Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

తగ్గనున్న ఆహార ధాన్యాల ధరలు

 నిత్యావసర వస్తువులు పన్ను నుంచి మినహాయింపు
 18 శాతం పన్ను పరిధిలోకి 81 శాతం వస్తువులు
 6 వస్తువులపై తప్ప 1,211 వస్తువులపై రేట్లు ఖరారు
 శ్రీనగర్‌లో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం

jatileyశ్రీనగర్ : జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలుతో సామాన్యులకు ఊరట కల్గనుంది. జులై 1 నుంచి అమలు కానున్న ఈ చట్టంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. గురువార శ్రీనగర్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో 14వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో దాదాపు 80 నుంచి 90 శాతం వస్తువుల ధరలపై నిర్ణయం తీసుకున్నారు. పన్నుల నుంచి నిత్యావసర వస్తువులను మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. హెయిర్ ఆయిల్, సబ్సులు, టూత్‌పేస్ట్‌లు వంటి సాధారణంగా వినియోగించే వస్తువుల రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. వీటికి ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాల పన్నులు కలవడంతో 22 నుంచి 24 శాతం వరకు పన్ను పడుతోంది. తాజా నిర్ణయంతో వీటిపై 18 శాతమే పన్ను విధించడం వల్ల ధరలు చాలా వరకు దిగిరానున్నాయి. రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ రెండు రోజుల సమావేశంలో.. తొలి రోజు 6 వస్తువులపై తప్ప అన్ని రకాల వస్తువులకు రేట్లను ఖరారు చేశారు. జిఎస్‌టి అమల్లోకి వస్తే పన్ను పరిధి నుంచి పాలు, పెరుగును మినహాయించనున్నారు. మిఠాయి లేదా తీపి వస్తువులపై 5 శాతం పన్ను పడనుంది. రోజూ వినియోగించే చక్కెర, టీ, కాఫీ(ఇన్‌స్టంట్ కాఫీ మినహాయించి), నూనెలపై తక్కువ పన్ను 5 శాతం విధించనున్నారు. జిఎస్‌టి నుంచి ఆహార ధాన్యాలను మినహాయించడం వల్ల గోదుమ, బియ్యం రేట్లు దిగిరానున్నాయి. ప్రస్తుతం వీటిపై రాష్ట్రాల వ్యాట్(విలువ ఆధారిత పన్ను) పడుతోంది.
రెండో రోజు భేటీలో సేవలపై పన్ను రేట్ల ఖరారు
మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. గురువారం జరిగిన సమావేశంలో మినహాయిం పు జాబితాతో సహా చాలావరకు వస్తువులకు పన్ను రేట్లను ఖరారు చేశామన్నారు. ఆరు వస్తువులు మినహా 1,211 రకాల వస్తువులపై తొలి రోజు నిర్ణయం తీసుకున్నామని.. బంగారం, పాదరక్షలు, బ్రాండెడ్ వస్తువులు, బీడీలు సహా మిగతా వస్తువులపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మిగతా వస్తువులకు రేట్లు ఖరారు చేశామని, ప్యాకేజీ ఆహార వస్తువుల ధరలు ఖరారు చేయాల్సి ఉందని అన్నారు. సేవలపై పన్ను రేట్లపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. మినహాయింపు జాబితా పరిధిలోకి 7 శాతం వస్తువులు, తక్కు పన్ను శ్లాబు 5 శాతం పరిధిలోకి 14 శాతం వస్తువులు వస్తాయి. 12 శాతం పన్ను పరిధిలోకి 17 శాతం వస్తువులు, 18 శాతం పన్ను పరిధిలోకి 43 శాతం, గరిష్ఠ పన్ను శ్లాబు 28 శాతం పరిధిలోకి 19 శాతం వస్తువులు మాత్రమే రానున్నాయి. తక్కువ పన్ను శ్లాబు అయిన 18 శాతం పన్ను పరిధిలోకి దాదాపు 81 శాతం వస్తువులు రానున్నాయి. శీతల పానియాలు, కార్లు 28 శాతం పన్ను శ్లాబ్‌లోకి వస్తాయి. బంగారంపై రాష్ట్రాలు 4 శాతం పన్నును డిమాండ్ చేస్తున్నాయి. 28 శాతం పన్ను శ్లాబ్‌లోకి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు రానున్నాయి. చాలా వరకు రేట్లు తగ్గుముఖం పడుతున్నాయని, ద్రవ్యోల్బణం ప్రభావం ఏర్పడబోదని జైట్లీ అన్నారు. బొగ్గుపై ప్రస్తుతం ఉన్న 11.69 శాతం పన్నుతో పోలిస్తే 5 శాతమే విధించనున్నారు.
సామాన్యులు వాడే వస్తువులపై ఎక్కువ పన్నుతో ఇబ్బందులు: ఈటెల
ఈ సమావేశంలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ….. సామాన్యులు వాడే వస్తువులపై ఎక్కువ పన్ను విధిస్తే, ఎక్కువ ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించవచ్చు కాని, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ భావించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయం కోసం చూడకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విషయం పై దృష్టి సారించాలన్నారు. సామాన్యలు వాడే వస్తువుల పై ఎక్కువ పన్నులు విధించడం వల్ల ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్రానికి సూచించారు.
కేంద్ర మంత్రి అనిల్ మాదవ్ దవే మృతికి సంతాపం
జిఎస్‌టి సభ్యులతో పాటు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఇందులో పాల్గొన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి అనిల్ మాదవ్ దవే అకాల మరణం పట్ల సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. జిఎస్‌టిని ఏడు నిబంధనలను కౌన్సిల్ ఆమోదించిందిని, మిగిలిన రెండింటిటిని మాత్రం ఒక లీగల్ కమిటీకి నివేదించామని మొదటి రోజు సమావేశం అనంతరం జైట్లీ చెప్పారు. ఈ సమావేశానికి తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఏపి ఆర్ధిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు, అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

Comments

comments