Home ఎడిటోరియల్ థాయ్ రెస్కూ అద్భుతం

థాయ్ రెస్కూ అద్భుతం

Article about Modi china tour

థాయిలాండ్‌లో ఒక గుహలో చిక్కుకుపోయిన 12 మంది ఫుట్‌బాల్ బాల క్రీడాకారులను, వారి కోచ్‌ని మృత్యువు కోరల నుంచి విజయవంతంగా రక్షించిన ఆ ప్రభుత్వ కృషి అపూర్వం, అద్భుతం. గజఈతగాళ్లు ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఆదివారం నలుగురిని, సోమవారం నలుగురిని, మంగళవారం మిగతా నలుగురు బాలురను, కోచ్‌ని సురక్షితంగా వెలికి తెచ్చిన సాహసం కొనియాడదగింది. దాదాపు 15 రోజులపాటు గుహలోపల చిక్కుకుని, భారీ వర్షపు నీరు కబళించే ప్రమాదం కళ్లముందు కనిపిస్తున్నా గుండెదిటవు కోల్పోక, భయాన్ని దరిచేరనీయక ఆ బాలురు చూపిన మనోధైర్యాన్ని ప్రశంసించటానికి పదాలు దొరకవు. చిమ్మచీకట్లలో వారు గడిపిన వాతావరణం ఎంత భయానకమైందో ఊహించవలసిందే. వెలుపల వారి తల్లిదండ్రు ల మనోవేదన వర్ణనాతీతం. ప్రభుత్వ యంత్రాంగం గందరగోళ పడకుండా ప్రణాళికాబద్ధంగా ఎంతో చాకచక్యంతో నావికాదళం సహాయంతో బాలురను రక్షించటంతో ఎంతో ఉత్కంఠతో ఎదురు చూచిన ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
అది ఉత్తర థాయిలాండ్‌లోని థాం లుయంగ్ గుహ సముదాయం. విహార యాత్రా ప్రదేశం. “వైల్డ్ బోయర్స్‌” అనే ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు (1116 సంవత్సరాల మధ్య వయస్కులు), వారి 25 ఏళ్ల కోచ్ ప్రాక్టీసు మ్యాచ్ తదుపరి సరదాగా గుహలోకి వెళ్లారు. భారీ వర్షం పడటంతో వర్షపు నీరు గుహలోకి చేరటంతో లోపల చిక్కుకుపోయారు. వరద నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. దాదాపు వారం రోజులపాటు వారి గూర్చి బయట ప్రపంచానికి తెలియదు. గుహ వెలుపల చెప్పులు, బూట్లు వగైరా సరంజామాను గుర్తించటంతో ఎట్టకేలకు జాడ తెలుసుకునే సహాయక చర్యలు ప్రారంభమైనాయి. బ్రిటీష్ గజఈతగాళ్లు ముందుగా వారిని చేరుకుని ఆహారం అందించి ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులనుద్దేశించి బాలలు పంపిన లేఖలు వారి గుండె ధైర్యాన్ని ప్రస్పుటం చేశాయి. రెండో వైపున, ప్రభుత్వం వారిని రక్షించే చర్యలకు ఉపక్రమించింది. కాని అది ఎంతో కష్టసాధ్యంగా తోచింది. బాలురు చిక్కుకున్న ప్రదేశం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారిని చేరుకునే సొరంగం వంకరటింకరగా, ఎత్తుపల్లాలతో, కొన్ని చోట్ల వెడల్పుగా, మధ్యమధ్యలో సన్నగా ఉంది. వరద వల్ల నీటితో నిండి ఉంది. అక్కడికి చేరుకోవటం ప్రళయమైతే అక్కడి వారిని తీసుకుని తిరుగు ప్రయాణం మహాప్రళయం. గుహలో నీటిమట్టం పెరగకుండా 24 గంటలు నీరుతోడేందుకు అనేక పెద్ద పంపులు ఉపయోగించారు. దానివల్ల వర్షాలు కొనసాగినా లోపల నీరు పెరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. థాయ్ నావికాదళం సీల్స్‌కు చెందిన గజ ఈతగాళ్లు ముందుగా లోపలికి తాడు ఏర్పాటు చేసి ప్రాణ వాయువు సిలెండర్ వగైరా రక్షణలతో లోపలికి ప్రవేశించారు. తాడు సహాయంతో సొరంగ మార్గం గుండా తొలిరోజు నలుగురు బాలురను బయటకు తీసుకురావటానికి 12 గంటల సమయం పడితే రెండో రోజు 910 గంటలేపట్టింది. మూడవ రోజు ప్రయత్నం మరింత ఉత్కంఠ భరితమైంది. అద్భుతమైన సహాయక కృషిలో సఫలమైన నావికాదళ అధికారుల సంతోషానికి అవధులు లేవు. తల్లిదండ్రులు సంతోషభాష్పాలు జాలువారుతున్న నేత్రాలతో ఆలింగనాల్లో మునిగితేలారు. రక్షించిన బాలురు, కోచ్‌ని అధికారులు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో ప్రత్యేకించిన ప్రదేశానికి చేర్చారు. అంటువ్యాధుల వంటి జబ్బులేమైనా శోకాయేమోనని డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. దాదాపు రెండు వారాలపాటు సరిగ్గా అన్నపానీయాలకు నోచుకోని ఆ అత్యుత్సాహ ఔత్సాహిక క్రీడాకారులు సంపూర్ణ ఆరోగ్యవంతులై వారి కుటుంబాల్లో చిరునవ్వులు పండిస్తారని ఆకాంక్షించుదాం. శుభాకాంక్షలు తెలియజేదాం.
పర్వతారోహణం, అటవీ సంచారం, జలసంధులు దాటే ఈత, కార్ రేస్‌లు వగైరా సాహసకృత్యాలు మానవ మనుగడలో భాగం. అయితే తర్ఫీదు పొందిన ప్రవీణులు వాటిలో పాల్గొంటారు. కాని థాయిలాండ్ బాలుర ఉదంతం పూర్తిగా భిన్నమైంది. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల్లో హోరాహోరీ సమరం స్ఫూర్తితో కావచ్చు ఫుట్‌బాల్ ఆడుకుంటూ సరదాగా గుహలో ప్రవేశించారు. అనూహ్యమైన ప్రమాదం ఎదురైంది. అపూర్వమైన సహాయక చర్యలు వారి ప్రాణాలు కాపాడాయి. భయాన్ని దరిచేరనీయకుండా రెండు వారాలపాటు సాహస జీవితంలో విజయులైన బాలలు వారిని రక్షించిన యంత్రారంగం అభినందనలకు పాత్రులు.