Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నాన్నలాగే నేను సైతం..

lf

నేరస్తులను పరుగులు పెట్టించిన సి.బి.ఐ మాజీ జె.డి. లక్ష్మీ నారాయణ వారసుడిగా ఆయన కుమారుడు సాయి ప్రణీత్ పోలీస్ విభాగంలో ఐపిఎస్ అధికారిగా ఉద్యోగానికి రానున్నాడు. ప్రణీత్ చిరకాల లక్షం ఐ.పి.ఎస్ సాధించాలి! 2017 సివిల్స్ పరీక్షలలో 196 ర్యాంక్ సాధించడంతో ఆ ఆశయం నెరవేరింది. బాల్యం నుంచి నాన్న లక్ష్మీ నారాయణను ఆదర్శంగా తీసుకొని అడుగులు వేసి సివిల్స్ లో ర్యాంక్ సాధించాడు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి సమాజానికి తోడ్పడాలన్న కాంక్షతో సివిల్స్ వైపు దృష్టి సారించాడు. బిట్స్‌పిలానీలో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థికి జీవితం వడ్డించిన విస్తరి అని తెలిసి కూడా ఆ రంగాన్ని వదులు కొని సివిల్స్‌వైపు చూపు ప్రసరించాడు..విజేతగా నిలిచాడు. తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచి పుత్రోత్సాహం కలిగించిన సాయి ప్రణీత్‌తో విజేత ముఖాముఖి..

బిట్స్ పిలానిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మీరు సివిల్స్ వైపు ఎందుకు దృష్టి సారించారు?
‘నాన్నను ఆదర్శంగా తీసుకుని నిబద్ధతతో, నిస్వార్థంగా సమాజానికి సేవలు అందించాలనే ఆశయంతో సివిల్స్ వైపు దృష్టి సారించాను. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ సివిల్స్ సాధించాలనే పట్టుదల నాలో ఉఁడేది. అందుకే సివిల్స్‌కు మొగ్గుచూపాను. బిట్స్‌లో ఇంజనీరింగ్ చేసినపుడు లాంగ్ అవర్స్ చదివేవాణ్ణి. దానికి అదనంగా మరో ఎనిమిది గంటలు కేటాయించుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఇంజనీరింగ్ చదవడానికి, సివిల్స్‌కు ప్రిపేర్ అవడానికి చాలా తేడా ఉంటుంది. సివిల్స్ రాయాలంటే ప్రణాళికాబద్దంగా శ్రమించాలి. దానికి తగ్గ మైండ్‌సెట్ పెట్టుకునే కష్టపడ్డాను.
చిన్నప్పటి నుంచే ఈ పట్టుదల ఉందా..?
నాన్నను అర్థం చేసుకునే వయసు వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో 7వ తరగతి చదువుతున్నప్పుడే ఈ పట్టుదల కలిగింది. ఎంత కష్టమైనా సరే సివిల్స్ రాయాలనే కోరిక బలపడింది. హైదరాబాద్ భారతీయ విద్యా భవన్‌లో చదువు పూర్తిచేసి బిట్స్ పిలానిలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను. ఆ వేడి అలా ఉండగానే ఈ పెద్ద టార్గెట్ కొట్టాలని సివిల్స్‌కు ప్రిపేరయ్యాను.
సివిల్స్‌లో ఏ అంశాలపై దృష్టి సారించారు ?
ఇంజనీరింగ్ చదవడంతో ఇతర అంశాలు తప్పని సరైనవి. అనేక సబ్జెక్టులపై దృష్టి సారించాల్సి వచ్చింది. ఇందులో ప్రాధాన్యం ఉన్న అంశాలను నోట్స్ లో రాసుకుని ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను. పోలిటికల్ సైన్స్, అంతర్జాతీయ సంబంధాలను ఎంపిక చేసుకుని చదవడం ప్రారంభించాను. నా పై నాకు పూర్తిగా నమ్మకం వచ్చిన అనంతరం పరీక్షరాయడానికి సిద్దపడ్డాను, తొలి ప్రయత్నంలోనే నాకల నెరవేరడం ఆనందంగా ఉంది.
మీ ర్యాంకుతో ఐ.పి.ఎస్ వస్తుంది. సివిల్స్ లో మరో ప్రయత్నం చేస్తారా ?
నాకు ఇష్టమైంది ఐ.పి.ఎస్. మరో ప్రయత్నం చేయను. వచ్చిన ర్యాంకుతోనే ముందుకు వెళ్ళి బాధ్యతలు నిర్వహిస్తాను. చిన్నప్పటి నుంచి అనుకున్న లక్షం నెరవేరుతుందనే ఆనందం ఉంది. మరో ప్రయత్నం ఎందుకు. ఏ ఉద్యోగమైనా అంకిత భావంతో చేయడంలోనే ఆనందం ఉంది.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది ?
తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించినందుకు నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. నాన్నను ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వహిస్తాను. పోస్టింగ్ తెలంగాణలో వస్తుందని అనుకుంటాను. ఎక్కడ వచ్చినా సంతోషంగా విధులు నిర్వహిస్తాను. పోలీసు అధికారిగా సమాజానికి సేవ చేసే అవకాశం వచ్చి నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

Comments

comments