Home అంతర్జాతీయ వార్తలు 2015 జ్ఞాపకాల్లో..

2015 జ్ఞాపకాల్లో..

memories-2015తీపి, చేదు సమ్మిళిత జ్ఞాపకాల ప్రస్థానంగా 2015 సంవత్సర కాలచక్రం పరుగులు తీసింది. 365 రోజుల ప్రస్థానం ఇట్టే గడిచిపోయింది. వేదనలు, రోదనలు, విజయాలు, విషాదాలు, సంతోషాలు, సంబురాలు వెన్నంటి నడిచాయి. అంతలోనే ఆనందం, మరికొద్ది సేపటికే ఆవిరైన సంతోషం వార్తలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉగ్రవాదం పేట్రేగిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు పడగ విప్పాయి. పలుచోట్ల శాంతికి విఘాతం కలిగింది. ఏదిఏమైనప్పటికీ ఈ షడ్రుచుల ఏడాది ప్రపంచ యవనికపై చెరగని ముద్రనే వేసింది.
చెన్నైలో వరద బీభత్సం
ఎల్‌నినో ప్రభావం తీవ్ర వానల రూపంలో చెన్నైను మంచెత్తింది. ఇది అత్యంత ఘోర విపత్తుగా వార్తలోకెక్కింది. దాదాపు 400 మంది మరణించగా, 18 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సెప్టెంబర్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రకృతి ప్రకోపానికి చెన్నై నగరం అతలాకుతలం అయింది. చెన్నై వానలను గూగుల్ పెద్ద విశేష వార్తగా గుర్తించింది. దాదాపు ఈ అంశంపై 26 మిలియన్ల మంది సెర్చ్ చేశారట. చెన్నై వానలపై దాదాపు 1.4 మిలియన్ ట్వీట్‌లు కూడా ఇంటర్నెట్‌లో చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాలో చెన్నై వానలు ప్రాధాన్యతను సంతరించుకుంది. వరదలకు కొట్టుకు పోతున్నవారిని, మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ప్రజలు, విపత్తు రక్షకులు ఎంత ధైర్య సాహసాలు కలసికట్టుగా కనబరిచారో దృశ్యాల్లో చూస్తే ఎవరికైన గుండెలు తరుకుపోతాయి. చైన్నై వర్షం చాలా ఏళ్ల తర్వాత ఇంత విధంసం సృష్టించిందని చారిత్రక రికార్డు వల్ల తెలుస్తోంది.
రిజర్వేషన్ కోటా కోసం హార్దిక్ పటేల్ ఆందోళన
గుజరాత్‌లో పటిదార్(పటేల్) కులస్థులకు ఒబిసి రిజర్వేషన్ కోటా ఇవ్వాలని ఆందోళన చేసిన హార్దిక్ పటేల్ కేవలం 22 ఏళ్ళకే గుజరాత్‌లో ప్రసిద్ధుడయ్యాడు. విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ కులస్థులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన చేసిన డిమాండును గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తిరస్కరించారు. ఆయన చేపట్టిన ఆందోళన చివరికి హింసాత్మకంగా మారింది. ప్రస్తుతం అతడు రాజద్రోహం సహా వివిధ అభియోగలపై అరెస్టయి జైల్లో ఉన్నాడు.
ప్రధాని విదేశీ పర్యటనలు
2015లో ప్రధాని నరేంద్ర మోడీ అనేక దేశాలు పర్యటించారు. వాటిలో అమెరికా,ఇంగ్లాండు, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, కెనడా, చైనా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్ ఉన్నాయి. చివరగా ఆయన పాకిస్థాన్‌కు కూడా ఆకస్మికంగా, అనూహ్యంగా పర్యటించారు.
భారత్-పాక్ చర్చలు
ఆగస్టులో భారత-పాకిస్థాన్ చర్చలు చివరి నిమిషంలో అర్ధాంతరంగా రద్ధయ్యాయి. భారత్ ముందస్తుగా పెట్టిన షరతుల ఆధారంగా చర్చలు జరపలేమని పేర్కొంటూ పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చలను రద్దు చేసుకుంది. కాగా జాతీయ భద్రత విషయంలో, విదేశీ వ్యవహారాల్లో పాకిస్థాన్ ప్రధానికి సలహాదారైన సర్తాజ్ అజీజ్ న్యూఢిల్లీలో హుర్రియత్ నాయకులతో కలవకుండా ఉగ్రవాదం అజెండాకే పరిమితమై చర్చకు వస్తే స్వాగతిస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాజ్‌పేయికి ‘భారతరత్న’
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి మార్చ్ నెలలో ప్రతిష్ఠాతక భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. భారత రాజకీయాలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రధానం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రోటోకాల్‌ను కూడా పక్కన పెట్టి అనారోగ్యంతో ఉన్న వాజ్‌పేయికి సయంగా అవార్డును ఇచ్చారు.
ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ కన్నుమూత
‘పీపుల్స్ ప్రెసిడెంట్ ’గా ప్రసిద్ధుడైన అవుల్ పకీర్ జైనులబుదీన్ అబుల్ కలామ్ షిల్లాంగ్‌లో జులై 27న కన్నుమూశారు. ఆయన మరణం అనేక మందికి ఆవేదన కలిగించింది. ఓ పడవ ఆసామి కుమారుడైన ఆయన భారత దేశ క్షిపణిని రూపొందించే స్థాయికి ఎదిగిన జీవిత విశేషం ఎందరికో స్ఫూర్తిదాయకం. షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ఆయన ఉపన్యసిస్తున్న తరుణంలో గుండెపోటుకు గురై కన్నుమూశారు. భారత దేశం అణు క్షిపణులు రూపొందిం చడానికి కూడా ఆయన ప్రేరణే కారణం. అందుకనే ఆయన్ని మిసైల్ మ్యాన్ అన్న బిరుదుతో పిలుస్తుంటారు. ఆయన భారత 11వ రాష్ట్రపతిగా 2002 జులై 18న బాధ్యతలు చేపట్టారు. ఆయనకు విశిష్ట భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. తమిళనాడులోని రామేశ్వరంలో జులై 30న ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
హేతువాదుల హత్యలపై నిరసనలు

