Home తాజా వార్తలు కల్యాణ్‌రామ్‌లో ఆ తపన కనపడుతుంటుంది

కల్యాణ్‌రామ్‌లో ఆ తపన కనపడుతుంటుంది

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేసి బిగ్ సీడీని విడుదల చేశారు. ఆడియో సీడీని బాలకృష్ణ, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కలిసి విడుదల చేసి తొలి సీడీని ఎన్టీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “కల్యాణ్‌రామ్‌లో ఓ తపన కనపడుతుంటుంది. మంచి సినిమాలు చేయాలని, కొత్తదనాన్ని అందించాలనే తపనతో ఎన్టీఆర్ ఆర్ట్‌ను స్థాపించారు. ఇక యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ‘118’ ఉంటుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. గుహన్ తెలుగులో దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలను డైరెక్ట్ చేయాలి. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ “గుహన్‌తో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయనతో నేను ‘బాద్‌షా’ సినిమాకు పనిచేశాను. ఆ సినిమాలో బంతిపూల జానకి… పాట చాలా బాగా వచ్చిందంటే కారణం గుహన్. ఆయన పాటను అద్భుతంగా తెరకెక్కించారు. అంతే అద్భుతంగా ఆయన దర్శకత్వంలో ‘118’ సినిమా రూపొందింది. గుహన్‌కు ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమా చూశాను. నివేదా పర్‌ఫార్మెన్స్ చూసి నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయి. మా తరంలో ఇంత గొప్ప నటి ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఆమె ఇలాగే నటించాలని కోరుకుంటున్నాను. షాలిని కూడా ఎంతో హుందాగా నటించింది. ఇక అన్నయ్య కల్యాణ్‌రామ్ కొత్త ధోరణిలో కథ చెప్పాలని తాపత్రయ పడుతుంటారు. ఆయన అందించిన చిత్రాల్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఈ చిత్రం మార్చి 1న విడుదలకానుంది”అని తెలిపారు.

దిల్‌రాజు మాట్లాడుతూ “ఖుషీ సినిమా సమయంలో గుహన్ నాకు అసోసియేట్ కెమెరామెన్‌గా పరిచయమయ్యారు. ఆతర్వాత సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగారు. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కథలోని కొత్తదనం అర్థమవుతుంది. కల్యాణ్‌రామ్ ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చేయాలని చూస్తుంటారు”అని చెప్పారు. నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమాలో పనిచేసిన నివేదా, షాలిని, నాజర్ సహా అందరికీ థాంక్స్. కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రతిసారి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రేక్షకులు, అభిమానులను మెప్పించడానికి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కె.వి.గుహన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు”అని పేర్కొన్నారు. దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ “కొత్త పాయింట్‌ను నమ్మి ఈ సినిమా చేయడానికి అంగీకరించిన కల్యాణ్‌రామ్‌కు థాంక్స్. నివేదా చుట్టూనే ఈ సినిమా నడుస్తుంది. ఆమె చక్కగా నటించారు. తన పాత్రకు ప్రాణం పోశారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత షాలిని పాండే మా సినిమాలో నటించినందుకు ఆమెకు థాంక్స్‌”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నివేదా థామస్, షాలిని పాండే, మిర్చి కిరణ్, శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

118 Movie Audio Launch