Home నల్లగొండ పంపిణీకి 11 కోట్ల చేప పిల్లలు

పంపిణీకి 11 కోట్ల చేప పిల్లలు

 మత్స్యశాఖ అధికారులు

                  Fish

నల్లగొండ ప్రతినిధి :  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2017-18కి గాను వంద శాతం సబ్సిడీపై 11 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ  అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల వారిగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వానలు సమృద్దిగా కురిసి చెరువులు నిండితే జలాశయాల్లోకి  చేపపిల్లలను వదిలేందుకు చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లా మత్స్యశాఖ  ఆధీనంలో గల 212 చెరువులు, 8 జలాశయాలు, 1952 గ్రామపంచాయతీ చెరువులున్నాయి. 2016-17 సంవత్సరానికిగాను 164 ప్రభుత్వ చెరువుల్లో 295.23 లక్షల చేపపిల్లలను వదిలారు. 2017-18 కిగాను 494.00 లక్షల చేపపిల్లలను వంద శాతం రాయితీపై పంపిణి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధ్దం చేశారు. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాలలో 179 పెద్ద చెరువులు, 1 జలాశయం, 1084 గ్రామ పంచాయతీ చెరువులున్నాయి.

వీటిలో 2017-18 కి గాను 446.82 లక్షల చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 147 పెద్ద చెరువులు, 956 చిన్న చెరువులు, 20 మూసీ పరివాహక ప్రాంతాలుండగా గతేడాది 88 లక్షల చేపపిల్లలను పూర్తి సబ్సిడీతో 123 చెర్వుల్లోకి వదలగా ఈ ఏడాది సుమారు కోటి ఇరవై లక్షల చేపపిల్లలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు జిల్లా మత్స్యశాఖ  అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 374 పురుష మత్స పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. 26 మహిళా మత్స పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి.

రిజర్వాయర్లలో ఆగస్టు నుండి అక్టోబర్ మూడు నెలల కాలం చేపల వేట నిషేదమైనందున లైసెన్స్ కలిగిన మత్సకారుల  కొరకు ప్రభుత్వం నెలలకు రూ. 900 చొప్పున  జీవనభృతి కల్పిస్తోంది. ఈ పధకం క్రింద నల్లగొండ జిల్లాలో 212 మంది లైసెన్స్ కలిగిన మత్సకారులకు రూ.5.34 లక్షలు మంజూరి అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో దిగువ కృష్ణానదిలో 400 మంది లైసెన్స్ పొందిన మత్స కార్మికులున్నారు. రాష్ట్రంలో నీలి విప్లవం సాధించేందుకు ప్రభుత్వం చేపల చెర్వుల నిర్మాణం, కేజ్ కల్చర్, ఫిష్ హెచరీస్, ల్యాండింగ్ సెంటర్‌ల నిర్మాణానికి ఆర్దిక సహయం అందిస్తోంది. నకిరేకల్‌లో చేపల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. స్థల అణ్వేషణ పూర్తయిన వెంటనే మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నట్లు మత్సశాఖ అధికారులు తెలిపారు.