హేతువాది, రచయిత గోవింద్ పన్సారేపై దుండగులు కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 16న ఆయన స్వస్థలం కొల్హాపూర్‌లోనే ఈ దాడి జరిగింది. ఆయన ఆ సంఘటన తర్వాత నాలుగు రోజులకు ఆయన కన్నుమూశారు. కర్నాటకలోని ధార్వాడ్ నగరంలో తన ఇంట్లోనే ప్రముఖ కన్నడ రచయిత ఆగస్టు 30 కాల్పులకు గురై చనిపోయారు. ఈ ఇద్దరు కూడా మూఢవిశ్వాసాలకు, రైట్-వింగ్ గ్రూపులకు వ్యతిరేకంగా మాట్లాడారు. 2013 ఆగస్టులో మరో జాతీయవాది నరేంద్ర దబోల్కర్ కూడా కాల్పులకు గురై మరణించాడు. వీరందరి హత్యల వెనుక హిందూ అతివాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. కానీ ఎవరిపైనా ఎలాంటి అభియోగపత్రం దాఖలు కాలేదు. ఈ ముగ్గురు జాతీయవాదుల హత్యకు నిరసనగా అవార్డుల తిరిగిచేసే ఉద్యమం ఊపందుకుంది.
హిమాలయ రాజ్యంలో పెను భూకంపం
భారత్‌కు పొరుగునే ఉన్న హిమాలయ దేశం నేపాల్‌ను పెను భూకంపం రోడ్డున పడేసింది. ఏప్రిల్ 25వ తేదీన సంభవించిన ఈ భూకంపం నేపాల్ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. వరుస భూ ప్రకంపనలు అక్కడి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఈ విపత్తు బారినపడి దాదాపు 9౦౦౦ మందికి పైగా మృత్యు ఒడికి చేరారు. 23వేల మంది గాయపడ్డారు. నేపాల్ యావత్తూ నెత్తుటి మరకలు, భయానక చేదు జ్ఞాపకాలతో భీతిల్లింది. సకాలంలో భారత్ ఆపన్నహస్తాన్ని అందించి ‘నేనున్నాను’ అంటూ ఓదార్చింది. 34వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం నుంచి నేపాల్‌ను గట్టెక్కించడంలో కొత్త ప్రభుత్వం తలమునకలైంది.
అక్రమాస్తుల కేసుల నుంచి  జయలలితకు విముక్తి
కర్నాటక హైకోర్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అక్రమ ఆస్తుల కేసు నుంచి విముక్తి చేసింది. ఆమెతోపాటు ఆమె స్నేహితురాలు శశికళను, ఆమె బంధువు జె.ఇలవరసి, వి.ఎన్. సుధాకరన్‌లను కూడా విడుదల చేసింది. వారు నిర్దోశులని తీర్పునిచ్చింది. కేసుల నుంచి విముక్తి అయిన కొన్ని రోజులకే ఆమె మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

