Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పోలింగ్ నేడే

పోలింగ్‌కు పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలలో సకల ఏర్పాట్లు
ఉ॥ 10 నుంచి సా॥ 5 వరకు ఓటు వినియోగం
20న లెక్కింపు

Electionsన్యూఢిల్లీ : నేడు జరగనున్న దేశ 14వ రాష్ట్రపతి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంటు హౌస్‌తో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ ఉద యం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. లోక్‌సభ సెక్రెటరీ జనరల్ అనూప్ మిశ్రా ఈ ఎన్నికలకు రిటర్నింగు అధికారిగా వ్యవహరిస్తున్నారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయడానికి వీల్లేదు. ఎంపిలకు పచ్చరంగు, ఎమ్మెల్యేలకు గులాబీ కలరు బ్యాలట్ పేపరును అందిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. బ్యా లట్ పేపరుతో పాటు ఓటర్లకు ప్రత్యేకమైన కలాన్ని కూడా అందిస్తామని వారు చెప్పారు. బ్యాలట్ పేపర్లు విమానాశ్రయం నుండి నేరుగా పార్లమెం టు హౌస్‌కే చేరే విధంగా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీకి సంబంధించిన జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ రీజియన్- ఎన్‌సిఆర్), కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సహా ఎన్నికైన పార్లమెంటులోని ఉభయసభల సభ్యులు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి అర్హులు. ఎలక్టోరల్  కాలేజీలో మొత్తం ఓట్లు 10,98,903. అధికార ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 63 శాతం ఓట్లు ఆయనకు దక్కవచ్చని ప్రాథమిక అంచనా. విపక్షాల  అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేస్తున్న సంగతి విదితమే. తనది సైద్ధాంతిక పోరాటమని, ఆత్మప్రబోధానుసారమే ఓటేయాలని ప్రచారంలో భాగంగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు హౌస్‌లోని 62వ నంబరు గదిలో పోలింగ్  జరగనుంది. ఎంపీలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాలకు కేటాయించిన టేబుళ్ల దగ్గర ఓటేస్తారు.

యుపి నుండి ఎంపీలుగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టేబుల్ నంబరు 6 వద్ద ఓటేస్తారని ఎన్నికలసంఘం (ఇసి) అధికారులు వెల్లడించారు. యుపి ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి, గోవా సిఎం మనోహర్ పారికర్ సహా 55 మంది ఎంపీలు పార్లమెంటు హౌస్‌లో కాకుండా తమ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటేస్తారని ఎన్నికల సంఘం (ఇసి) నివేదిక తెలిపింది. సాధారణంగా ఎంపీలు పార్లమెంటు హౌస్‌లోనూ ఎమ్మెల్యేలు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఓటేయడం ఆనవాయితీ. ఎలక్టోరల్ కాలేజీలో జెడి (యు)కి దాదాపు 1.91 శాతం, ఒడిశాలోని బిజెడికి 2.99 శాతం, టిఆర్‌ఎస్‌కి 2 శాతం, అన్నాడిఎంకె వర్గాలకు 5.39 శాతం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కి 1.53  ఓట్లున్నాయి. ఈ పార్టీలన్నీ రామ్‌నాథ్ కోవింద్‌కే మద్దతును ప్రకటించాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం మీరా కుమార్‌కి మద్దతు ప్రకటించినప్పటికీ, ఆ పార్టీ నేత హెచ్‌ఎస్ ఫూల్కా ఓటింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు. అందుకు కారణం.. ఆమె కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కావడమే. ఈ నెల 20న ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన అభ్యర్థి ఈ నెల 25న కొత్త రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో సమాజ్‌వాదీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వర్గాలుగా విడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రాస్ ఓటింగ్‌కు అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

comments