Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

సన్‌రైజర్స్‌ను వర్షమే ముంచింది…!

rain-in-match

క్రీడా విభాగం:
డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వర్షం శాపంగా మారింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఎలమినేటర్ మ్యాచ్‌లో వర్షం ఆటంకం కలిగించక పోతే హైదరాబాద్‌కే అవకాశాలు అధికంగా ఉండేవి. ఎందుకంటే బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై 128 పరుగుల లక్ష్యాన్ని సాధించడం కోల్‌కతాకు అంత సులువు కాకపోయేది. పిచ్ నుంచి లభించే సహకారాన్ని సద్వినియోగం చేసుకునే సత్తా హైదరాబాద్ బౌలర్లకు ఉంది. భారీ వర్షం వల్ల పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. దీంతో కోల్‌కతా విజయలక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48కి కుదించారు. ఇది ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మారింది. ఏ జట్టుకైన ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమి కాదు. ఇక, కోల్‌కతా లాంటి జట్టుకైతే మరింత తేలిక. అయితే ఈ స్వల్ప లక్షం ఛేదించేందుకు కూడా కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది. కేవలం నాలుగు బంతులు మిగిలి వుండగా లక్ష్యాన్ని అందుకుంది. ఒక వేళ 20 ఓవర్ల మ్యాచ్ సాగివుంటే హైదరాబాద్‌కు కూడా మెరుగై న అవకాశాలుండేవి. ఎందుకంటే కోల్‌కతాతో పోల్చితే హైదరాబాద్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, జోర్డాన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. పూర్తి ఓవర్ల మ్యాచ్ ఉంటే భువనేశ్వర్, రషీద్, కౌల్‌లను ఎదుర్కొ వడం కోల్‌కతా బౌలర్లకు కష్టంగా ఉండేది. ఎందుకంటే బెంగళూరుపై రెండో ఇన్నింగ్స్‌లో ఆడడం ఏ జట్టుకైన చాలా కష్టం. ఇక, వర్షం వల్ల తడిసిన పిచ్‌పై అయితే చెప్పాల్సింది ఏమీ ఉండదు. ఎంతటి పెద్ద బ్యాట్స్‌మన్‌కైన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆడడం అంత సులువుకాదు.

మేమే గెలిచే వాళ్లం..
మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు కొనసాగితే తమకే విజయవకాశాలు అధికంగా ఉండేవని హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, మ్యాచ్ పూర్తిగా సాగివుంటే తాము కచ్చితంగా గెలిచే వాళ్లమని మురళీ అన్నాడు. తమ జట్టులో ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నారని, కోల్‌కతాను లక్షం చేరకుండా ఆపే సత్తా వీరికుందన్నాడు. అయితే వర్షం తమ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. తమ ఆటగాళ్లు అనుకున్న దానికంటే మరో 20 పరుగులు తక్కువ చేశారన్నాడు. ఈ పరుగులు సాధించే ఉంటే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగేదన్నాడు.

బాధగా ఉంది: వార్నర్
warnerఐపిఎల్ పదో సీజన్ నుంచి నిష్క్రమించడం చాలా బాధగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. తాము ఈ మ్యాచ్‌లో అనుకున్నంత మెరుగ్గా ఆడలేదన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదన్నాడు. కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా రాణించాడన్నాడు. దీంతో తాము స్వేచ్ఛగా ఆడలేక పోయామన్నాడు. కనీసం మరో 30 పరుగులు చేసి ఉంటే తప్పక గెలిచే వాళ్లమన్నాడు. అయితే బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై తాము ఉంచిన లక్ష్యాన్ని అందుకోవడం కోల్‌కతాకు కూడా అంత సులువయ్యే కాదన్నాడు. వర్షం వల్ల ఓవర్లను కుదించడం తమ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. కాగా, పదో సీజన్‌లో తమ జట్టు ఆట తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్‌కు చేరడం ఆనందం కలిగించిందన్నాడు.  అయితే టైటిల్ రేసుకు చేరకుండానే వైదొలగడం జీర్ణించుకోలేక పోతున్నట్టు వార్నర్ పేర్కొన్నాడు.

Comments

comments