Home తాజా వార్తలు 15 మంది కూలీలు బలి

15 మంది కూలీలు బలి

accdnt

మృతుల్లో బాలుడు 

వ్యవసాయ కార్మికుల ట్రాక్టర్ మూసీ కాలువలో బోల్తా
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో ఘోర విషాదం
మృతులంతా మహిళలు, డ్రైవర్ నిర్లక్షమే కారణం?

మన తెలంగాణ/ వలిగొండ / నల్లగొండ : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ మూసీ కాల్వలోకి పల్టీ కొట్టడంతో 15 మంది మృత్యువాతపడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వలిగొండ మండలం వేములకొండకు చెందిన వెంకటనారాయణ అనే కౌలు రైతు భూమిలో పత్తి విత్తనా లు విత్తేందుకు వెళ్తున్న మహిళా వ్యవసాయ కూలీలతో కూడిన ట్రాక్టర్ (ఎపి16 ఎపి 8775) గ్రామ శివారులో అదుపు తప్పి మూసీ కాల్వలోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వ నీటిలో మునగడంతో అందులో ప్రయాణిస్తున్న 30 మంది ట్రాక్టర్ కింద చిక్కుకుపోగా 14 మంది మహిళా కూలీలతో పాటు మూడేళ్ల బాలుగు సహా మొత్తం 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానిక గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన రక్షించారు. మృతి చెందిన వారిలో వేములకొండకు చెందిన పంజాల భాగ్యమ్మ(30), అంబాల రాములమ్మ(60), అర్రూరు మణెమ్మ (40), జక్కల మారెమ్మ(55), బందారపు స్వరూప (32), బీసు కవిత (25), తాడిగల్ల లక్షమ్మ (35), తాడిగల్ల మానస (18), తాడిగల్ల నర్మద (25), ఇంజమూరి శంకరమ్మ(35), ఇంజమూరి నర్సమ్మ (50), గన్నెబోయిన ఆండాలు (40), ఏనుగుల మాధవి (25), బోయ శకుంతల (23)తో పాటు మరో మహిళా కూలీ తన వెంట తీసుకువచ్చిన ఆమె కుమారుడు బోయ మల్లిఖార్జున్ (03) ఉన్నారు. ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడుపుతూ నిర్లక్షం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వలిగొండ గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిందిలా : మూసీ నది నుండి వేములకొండ చెరువులకు వచ్చే నల్ల కాల్వ కట్ట మీదుగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించె క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టి కాల్వలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. హఠత్తుగా జరిగిన ప్రమాదంతో కూలీలు తేరుకునేలోపు కూలీలతో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ తిరుగబడి కాల్వనీటిలో, ఒండు కమ్మేసి కూలీలకు ఊపిరాడక 14 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు, ఒకరు ఆస్పుత్రిలో మృతి చెందారు, కొందరు కూలీలు ధైర్యంచేసి ట్రాక్టర్ ట్రాలీ నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు, ఈ క్రమంలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయ పడిన 10 మందిని చికిత్స నిమిత్తం 108 ద్వారా రామన్నపేట ప్రభుత్వ ఆస్పుత్రి తరలించారు. ప్రమాదం నుండి బయట పడిన ఒక కూలి వేములకొండ గ్రామం చేరుకొని గ్రామస్తులకు ప్రమాద వార్తను తెలపడంతో గ్రామస్తులు అక్కడి చేరుకొని కాల్వలో బోర్ల పడ్డ ట్రాక్టర్ ట్రాలీని, ఇంజన్ నుండి వేరు చేసి బోర్ల పడ్డ ట్రాలీని లేపి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఘోరం జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
వేములకొండలో విషాదఛాయలు: ట్రాక్టర్ ప్రమాదంలో గ్రామానికి 15 మంది మహిళా వ్యవసాయ కూలీలు మరణించడంతో వేములకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం కూలీకని వెళ్ళి అంతలోనే దుర్మరణం పాలుకావడంతో గ్రామంలో వారి బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో ఒకే కుటుంబంలోని తల్లి కూతురు, తల్లి కొడుకు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోడం గ్రామస్తులను కలిచివేసింది. మృతదేహాలను గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి మృతుల బందువులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆసుపత్రి ప్రాంగణం జనసంద్రంగా మారింది.
తండోపతండాలుగా వచ్చిన జనం : ప్రమాద వార్త తెలిసి దుర్ఘటన ప్రదేశానికి జనాలు తండోప తండాలుగా తరలివచ్చి విగత జీవులుగా పడిఉన్న వారిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజక వర్గం ఇంచార్చి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరమర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి వైద్యాధికారులతో మాట్లాడి శవాలను ట్రాక్టర్ ద్వారా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వేములకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శవాలకు పంచనామను నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించే విధంగా ఏర్పాట్లను చేశారు.
సిఎం కెసిఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి దిగ్భ్రాంతి
మానవీయ కోణంలో ఆదుకుంటాం: జగదీష్‌రెడ్డి
వలిగొండ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారు ప్రకటించారు. దుర్ఘటన వార్తను తెలునుకున్న మంత్రి గుంత కండ్ల జగదీశ్‌రెడ్డి హుటాహుటిన సంఘటన గ్రామానికి చేరుకున్నారు. మృతులకు సంతాపాన్ని, వారి కుటుంబాలను పరమర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, అపద్బంధు పథకం కింద రూ.50 వేలను అందిస్తామని మంత్రి ప్రకటించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి మృతుల కుటుంబాలకు స్వంత నిధుల నుండి రూ.1.10 లక్షలను ఒక్కొక్కరికి ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. మంత్రి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాకు సంతృప్తి చెందని మృతుల బందువులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆసుపత్రి గేటు మూసివేసి మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలను డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు ధర్నాలో పాల్గొని మంత్రి బయటకు వెళ్లకుండా దారికి అడ్డంగా దీక్షను చేశారు. పిహెచ్‌సిలోనే మంత్రిని నిలువరించడంతో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు సమన్వయంతో వ్యవహరించి సమస్య జటిలం కాకుండా వ్యవహరించారు. తీవ్ర ఉత్కంట నడుమ మంత్రి జగధీశ్‌రెడ్డి పోలీసుల సహాకారంతో బయలుదేరి వెళ్ళారు. ఈ ప్రమాద ఘటన స్థలానికి ఇంచార్జీ జిల్లా కలెక్టర్ జనగాం జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, డిఐజి సురేంద్రబాబు సందర్శించి వివరాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు.