Home ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ఆదిలాబాద్‌: జందాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల మండలానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందడం విషాదం నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బేలకు చెందిన జల్‌పెల్లివార్ సంతోష్, మంగళ దంపతుల కుమారుడైన జల్‌పెల్లివార్ శుభమ్, మండలంలోని మణియార్‌పూర్‌కు చెందిన మునేశ్వర్‌వార్ మహాదేవ్, కౌలస్యభాయిల కుమారుడు మునేశ్వర్ దినేష్‌లు మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. వీరికి మంగళవారం ఆధిలాబాద్‌లో మీటింగ్ ఉండగా అది పూర్తిచేసుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బేలకు తిరుగు పయనమయ్యారు. ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై బేలకు వెళ్తుండగా జందాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఎత్తుగా ఉన్న జాతీయ రహదారిపై నుంచి బ్రిడ్జిని ఢీకొట్టి పడిపోయారు. రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడ్డ తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయగా ఎలాంటి స్పందనా లేదు. వారి స్నేహితులు, ఇతరులును ఆరా తీసినా ఆచూకి లభించలేదు. బేల నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్డు వెంట గాలించగా బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారి ఆచూకి లభించింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలోనే మృతి చెందారా లేక ఆచూకి దొరకని కారణంగా సకాలంలో చికిత్స అందక మృతి చెందారా తెలియడం లేదు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా వారిద్దరూ కూడాను తల్లిదండ్రులకు ఏకైక కుమారులు కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతులిద్దరి తల్లులు అంగన్వాడీ కార్యకర్తలు కావడంతో విషయం తెలిసిన అంగన్‌వాడీ టీచర్లు రిమ్స్‌కు చేరుకుని వారిని పరామర్శించారు. గత రాత్రి నుంచి వీరి ఆచూకీ కోసం గాలించామని, అయినా పత్తా తెలియలేదని బేలకు చెందిన దేవన్న తెలిపారు. రాత్రి నుంచి వెతకగా జందాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద హైవే బ్రిడ్జి కింద విగత జీవులై కనిపించారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జోగురామన్న, ఇతర టీఆర్‌ఎస్ నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, మృతుల వివరాలను తెలుసుకున్న ఆయన యువకుల మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

2 persons died in Road Accident in Adilabad