Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా

16 మంది దుర్మరణం, 27 మందికి గాయాలు
19 మంది పరిస్థితి విషమం

Bus-Accident-Amarnath

రాంబాన్/జమ్ము : అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఆదివారం రాంబాన్ జిల్లాలోని జమ్ము, శ్రీనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పింది. అనంతరం లోతైన వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. మరో 27 మంది గాయపడ్డారు. అందు లో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్ చెందిన వారని, మృతి చెందిన 16 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రానికి బెల్టాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల మీదుగా జమ్ము నుంచి 3,603 మంది యాత్రికులను జెకెఎస్‌ఆర్‌టిసి తరలించాల్సి ఉంది. అందులో భాగంగానే యాత్రికులను తీసుకెళ్తుండగా బస్సు అదుపు తప్పి లోతైన వాగులో పడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో పోలీస్, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ జవాన్లు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. వాగులోని నుంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీసినట్లు వారు చెప్పా రు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 మందికి మెరుగైన చికిత్సను అందించేందుకు హెలికాప్టర్ ద్వారా జమ్ముకు తరలించగా, మిగిలిన 8 మందిని బనిహల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గత వారం అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
ప్రధాని దిగ్భ్రాంతి : బస్సు ప్రమాదంలో 16 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి చెందారు. యాత్రికుల మృతి అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొన్నారు.

Comments

comments