ఆకాశయానంలో అపశ్రుతులు

అక్టోబర్ 31న సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం మెట్రోజెట్ కుప్పకూలిన ఘటనలో 224మంది దుర్మరణం పాలయ్యారు. ఈజిప్ట్‌లోని షెర్మల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి తామే బాధ్యులమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.మార్చి 24న ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వతాలలో జర్మనీకి చెందిన విమానం కూలిన ఘటనలో 144మంది మరణించారు.
హృదయ విదారకం
ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనల్లో శరణార్థుల అంశం ఒకటి. సెప్టెంబర్ మాసంలో టర్కీ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ మూడేళ్ల సిరియా బాలుడి మృతదేహం హృదయాలను ద్రవింప జేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండాన్ని శరణార్థుల సమస్య సంక్షోభంలోకి నెట్టింది. గత ఏడాది సుమారు 10లక్షల మంది శరణార్థులు మధ్యదరా సముద్రాన్ని దాటినట్టు గణాంకాలు వెల్లడించాయి.
సౌదీ మహిళలకు ఓటు హక్కు

మొదటి సారిగా మహిళలకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఓటు హక్కును కల్పించింది. మున్సిపల్ ఎన్నికల్లో వందలాది మహిళలు పోటీచేయగా, 20మంది మహిళలు విజయ కేతనం ఎగురవేశారు. ఇప్పటి వరకు ఆంక్షల ముసుగులో ఉన్న మహిళలకు ప్రజాస్వామిక స్వేచ్ఛ లభించినట్టు అయింది.
టాప్‌లేపిన కాప్

వాతావరణ మార్పుల ద్వారా నెలకొంటున్న సంక్షోభం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కింపజే యడంలో భారత్ సఫలీకృతమైంది. 190 దేశాల తరపున తన వాణిని వినిపించి ఐక్యరాజ్య సమితిని వాతా వరణ మార్పుల సదస్పును ఆలోచింప జేసింది. వేదికను ఆయుధంగా చేసుకుని తన వాణిని బలంగా వినిపించింది. ఈ అంశంపై సభ్య దేశాలను ఒప్పించి మెప్పించడమే కాకుండా ఒప్పందం కుదుర్చుకునేందుకు మార్గాన్ని సుగమం చేసింది. అదేవిధంగా ఈ సదస్సుకు ముందు పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ఉగ్రవాదాన్ని సమైక్యంగా కూకటివేళ్లతో పెకిలించాల్సిన ఆవశ్యకతను భారత్ ప్రపంచ వేదికపై తన గళాన్ని గట్టిగా వినిపించింది. అంతర్జాతీయ యవనికపై భారత్ సమర్థత రెపరెపలాడింది.
దాద్రీలో దారుణం
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దాద్రీలో మొహ్మద్ ఇఖ్లాక్ కుటుంబం ఓ దూడను చంపి దాని మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచిందన్న వదంతుల కారణంగా జనం ఇఖ్లాక్‌ను ఇంటిలో నుంచి ఈడ్చుకు వచ్చి మరీ కొట్టి చంపారు. అతడి కుమారుడు డానిష్‌ను కూడా ఇటుకలతో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఈ సంఘటన దాద్రీ తహసిల్‌లో గల బిసదలో హిందూ, ముస్లిం శాంతియుత సహజీవనాన్ని దెబ్బతీసింది. పైగా ఈ సంఘటన ఏమి తినాలో ఏమి తినకూడదో అన్నది నిర్దేశిస్తోందని వేలాది మంది దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. నిజానికి వారి ఫ్రిజ్‌లో ఉంచింది మేక మాంసమే కానీ బీఫ్ కాదని ఉత్తరప్రదేశ్ దర్యాప్తు అధికారులు ఇప్పుడు కనుగొన్నారు.
మక్కాలో విషాదం

ముస్లింలకు అత్యంత పవిత్ర యాత్రా స్థలమైన మక్కా నెత్తురోడింది. హజ్ చరిత్ర పుటల్లో ఓ విషాద పేజీ లిఖించబడింది. సెప్టెంబర్ 24న చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రపంచంలోని పలు దేశాల నుంచి తరలివచ్చిన యాత్రికులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.హఠాత్తుగా ప్రారంభమైన తొక్కిసలాట కనీవినీ ఎరుగని రీతిలో 2000 మంది యాత్రికు లను పొట్టనబెట్టుకుంది. మృతుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. అధిక సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మక్కాలో సంభవించిన ఈ అపశృతి ముస్లిం యాత్రికుల అశ్రుధారలతో ‘మహాప్రస్థానం’ అయి విషాదగీతికను పల్లవించింది.ఈ ఘోర ప్రమాదాన్ని టీవీలలో చూసి యావత్ ప్రపంచం కంటతడిపెట్టింది.