Home రాష్ట్ర వార్తలు కందిపై దిగుమతుల కత్తి

కందిపై దిగుమతుల కత్తి

kndl

*దేశంలో ఈసారి కూడా
అధిక ఉత్పత్తి, రాష్ట్రంలో
తగ్గిన సాగు
*గత ఏడాది అనుభవమే
కారణం
*దిగుమతులు తగ్గిస్తేనే మోక్షం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కందుల ఉత్పత్తి ఈసారి కూడా అధికంగా రానుంది. ఈ ఏడాది మొత్తంగా 2.20 కోట్ల మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్‌లోకి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మన దేశ జానాభా వినియోగానికి దగ్గరగా ఉత్పత్తి చేరింది. మన రాష్ట్రంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది మద్దతు ధర రాకపోవడమే ఇందుకు కారణం. 2017 -18 సంవత్సరానికి కేంద్రం కందులకు క్వింటాలుకు రూ. 5450 మద్దతు ధరగా ప్రకటించింది. దేశవాప్తంగా 2.40 కోట్ల మెట్రిక్ టన్నుల కందుల వినియోగిస్తున్నారు. గత రెండేళ్లుగా కందుల ఉత్పత్తి, ఇతర దేశాల నుంచి దిగుమతులు పెరగడంతో ప్రస్తుత మార్కెట్‌లోకి వస్తు న్న కందులకు మద్దతు ధర రావడం లేదు. గత ఏడా ది రికార్డు స్థాయిలో 2.26 కోట్ల మెట్రిక్ టన్నులు కందుల ఉత్పిత్తి వచ్చింది. మద్దతు ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా దిగుమతులు తగ్గించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం దిగుమతి సుంకం 25 నుంచి 30 శాతం వరకు పెంచనున్నట్లు మార్కెటింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మన దేశం నుంచి పప్పు ఎగుమతి చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. ఫలితంగా 3 నుంచి 4 శాతం ఎగుమతులు పెరిగి, లోకల్ మార్కెట్‌కు కూడా డిమాండ్ వస్తుందని, కందులకు మద్దతు ధర లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కందులకు ధర రాకపోవడం రైతుల ను పప్పుధాన్యాల సాగుకు దూరం చేస్తోందని, తద్వారా ఉత్పత్తి పెంచే ప్రణాళికలు బెడిసికొట్టే ప్ర మాదం ఉందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘మన తెలంగాణ’కు చెప్పారు. మయన్మార్‌లో బహుళ జాతి సంస్థ కంపెనీలు కందులను కొనుగోలు చేస్తున్నాయని, పరిమితులు తొలగించిన అనంతరం 2018లో మన దేశానికి దిగుమతి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2.5 లక్షల టన్నుల కొనుగోలు జరిగిందని, ఇది 4 లక్షల టన్నుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఇటువంటి తరుణంలో కేంద్రం దిగుమతులను పరిమితం చేస్తేనే కంది రైతులకు మద్ధతు ధర లభిస్తుందని మార్కెటింగ్ నిపుణలు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో తగ్గిన ఉత్పత్తి.. అయినా మద్దతు లేదు !
రాష్ట్రంలో ఈసారి 6.27 లక్షల ఎకరాల్లో కంది పంట సాగైంది. గతేడాది కంది విస్తీర్ణం 10.77 లక్షల ఎకరాలు ఉంది. ఈసారి 1.65 లక్షల టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కంది పంట నూర్పిడి డిసెంబర్‌లో మొదలవుతుంది. మార్చి వరకు మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటికే కొన్నిచోట్ల మార్కెట్‌కు వచ్చింది. అయితే మద్ధతు ధర మాత్రం రావడం లేదు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ప్రారంభించింది.