Home అంతర్జాతీయ వార్తలు మానవ విజయం

మానవ విజయం

int

 థాయ్ గుహనుంచి 13 మంది క్షేమంగా బయటికి   

మే సాయ్: థాయిలాండ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్ కోచ్ అందరూ సురక్షితంగా బైటపడ్డారు. మంగళవారం చిన్నారుల్లో మిగిలిన నలుగురిని, వారి కోచ్‌ను సహాయక సిబ్బంది సురక్షితంగా బైటికి తీసుకు రావడంతో రెండు వారాలుగా చిన్నారుల తల్లిదండ్రులతో పాటుగా ప్రపంచమంతా ఎంతో ఆదుర్దాగాఎదురు చూసిన వారి కథ సుఖాంతం అయింది. ఆది, సోమవారాల్లో సహాయక సిబ్బంది గుహలోపల చిక్కుపడి ఉన్న 13 మందిలో ఎనిమిది మందిని సురక్షితంగా బైటికి తీసుకు రావడం తెలిసిందే. కాగా మంగళవారం మిగతా నలుగురు చిన్నారులు , వారి కోచ్‌ను అత్యంత సంక్లిష్టమైన సొరంగం మార్గంగుండా బైటికి తీసుకు రావడంతో గుహవద్ద వేచి ఉన్న వేలాది మందిలో ఒక్క సారిగా హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. ‘ 12 మంది ‘ వైల్డ్‌బోర్స్’, వారి కోచ్ అందర్నీ గుహలోంచి బైటికి తీసుకు వచ్చాం ’ అని థాయిలాండ్ నేవీకి చెందిన ప్రత్యేక దళం ‘సీల్’ ఒక ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది. అందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్న సీల్ మూడు రోజుల పాటు సాగిన రెస్కూ మిషన్ బిజయవంతంగాముగిసినందుకు గుర్తుగా తమ ట్రేడ్‌మార్క్ అయిన ‘హూయా’తో పోస్ట్టును ముగించింది. మంగళవారం బైటికి తీపుకు వచ్చిన అయిదుగురిని హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సైతం వారిని కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. చివరికి చిన్నారుల తల్లిదండ్రులను కూడా అనుమతించ లేదు. కాగా ఆస్పత్రిలో థాయ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచా చిన్నారులను కలిసినట్లు చెబుతున్నారు. ఆయన మొదట గుహ వద్దకే వెళ్లాలని భావించారని, అయితే సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెబుతున్నారు.
జూన్ 23న ఈ 12 మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్ కోచ్‌తో కలిసి ప్రఖ్యాత థామ్ లువాంగ్ గుహను సందర్శించడానికి వెళ్లగా భారీ వర్షాల కారణంగా గుహలో వరద ఉధృతి పెరిగి అందులోనే చిక్కుకు పోవడం తెలిసిందే. తొమ్మిది రోజుల తర్వాత వారికి బ్రిటీష్ గజ ఈతగాళ్లు గుర్తించారు. అయితే గుహలో నీటిమట్టం పెరగడం, బురద పేరుకు పోయిన కారణంగా చిన్నారులను బయటికి తీసుకు రావడం సవాలుగా మారింది. సరయిన ఆహారం లేక చిన్నారులు నీరసించి పోవడంతో పాటు ఎవరికీ ఈత రాకపోవడంతో సహాయక చర్యలు కత్తిమీద సాముగా మారాయి. అయితే గుహలో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతూ ఉండడంతో పాటు గుహ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రమాదకరమైనా సొరంగ మార్గం గుండా చిన్నారులను బైటికి తీసుకు రావాలని సహాయక బృందాలు నిర్ణయించాయి. గుహలోంచి చిన్నారులకు తోడుగా ఉండి తీసుకు రావడానికి 50 మంది విదేశీ గజఈతగాళ్లు, మరో నలభై మంది థాయిలాండ్ డైవర్లతో సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం నలుగురిని, సోమవారం మరోనలుగురిని తీసుకు వచ్చిన సహాయక సిబ్బంది మంగళవారం చివరి సారిగా మిగతా అయిదుగురిని బైటికి తీసుకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొదటి రెండు రోజుల్లో కాపాడిన ఎనిమిది మంది చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్ల్లు అధికారులు మంగళవారం చెప్పడంతో వారంతా త్వరగా కోలుకొని కుటుంబ సభ్యులను చేరుకునే అవకాశాలు మెరుగైనాయి. ముందు జాగ్రత్తచర్యగా మాత్రమే ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండడం కోసమే చిన్నారులను ఎవరూ కలుసుకోవడానికి అనుమతించడం లేదని డాక్టర్లు చెప్తున్నారు.