Home తాజా వార్తలు ఆన్‌లైన్‌లోనే అసెస్మెంట్

ఆన్‌లైన్‌లోనే అసెస్మెంట్

 

 

 రెండేళ్లలో పన్ను చెల్లింపుల్లో సమూల మార్పులు
 పన్ను చెల్లింపుదారుడు లేకుండానే ఐటిఆర్ పనులు
 గతేడాదిలో ఆన్‌లైన్ ద్వారా 2.06 లక్షల అసెస్మెంట్ కేసుల పరిశీలన
 సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ: రెండేళ్లలో ఆదాయం పన్ను చెల్లింపుల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని, ప్రత్యక్షంగా పన్ను చెల్లింపుదారులు లేకుండా ఆన్‌లైన్ విధానంలో అసెస్మెంట్‌లు నిర్వహించే రోజులు వస్తాయని సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. పన్ను అధికారులతో ప్రత్యక్షంగా ఎదుర్కోకుండా, అంటే పన్ను చెల్లింపుదారుడు లేకుండానే అసెస్మెంట్‌లు జరుగుతాయని ఆయన అన్నారు. బడ్జెట్ అనంతరం ఒక ఇంటర్వూలో సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) చైర్మన్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న సులభతర విధానాల్లో భాగంగా ముందస్తుగా నింపిన రిటర్న్ ఫామ్‌లను అస్సెస్సీలు దాఖలు చేయవచ్చన్నారు. పన్ను చెల్లింపుదారులకు ‘పేరులేకుండా’ సేవలందించే ప్రక్రియలో భాగంగా గతేడాదిలో ఐటి శాఖ ఆన్‌లైన్ ద్వారా 2.06 లక్షల ఆదాయం పన్ను అసెస్మెంట్ కేసులను పరిశీలించిందని అన్నారు. ఐటి శాఖలో అత్యాధునిక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్(సిపిసి) 2.0ను నెలకొల్పేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతిచ్చిందని సుశీల్ చంద్ర తెలిపారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్ ప్రతిపాదనలకు మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు. సిపిసి 2.0లో కొత్త ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ప్రాథమిక సమాచారం లేకుండానే పన్ను చెల్లింపుదారులకు ప్రిఫిల్డ్ రిటర్న్ ఫామ్‌ను ఇవ్వడం జరుగుతుందని, దీంతో టిడిఎస్(టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) నుంచి వారి గురించి తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ 24 గంటల్లోనే నిర్వహించే సౌకర్యం వస్తోందని, ఈ విధానాన్ని రెండేళ్లలో ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. ఈ వేగవంతమైన రిటర్న్ ప్రక్రియతో పన్ను పరిధి విస్తృతమవుతుందని చంద్ర వివరించారు. మనిషిలేకుండానే అసెస్మెంట్, రిటర్న్‌ల పరిశీలన చేసేందుకు ఐటి శాఖ సమాయత్తమవుతోందని తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై సిబిడిటి చీఫ్ స్పందిస్తూ.. ఐటి శాఖ ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిందని అన్నారు. ఇప్పటి కూడా చాలా తక్కువ ఐటి రిటర్న్ కేసులు అంటే మొత్తంలో 0.46 శాతమే పరిశీలనలో ఉన్నాయి. 99.54 శాతం ఐటిఆర్‌లను అంగీకరించామని ఆయన తెలిపారు. వచ్చే రోజుల్లో సగటు పన్ను చెల్లింపుదారుడి ఐటిఆర్‌ను పరిశీలించేటప్పుడు రెండు దశల విధానాన్ని అవలంభిస్తామని అన్నారు. తొలుత ఐటి శాఖ పరిశీలన మాత్రమే నిర్వహిస్తుంది. అసెస్మెంట్ కోసం అసెసింగ్ అధికారులు వెళ్లరు. ‘పన్ను చెల్లింపుదారుడి గురించి సమాచారం పొందినట్లయితే మేము దానిని ఇమెయిల్ ద్వారా పంపుతాము. ఆఫీస్ సమస్యను పరిష్కరిస్తుంది. కేసుకు సంబంధించిన మరింత సమాచారం అవసరం లేకపోయినట్లయితే ఈ అంశాన్ని ఇంతటి ముగిస్తారు’అని చంద్ర వెల్లడించారు.

2.06 lakh Assessment Cases Observation in Online