Home మంచిర్యాల పురిటి నొప్పులతో.. 2 గంటల నిరీక్షణ

పురిటి నొప్పులతో.. 2 గంటల నిరీక్షణ

2 hours expectation with twine pain

వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
అవతలి ఒడ్డుకు నిలిచిన 108 వాహనం
నిండు చూలాలును వరద ప్రవాహం దాటించిన కుటుంబీకులు
పలు గ్రామాలకు ఆర్‌టిసి బస్సుల నిలిపివేత
గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ బురదమయం

మనతెలంగాణ/మంచిర్యాల: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణీకి అందుబాటులో అంబులెన్స్ సదుపాయం ఉన్నప్పటికీ వాగులు ఉప్పొంగడం కారణంగా 2 గంటల పాటు అవస్థలు పడుతూ వాగు ఒడ్డున నిరీక్షించాల్సి వచ్చింది. ఇవతలి ఒడ్డుకు 108 వాహనం వచ్చి అందుబాటులో ఉన్నప్పటికి వరద ప్రవాహాన్ని దాటి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిండు చూలాలు పురిటినొప్పులతో పలు అవస్థలకు గురై చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబీకుల సాయంతో వరద ప్రవాహాన్ని దాటి 108 వాహనం వద్దకు చేరుకోగా వారు కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 108 వాహనం వచ్చి 2 గంటల పాటు ఇవతలి ఒడ్డుకు ఉన్నప్పటికి వాగును దాటి రాలేక పలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంఘటన కోటపల్లి మండలంలో గురువారం వెలుగు చూసింది. మండలంలోని కోడెవాగు ఉప్పొంగడంతో ఆ ప్రాంతంలోని 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం జనగామకు చెందిన కొడిపె శోభ పురిటి నొప్పులతో బాధపడుతూ 108 వాహానికి ఫోన్ చేశారు. అయితే వాహనం వాగు వద్దనే నిలిచిపోగా శోభను ఆటో రిక్షాలో వాగు వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవాహం తగ్గకపోవడంతో 2 గంటల పాటు వాగు వద్దనే నిరీక్షించాల్సి వచ్చింది. మంచిర్యాల, కొమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షాల వల్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలకు ఆర్‌టిసి బస్సులను నిలిపివేశారు. తాండూర్ మీదుగా తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లే దారిలో ఉన్న గంభీరావ్‌పేట గ్రామ శివారులలో పెద్దవాగు ఉప్పొంగడంతో బస్సులను నిలిపివేయగా మండల కేంద్రానికి రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. మంచిర్యాల జిల్లాలో 12.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, కొమురంభీం జిల్లాలో 11.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తొలకరి వర్షాలకే మారుమూల ప్రాంతాల్లోని రోడ్లన్నీ బురదమయంగా మారి కాలినడక కూడా కష్టంగా మారింది. వాగులు ఉప్పొంగడంతో అత్యవసర పనుల నిమిత్తం ప్రజలు ప్రాణాలకు తెగించి వాగులను దాటుతున్నారు. పలు చోట్ల వాగులు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి, భీమారం, చెన్నూర్, వేమనపల్లి, నెన్నెల, భీమిని మండలాలతో పాటు కొమురంభీం జిల్లాలోని తాండూర్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట, బెజ్జూర్, మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. చెన్నూర్ మార్గంలోని సుద్దాల వాగు, దహెగాంలోని ఎర్రవాగు, బెజ్జూర్‌లోని మత్తడి వాగులు, ఉప్పొంగగా జన్నారంలోని తాత్కాలిక రోడ్డు భారీ వర్షాలకు కొట్టుకొపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించి, విద్యార్థులు సైతం ఇండ్లకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏదిఏమైనా తొలకరి వర్షాలకే రోడ్లన్నీ బురదమయంగామారి కాలినడక కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.వర్షకాలం వచ్చిందంటే చెన్నూర్, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలను అడుగడుగునా మోకాలి మంటి బురద వెంటాడుతుంది. ప్రధాన రోడ్లతో పాటు గ్రామాలకు వెళ్లే అంతర్గత రహదారులన్నీ బురదమయం కావడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు ప్రతీ సంవత్సరం ఉప్పొంగడం వల్ల మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయినప్పటికీ వంతెనలు నిర్మించే విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.