ్‌లో కష్టపడి విజయం సాధించాడు. ఇప్పటి వరకు ప్రతి రౌండ్‌లోనూ జ్వరెవ్‌కు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురువుతోంది. తాజాగా మూడో రౌండ్‌లో కూడా జ్వరెవ్‌కు హోరాహోరీ పోరు తప్పలేదు. బోస్నియా ఆటగాడు దామిర్ జుమూర్‌తో జరిగిన పోరులో జ్వరెవ్ 62, 36, 46, 76, 75 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన జ్వరెవ్ తర్వా వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. ప్రత్యర్థి ఆటగాడు అద్భుత షాట్లతో జ్వరెవ్‌ను హడలెత్తించాడు. కీలకమైన చివరి రెండు సెట్లలో గెలిచిన జ్వరెవ్ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో జొకొవిచ్ 64, 67, 76, 62 తేడాతో స్పెయిన్‌కు చెందిన 13వ సీడ్ బౌటిస్టా అగట్‌ను ఓడించాడు. అగట్ అద్భుత పోరాట పటిమను కనబరిచినా మ్యాచ్‌ను గెలవలేక పోయాడు. చివరి వరకు దూకుడును కనబరిచిన జొకొవిచ్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు జపాన్‌కు చెందిన 19వ సీడ్ కి నిషికోరి కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో నిషికోరి 63, 61, 63 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడు గిలెస్ సిమన్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన నిషికోరి ఏ దశలోనూ ప్రత్యర్థిని పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా మూడు సెట్లను గెలిచి నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు.

sports4

బుస్టా ఔట్..
స్పెయిన్ ఆటగాడు, పదో సీడ్ కరెనొ బుస్టా మూడో రౌండ్‌లోనే ఓటమి చవిచూశాడు. ఇటలీ ఆటగాడు మార్కొ సెచ్చినాటితో జరిగిన పోరులో బుస్టా కంగుతిన్నాడు. తొలి సెట్‌ను అలవోకగా గెలిచి జోరు మీద కనిపించిన బుస్టా తర్వాత ప్రత్యర్థి ధాటికి ఎదురు నిలువలేక పోయాడు. వరుసగా మూడు సెట్లు గెలిచిన మార్కొ మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. ఇటలీ ఆటగాడు బెరెన్‌టోనితో జరిగిన పోరులో థీమ్ 63, 67, 63, 62 తేడాతో విజయం సాధించాడు. రెండో సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన థీమ్ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Sports1

స్విటొలినాకు షాక్…
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ఎలినా స్విటొలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. రుమేనియా క్రీడాకారిణి మహెలా బుజమెస్కోతో జరిగిన పోరులో స్విటొలినాకు పరాజయం తప్పలేదు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన బుజమెస్కో 63, 75తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన స్విటొలినా అనూహ్య పరాజయంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మరో పోటీలో రెండో సీడ్ కరొలైన్ వోజ్నియాకి (డెన్మార్క్) సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన ఏకపక్ష పోరులో వోజ్నియాకి 60, 63 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన పౌలైన్ పార్మెంటర్‌ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన వోజ్నియాకి తొలి సెట్‌లో ఒక్క గేమ్‌ను కూడా కోల్పోలేదు. రెండో సెట్‌లో కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో పోటీలో 13వ సీడ్ మాడిసన్ కీస్ విజయం సాధించింది. మూడో రౌండ్‌లో మాడిసన్ 61, 75తో జపాన్ స్టార్ నవొమి ఒసాకాను చిత్తు చేసింది.

Comments

comments