Home తాజా వార్తలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు కనిపిస్తాయి

ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు కనిపిస్తాయి

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నివేదా థామస్, షానిలి పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “118 ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్ చూస్తే సినిమా సబ్జెక్ట్ తెలిసిపోతుంది. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. దర్శకుడు గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. గతంలో కూడా నేను కొత్త దర్శకులతో పనిచేశాను. ఇక గుహన్ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆయన చెప్పిన కథ నాకు ఎంతగానో నచ్చింది. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రానికి రక్షణ, అన్వేషణ అనే టైటిళ్లను పరిశీలించాం. కానీ అవన్నీ రొటీన్‌గా అనిపించాయి. చివరికి కథానుసారంగా సినిమాకు ‘118’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. సినిమాలో స్విమ్మింగ్ నేపథ్యంలో ప్రత్యేకంగా సీన్లు ఉంటాయి. నాకు ఈత పెద్దగా రాదు. ఈ సినిమా కోసం ఈత నేర్చుకున్నాను. ప్రేక్షకులను అలరించే కమర్షియల్ అంశాలన్నీ ‘118’లో ఉంటాయి. సినిమాలో నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను. ఇది నాకు కొత్త జోనర్ సినిమా. ప్రతి నిమిషం ఏం జరుగుతుంది? అన్న సస్పెన్స్‌తో సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. గుహన్ చాలా మంచి దర్శకుడు. ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో సహజంగా ఉండేలా నాతో డైలాగ్స్ చెప్పించారు దర్శకుడు గుహన్. ఈ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకుంటానన్న నమ్మకం నాకుంది. నా నెక్స్ సినిమా కోసం కొన్ని స్క్రిప్టులు విన్నాను. అద్భుతమైన కథలు నా దగ్గరకు వచ్చాయి. ఇక తొందరలోనే ఓ వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. టీనేజ్ లవ్‌స్టోరీతో వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. యూత్‌కు ఇది బాగా నచ్చుతుంది. వెబ్ సిరీస్ గురించి ప్రస్తుతం గ్రౌండ్‌వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఓ మంచి వెబ్ సిరీస్‌ను నిర్మిస్తాను”అని అన్నారు.

118 movie Kalyan Ram press meet