Home తాజా వార్తలు ‘118’ను డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్నిచ్చింది

‘118’ను డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్నిచ్చింది

నందమూరి కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “దర్శకుడు కె.వి.గుహన్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. నాకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రమిది. గుహన్ నెక్స్ సినిమాను కూడా నాతో చేయాలని కోరుకుంటున్నాను.

మా తారక్ తొలి ప్రేక్షకుడిగా సినిమా గురించి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. తనకు ఈ సందర్భంగా థాంక్స్. నివేదా థామస్ ఈ సినిమాకు సెకండ్ హీరో. తన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్‌ను మా నాన్నకు అంకితమిస్తున్నాను”అని అన్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “డిస్ట్రిబ్యూటర్‌గా 23 ఏళ్లు పూర్తయ్యాయి. అందులో కొన్ని అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ చిత్రం కూడా నిలిచిపోతుంది. ఇటువంటి మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు ఆనందాన్నిచ్చింది”అని తెలిపారు. దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ “దర్శకుడు కావాలనుకున్న నా కలను కల్యాణ్‌రామ్ ఈ సినిమాతో నిజం చేశారు. అందుకు ఆయనకు థాంక్స్. ఆయనతో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. నాకు సక్సెస్‌తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టిన చిత్రమిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేష్ కోనేరు, హీరోయిన్లు నివేదా థామస్, షాలినీ పాండే తదితరులు పాల్గొన్నారు.

118 Movie Success meet