Search
Saturday 22 September 2018
  • :
  • :

1576 స్వైన్‌ఫ్లూ కేసులు

మృతులు 22 మంది
గత ఆగస్టు 1 నుంచి ఏడాది కాలపు నివేదిక వెల్లడి

H1N1

హైదరాబాద్: సంవత్సర కాలం లో 1576 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, వారిలో 22 మంది మరణించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వచ్చిన అనుమానిత కేసులు, నిర్వహించిన పరీక్షలు, స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులను నమోదు చేసే ప్రక్రియకు వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చు ట్టింది. దీని ప్రకారం గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి ఈ ఏడాది జులై 31వ తేదీ వరకు వివిధ జబ్బులు, లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చి న వారిలో 11,957 మందిలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. వారి నమూనాలను పరీక్షలు జరిపించగా వారిలో 1576 మందిలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండ గా వీరిలో 22 మంది చికిత్స పొందుతూ వివిధ ఆసుపత్రుల్లో కన్నుమూశారు. తాజాగా జులై 31న వివిధ ఆసుపత్రులకు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో వచ్చిన 12 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఒకరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు.
ప్రజలు సహకరించాలి : స్వైన్‌ఫ్లూ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ కోరారు. తీవ్రమైన జ్వరం, తుమ్ములతో కూడిన దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటి స్వైన్‌ఫ్లూ లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇలాంటి లక్షణాలున్న పౌరులు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని, తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, ఇతరులతో చేతులు కలిపి పలకరించుకోవడాన్ని మానుకోవాలని, దగ్గు, తుమ్ములు వచ్చే సమయంలో ముక్కును, నోటిని మూసుకోవాలని ఆయన సూచించారు.
ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలి : స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వచ్చే రోగులను వెంటనే ఆసుపత్రుల్లో చేర్చుకొని ఆ వ్యాధి ఇతర ప్రాంతాలకు, ఇతరులకు ప్రబలకుండా సహకరించాలని ప్రైవేటు ఆసుపత్రులను ఆయన కోరారు. ఆ లక్షణాలు కలిగిన రోగిని వెంటనే పరీక్షించాలని, ఒంటరిగా ఉంచాలని, నమూనాలను ఆ రోగి చిరునామా, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్‌తో సహా ఇన్‌స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం)కు పంపించాలని ఆయన సూచించారు. ఒకవేళ ఆ రోగి ప్రైవేటు ఆసుపత్రిలో చేరేందుకు ఆసక్తిగా లేకపోతే తప్పనిసరిగా గాంధి ఆసుపత్రికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. స్వైన్‌ఫ్లూ రాకుండా నివారించేందుకని హోమియో ఔషధాలను తీసుకునే వారు తప్పనిసరిగా ఆ మందులను హోమియో వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని ఆయన సూచించారు. రామాంతపూర్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రితో పాటు అన్ని ఆయుష్ డిస్పెన్సరీలలో ఈ మందులను ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా అన్ని బోధన, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Comments

comments