Home అంతర్జాతీయ వార్తలు శ్రీలంకలో మానవ బాంబులు

శ్రీలంకలో మానవ బాంబులు

Sri Lanka bombings15 మంది మృతి, మృతుల్లో చిన్నారులు

కొలంబో/న్యూఢిల్లీ : శ్రీలంక తూర్పు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో మొత్తం 15 మంది మృతి చెందారు. గత ఆదివారం నాటి ఈస్టర్ నేపథ్య పేలుళ్లకు బాధ్యులని అనుమానిస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో కొలంబోకు 360 కిలోమీటర్ల దూరంలోని కల్మూనాయ్ నగరంలో ఒక ఇంట్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి దాడికి దిగారు. ఇరు పక్షాలు మధ్య చాలా సేపు ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం, బాంబులు పేల్చడం చివరికి మానవబాంబులుగా తమను తాము పేల్చుకోవడం వంటి ఘటనలు జరిగాయి. దీనితో ఆరుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా మొత్తం 15 మంది మృతి చెందారు. ఈ మేరకు మృతదేహాలను గుర్తించినట్లు అధికారవర్గాలు శనివారం తెలిపాయి. సైనిక బలగాలు, స్థానిక పోలీసులు, ప్రత్యేక నిఘా దళాలు సంయుక్తంగా ఉగ్రవాదుల ఏరివేత చర్యలు చేపట్టాయి. అయితే స్థానిక ఉగ్రవాద సంస్థ జాతీయ తౌహీత్ జమాత్ చెందిన అనుమానితులు ఒక నివాసంలో భారీ ఆయుధాలతో ఉండి సంయుక్త బృందంపై విరుచుకుపడ్డాయి. ఈ ప్రాంతంలో చాలా సేపటివరకూ పరస్పర కాల్పులు, పేలుళ్లు, హాహాకారాలు మార్మోగాయి.

మృతులలో ముగ్గురు మానవబాంబులుగా గుర్తించినట్లు, కాల్పుల క్రమంలో మృతి చెందిన వారిలో స్థానికుడొకరు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. గాయపడ్డ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సయంతమురుత్తూ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నట్లు, శ్రీలంకలో ఈ వారాంతంలో తిరిగి దాడులకు దిగేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

శ్రీలంకకు వెళ్లొద్దు : భారత విదేశాంగ శాఖ

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంకకు అత్యవసరం అయితే తప్ప వెళ్లవద్దని దేశ ప్రజలకు భారత ప్రభుత్వం సూచించింది. గత ఆదివారం శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా జరిగిన భీకర పేలుళ్లు, అత్యధిక సంఖ్యలో జననష్టం పరిణామాలతో ప్రభుత్వం పౌరులకు ఈ ప్రయాణ, పర్యాటక సలహాను వెలువరించింది. గతంలో శ్రీలంకకు పర్యటనలు ఖరారు చేసుకున్న వారు కూడా ఇప్పుడు మానుకుంటే మంచిదని, అత్యవసరం కాని ప్రయాణాలను రద్దు చేసుకోవడం మేలని సూచించారు.

15 die in blast during raid on suspected hideout