Home జాతీయ వార్తలు ఇద్దరికి ఉరి

ఇద్దరికి ఉరి

అబూ సలేంకు, మరొకరికి జీవిత ఖైదు

1993 ముంబయి పేలుళ్ల కేసులో శిక్షలు

terror

ముంబయి : వందలాది మందిని పొట్టన పెట్టుకున్న 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేశారు. ఇద్దరికి ఉరిశిక్షను, ఇద్దరికి జీవిత ఖైదును ప్రకటించారు. స్థానిక టాడా న్యాయస్థానం గురువారం ఇద్దరు దోషులు తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్‌కు మరణశిక్షను, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం, మరో దోషి కరీముల్లా ఖాన్ కు జీవితఖైదును ఖరారు చేశారు. ఈ కేసులో ఐదవ దోషి రియాజ్ సిద్ధిఖీకి పది సంవత్సరాల కారాగార శిక్షను విధించా రు. ముబయి పేలుళ్ల కేసు విచారణకు ఏ ర్పాటైన ప్రత్యేక టాడా న్యాయస్థానం ఈ ఏడాది జూన్‌లోనే ఆరుగురిని దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ప్రకటించింది. పేలుళ్లకు కీలక సూత్రధారులుగా భావిస్తు న్న సలేం, ముస్తఫా దోసాలను దోషులుగా నిర్ధారించారు. మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూంను సరైన సాక్షాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా వదిలేశారు. ముంబ యి పేలుళ్లలో 257 మంది దుర్మరణం చెంది, ఇప్పటికీ పలువురిని వికలాంగులుగా, తమ వారి స్మృతులతోబాధాతప్తులుగా మిగిల్చిన 24 ఏళ్ల దారుణ కేసులో ఇప్పుడు నేరస్థులకు శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురిపై బహుళస్థాయి అభియోగాలు ఉన్నాయి. దేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యాకాండకు దిగడం , నేరపూరిత కుట్ర వంటి అభియోగాలపై తీవ్రస్థాయి విచారణ జరిగింది. విచారణ రెండో దశలోనే ఓ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు.
సలేం కీలక కుట్రధారి.. . ఆయుధ సప్లయర్
ఈ కేసులో సలేం ప్రధాన కుట్రధారులలో ఒకరని ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు. ఆయన ముంబైలో మారణహోమానికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడు. నటుడు సంజయ్ దత్‌కు మూడు ఎకె 56 రైఫిళ్లు, పేలుడు పదార్థం, చేతి బాంబులు అందించినట్లు జూన్ 16 నాటి టాడా తీర్పులో ప్రకటించారు. విచారణ తొలి దశలోనే సంజయ్‌దత్‌ను ఆయుధాల చట్టం పరిధిలో దోషిగా ఖరారు చేసి శిక్ష విధించారు. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం, దోసాకు సలేం సన్నిహితుడు. డిగీ పోర్ట్ నుండి నుంచి ముంబైకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ముంబైకి చేరవేసే బాధ్యతను సలేం తీసుకున్నాడు.“ ఆయుధాల చేరవేత పేలుళ్ల కుట్రలో కీలక భాగం. ఎంచుకున్న స్థావరాలకు ఈ మారణాయుధాలు చేరవేయడం ద్వారా అమాయకులైన భారత పౌరులను భయభ్రాంతులను చేసి, వారిని బలితీసుకునే కుట్ర సాధించుకోవడం జరిగింది’ అని టాడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దోషిగా కోర్టు తీర్పు వెలువడ్డ తరువాత జూన్ 28నే ముస్తఫా దోసా గుండెపోటుతో స్థానిక జెజె హాస్పిటల్‌లో చనిపోయాడు. కేసులో సలేం, ముస్తఫా, కరీముల్లా, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తాహీర్, మర్చంట్‌ల అరెస్టులు వేర్వేరుగా జరగడంతో వీరిపై విచారణ ప్రధాన కేసుతో విడగొట్టి వేర్వేరుగా జరిగింది. తాహీర్ మర్చంట్ ప్రధాన కుట్రదారులలో ఒకరని కోర్టు తెలిపింది. పరారీలో ఉన్న కుట్రదారు టైగర్ మెమన్‌కు మర్చంట్ అన్ని విధాలుగా సహకరించాడు. దుబయ్‌లో జరిగిన కుట్ర వ్యూహరచన సమావేశాలకు హాజరయినట్లు గుర్తించారు. ఇక తాహీర్ అందరికీ కావాల్సిన ప్రయాణ ఏర్పాట్లు చేశారు. డబ్బులు సమకూర్చడం, దాడులలో పాత్రధారులకు వసతి, ప్రయాణ, భోజన ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలు తీసుకున్నాడు. తాహీర్ పాత్ర కుట్రలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కుట్రకు ఆద్యులలో ఆయన ఒకరని న్యాయస్థానం తీర్పులో తెలిపింది.
పోర్చుగల్ ఒప్పందంతో సలేంకు తప్పిన ఉరిశిక్ష
కీలక కుట్రదారుగా సలేంను ఖరారు చేసినా ఉరిశిక్ష వేయడం కుదరదని టాడా కోర్టు తెలిపింది. దావూద్‌కు సన్నిహితుడు అయిన సలేం, భారత్ నుంచి పోర్చుగల్‌కు పారిపోయిన దశలో అక్కడి పోలీసులు ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సలేంను అప్పగించింది. పోర్చుగల్ నిబంధనల మేరకు గరిష్ట శిక్ష జీవిత ఖైదు. దీనితో పోర్చుగల్‌తో కుదిరిన నేరస్థుల ఒప్పందం ప్రకారం అబూ సలేంకు ఉరిశిక్ష వేయలేకపోతున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
దావూద్ ఆదేశాలతో ఒకే రోజు 12 పేలుళ్లు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాలతోనే ముంబై పేలుళ్లు 1993 మార్చి 12న జరిగాయి. రెండు గంటల వ్యవధిలో ఉగ్రవాదులు వరుసగా 12 చోట్ల పేలుళ్లు జరిపారు. ఘటనలలో 257 మంది చనిపోగా, 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిబిఐ జరిపిన సుదీర్ఘ విచారణలో పలు కీలక అం శాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగానే డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, ముస్తఫా దోసాలు కలిసి దేశ వాణిజ్య, బహుళ సంస్కృతుల నగరం ముంబైలో దాడులకు వ్యూహం పన్నారు. దుబాయ్ కేంద్రంగా కుట్ర రచన సాగిందని సిబిఐ విచారణలో వెల్లడైంది