Home జాతీయ వార్తలు కశ్మీర్‌లో 12 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో 12 మంది ఉగ్రవాదులు హతం

indఎన్‌కౌంటర్లలో ముగ్గురు జవాన్లు, నలుగురు పౌరులు మృతి 

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం మూడు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ముగ్గురు జవాన్లు, నలుగురు పౌరులు మృతి చెందారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన భారీ ఎదురు కాల్పుల ఘటనల్లో ఇవి పెద్దవని ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మీ, పోలీసు, సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారులు, జమ్మూకశ్మీర్ పోలీసు చీఫ్ ఎస్‌పి వేద్‌లు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ము జైహిదీన్, లష్కరే తోయిబా వంటి గ్రూపులకు చెందిన ఉగ్రవాద మూకలకు ధీటైన సమాధానం చెప్పామని వారు అన్నారు. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతమవగా, అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది మృతి చెందాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా డ్రగాద్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారి గా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురుకాల్పులకు దిగడంతో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి పెద్దసంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంత్‌నాగ్ జిల్లా దియాల్గమ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యారు. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. షోపియాన్ జిల్లా కచ్‌దూరలో కూడా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ నలుగురైదుగురు ఉగ్రవాదులు స్థానికులను బందీలుగా చేసుకొని నక్కి ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతాబలగాలు దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్ జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బనిహల్, శ్రీనగర్ మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని సున్నితమైన లోయ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు.