Home ఆఫ్ బీట్ ప్రియురాలి మృతదేహంతో…

ప్రియురాలి మృతదేహంతో…

Lovers

బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసి మృతదేహాన్ని బైక్‌పై పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం బళ్లారిలో కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక సిరిగేరి గ్రామానికి చెందిన దావల్‌సాబ్ (24) అనే యువకుడు, హనుమంతమ్మ(19) అనే యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం కాస్తా యువకుడి ఇంట్లో తెలియడంతో అతడి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెంటనే దావల్‌కు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతమ్మ తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఇన్నాళ్లు తనను ప్రేమించి ఇప్పుడు వేరే యువతితో పెళ్లికి రెడీ అయిన దావల్‌పై నన్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్న దావల్‌సాబ్ ఆదివారం ఆమెతో కలిసి బైక్‌పై గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ దావల్ ఆమెతో నీలో లోపం వుంది, నీకు వేరొకరితో సంబంధం ఉన్నట్లు నాకు తెలిసిందన్నాడు.

అంతేగాక నాకు పెళ్లి నిశ్చయమైంది, నీవు ఉంటే నా పెళ్లి జరగదని చెప్పాడు. కావున నీవు నన్ను మరిచిపోవాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో వారిద్దరీ మధ్యలో కాసేపు వాగ్వాదం జరిగింది. దాంతో ఇద్దరు అక్కడి నుంచి బయల్దేరి కొంత దూరం వచ్చాక… ప్రియుడు లేని జీవితం వ్యర్థమనుకున్న హనుమంతమ్మ అతడిని ఇప్పుడే వస్తానని చెప్పి బైక్‌ దిగింది. ఆ తరువాత కొంతదూరం వెళ్లి తన చున్నీతో చెట్టుకు ఉరి వేసుకొంది.

అయితే ఎంతసేపటికీ హనుమంతమ్మ రాకపోవడంతో దావల్ వెళ్లి చూశాడు. కాగా, అప్పటికే ఆమె చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దాంతో దావల్ ప్రియురాలి మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించి బైక్‌పై వేసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అనంతరం జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. దీంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు దావల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.